జగన్‌-రేవంత్‌.. సేమ్‌ టు సేమ్‌!

– ఇద్దరి పాలన కూల్చివేతలతోనే షురూ
– ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ పాలన ప్రారంభం
– ప్రజావేదిక ఇనుక గేట్లు కూల్చివేతతో రేవంత్‌ పాలన ఆరంభం
– 6 కోట్ల భవనాన్ని నేలకూల్చిన జగన్‌పై అప్పుడు విమర్శలు
– జనాలకు అడ్డుగోడగా ఉన్న ఇనుము గేట్లు కూల్చడంపై రేవంత్‌కు ప్రశంసలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి-తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ సంచలనకారులే. కాకపోతే దారులే భిన్నం. వ్యవహారశైలే విభిన్నం. నిర్ణయాలలో అసలు పోలికే లేదు. కాకపోతే ఒక విషయంలో మాత్రం ఒకే పద్ధతి పాటించారు. అదే వారిని వార్తలకెక్కించింది. అదేమిటో చూద్దాం రండి.

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీని ఓడించి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ గద్దెనెక్కారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అధికారులతో కరకట్టమీద చంద్రబాబు నివాసానికి పక్కనే నిర్మించిన ప్రజావేదికలో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రజావేదికను కూల్చాలని వేదికపైనే ఆదేశించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దానితో రంగంలోకి దిగిన అధికారులు ప్రజావేదికను నేలకూల్చారు.

నిజానికి 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికను చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం కూడా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చు. అసలే విజయవాడలో ప్రభుత్వానికి అంత విశాలమైన స్థలాలు గానీ, భవనాలు గానీ అందుబాటులో లేవు. ప్రైవేటు ఫంక్షన్‌ హాళ్లే దిక్కు. అలాంటిని సువిశాలమైన ప్రజావేదికలో ఐఏఎస్‌-ఐపిఎస్‌ అధికారుల సమావేశాలు, ప్రభుత్వ శాఖల సమీక్ష లు చేసుకోవచ్చు. పైగా ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. వీటిని దృష్టిలో ఉంచుకునే అప్పుడు చంద్రబాబు ప్రజావేదిక నిర్మించారు. కానీ దానిని జగన్‌ సర్కారు సద్వినియోగం చేసుకోకుండా.. కేవలం చంద్రబాబు నిర్మించారన్న ఒకే ఒక కారణంతో నేలకూల్చడం విమర్శలకు తావిచ్చింది. జగన్‌ కూల్చివేతలతోనే పాలన ప్రారంభించారని.. ప్రజల సొమ్మును నేలమట్టం చేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారంటూ సోషల్‌మీడియాలో దుమ్ము దుమారం రేగింది.

సీన్‌ కట్‌ చేస్తే..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ సీఎం అయిన వెంటనే బేగంపేట కుందన్‌బాగ్‌లోని మంత్రుల క్వార్టర్స్‌ను నేలకూల్చి వైఎస్‌ నిర్మించిన క్వార్టర్‌ను అధికార నివాసంగా మార్చుకున్నారు. దానిని అలాగే కొనసాగిస్తే సరిపోయేది. కానీ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మళ్లీ దానిని పునర్నిర్మించారు. దానికి ప్రగతిభవన్‌ అని నామకరణం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రగతిభవన్‌ వైపు ప్రజలను రానీయకుండా నిలువెత్తు ఇనుప గేట్లు జల్లెడలా నిర్మించారు. దానితో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాల్సి వచ్చింది. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం లోపలికి వెళ్లనిచ్చేవారు కాదు.

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కారును తుత్తునియలు చేసి సంచలన విజయం నమొదు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ గడీలు బద్దలు కొడతామని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ప్రజలను అనుమతిస్తామని, అందుకోసం ప్రజాభవన్‌ గేటు 24 గంటలూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు.

రేవంత్‌రెడ్డి తెలంగాణ రెండవ సీఎంగా, ఎల్‌బిస్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ఒకవైపు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో.. మరోవైపు ప్రగతిభవన్‌కు కాపలాగా ఇనుప గేట్లను, జేసీబీలతో నేలమట్టం చేశారు. అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు ఎత్తివేశారు. దానితో ఆ రోడ్డు విశాలమయింది. రేవంత్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ సమాజం మనసారా ఆహ్వానించి, అభినందించింది. దొరల గడీలు బద్దలు కొట్టి, ప్రజలను సీఎం క్యాంపు ఆఫీసుకు ఆహ్వానించడమంటే… అప్పట్లో నిజాం నవాబుపై పటేల్‌ సాధించిన విజయం మాదిరేనంటూ, నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.

అయితే ఇక్కడే చిన్న తేడా. కేసీఆర్‌ కట్టిన గడీలను నేలమట్టం చేసి, ప్రగతిభవన్‌ను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన రేవంత్‌ను, యావత్‌ తెలంగాణ సమాజం అభినందిస్తుంటే… ఆరుకోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను, జగన్‌ కూల్చివేయడాన్ని ఆంధ్రులు ఆక్షేపించారు. ఇద్దరి పాలన కూల్చివేతలతోనే ఆరంభమైనా..‘ బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’ అని నెటిజన్లు, బాలకృష్ణ డైలాగులతో కామెంట్‌ చేస్తున్నారు.

Leave a Reply