– పేదల మధ్య చిచ్చు పెట్టేందుకే ఆర్ 5 జోన్ కుట్ర
– తాడికొండ మాజీ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్
ఆర్5 జోన్ పై హై కోర్టు స్టే ఇవ్వడం జగన్ రెడ్డికి చెంప పెట్టు. కోర్టు తీర్పులు తెలిసి కూడా చెల్లని పట్టాలు ఇచ్చి బడుగు, బలహీన వర్గాలను మోసం చేశారు. అమరావతి స్థానిక పేదలకి, బయట పేదలకీ మధ్య రాజకీయ ప్రయోజనం కోసమే రచ్చ కుట్ర చేశారు. అమరావతిలో నిర్మించి ఉన్న 5,200 టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు?
ఇప్పటికైనా జగన్ రెడ్డి రాజకీయ కుట్ర మాని ఏ ఊరి పేదలకు ఆ ఊరిలోనే పట్టా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. అమరావతిలో నిర్మించి ఉన్న టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ది దారులకు ఇవ్వాలి. అమరావతి జెఈసీ దళితుల పట్ల జగన్ రెడ్డి చేసే కుట్రలను కోర్టు సాక్షిగా ఎండగట్టింది. మీ బండారాన్ని బట్టబయలు చేసింది.
రైతులు 1330 రోజుల నుంచి చేస్తున్న దీక్షలకు ప్రతి ఫలమే ఈ తీర్పు. ప్రజా రాజధానిని అమరావతిని నాశనం చేసేందుకే పూనుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రణాళికా బద్దంగా నవనగరాలు నిర్మించేందుకు సంకల్పించింది. ఆర్ – 5 జోన్ లోని స్థలాలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ కంపెనీలు నెలకొల్పేందుకు కేటాయించారు.
అవి వస్తే రాష్ట్రంలోని యువతకు సుమారు 3.80 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ యువత నోట్లో మట్టికొట్టే విధంగా, పరిశ్రమలు రాకుండా చేసేందుకు పరిశ్రమలకు అనుకూలమైన స్థలాలను పేదలకు ఇంటి పట్టా పేరుతో అక్కడ కేటాయిస్తున్నారు. రాజధానిలోని పేదల కోసం ఆర్ – 3 జోన్ లో 2,500 ఎకరాలు భూముల్ని మాస్టర్ ప్లాన్ లో కేటాయించారు. కానీ జగన్ రెడ్డి అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఆర్ -5 లో కేటాయించారు. దానికి కారణం మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టే ప్రయత్నం.