* ఇచ్చేది లేదన్న కేంద్రం
* మరి కేంద్రంపై రణమా? రాజీనా?
* ఎంపీలు మళ్లీ రాజీనామా బాట పడతారా?
* రాష్ట్రపతి ఎన్నికను సద్వినియోగం చేసుకుంటారా?
* రాష్ట్రంలో పెరుగుతున్న ఒత్తి‘ఢీ’
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగుని పోరాడిన యోద్ధ ఆయన. ప్రజల గుండెచప్పుడు విని, తమ ఎంపీలతో రాజీనామాలు చేయించిన దమ్మున్న జననేత. అప్పుడాయన ధైర్యానికి యావత్ ఆంధ్రావని మురిసిపోయింది. అంత తెగింపు ఉన్న యువనేత వచ్చాడని సంబరపడింది. అది నాటి పాలకులకు సంకట ప్రాయమయింది. చివరలో అదే అంశంపై కేంద్రంతో
విబేధించి బయటకొచ్చినా, పాలకపార్టీని జనం నమ్మలేదు.అదే అంశంపై నాటి సీఎం చంద్రబాబు బీజేపీని లక్ష్యంగా చేసుకున్నా, పదవులకు రాజీనామా చేసిన యువనేత పార్టీనే ఆంధ్రావని నమ్మింది.తనకు 25 ఎంపీ సీట్లిస్తే, ఢిల్లీ పాలకుల చెవులుపిండి మరీ ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. చంద్రబాబు
కేంద్రంతో కేసుల కోసం రాజీ పడ్డారని విరుచుకుపడ్డారు. ఆ యువనేత మొక్కవోని దీక్షకు ముగ్ధులైన జనం, ఎన్నికల్లో ఒక్ముమ్మడిగా ఓటెత్తింది. తమ కలలు పండించే ఆ మొండి మారాజును ముఖ్యమంత్రిని చేసింది. ఆయనే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
సీన్ కట్ చేస్తే..
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మహాబలుడిగా మారిన జగనన్న విభజిత రాష్ట్రానికి రెండో సీఎంగా అవతరించారు. ఇంకేముంది? తిరుగులేని మెజారిటీ, గంపగుత్తగా ఎంపీల సీట్లు దక్కించుకున్న ఆ మహాబలుడు, కేంద్రం చెవులుపిండి హోదా తీసుకువస్తారని అదే ఆంధ్రావని ఆశించింది. కానీ, సీఎం
హోదాలో తొలిసారి హస్తినకు వెళ్లిన జగనన్న..‘ కేంద్రంలో మన మద్దతుతో పనిలేకుండా బీజేపీ అధికారంలోకి రావడం మన ఖర్మ. అయినా సరే.. ప్లీజ్ హోదా కావాలని బ్రతిమాలుతూనే ఉంటాం’ అని ఏపీ మీడియా వద్ద నిర్వేదం వ్యక్తం చేశారు. నిజానికి ఇప్పటివరకూ ఢిల్లీకి వెళ్లిన తర్వాత, ఆయన మీడియాతో మాట్లాడటం అదే తొలిసారి, చివరిసారి కూడా!
గత మూడేళ్లలో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి.. ప్రత్యేక హోదా ఇవ్వాలని అభ్యర్ధించినట్లు ప్రెస్‌నోట్లు రిలీజు అయ్యేవి తప్ప, హోదా ఇవ్వకపోతే ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తారని జగనన్న మునుపటిలా
గర్జించిన దాఖలాలు లేవు. చివరాఖరకు హోదా కోసం ఎలాంటి సంబంధం లేని, సమాచారశాఖ మంత్రిని కూడా కలవడం మరో ఆశ్చర్యం. ఆయనను ఎందుకు కలిశారో సొంత పార్టీకి చెందిన రఘురామకృష్ణంరాజే కుండబద్దలు కొట్టారు కాబట్టి ఆ వివరాలు అప్రస్తుతం. ఈలోగా కేంద్రం కూడా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా అదే మాట చెప్పారు. అప్పుడూ మౌనమే.
కానీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాత్రం, హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామనే ఇప్పటికీ మీడియాకు చెబుతుంటారు. రాజీలేని పోరాటమంటే.. బహుశా వినతిపత్రాలు, హౌస్‌లో హోదా ఎప్పుడు ఇస్తారు? హోదా మీ పరిశీలనలో ఉందా అని ప్రశ్నలు వేయడం కామోసన్నని బుద్ధిజీవుల వ్యాఖ్య.
ఈలోగా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో అందరం పదవులకు రాజీనామా చేసి.. అదే అంశంపై తిరిగి ఎన్నికలకు వెళితే, తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనన్నది ఆయన సవాల్ సారాంశం. అయినా ఆ పార్టీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఆయన ఇప్పటికీ అదే సవాల్ విసురుతున్నారు. బహుశా ఎన్నికల ముందు జగన్‌లో ఉన్న ‘హోదా జోష్’ ఇంకా సజీవంగానే ఉందని రాజు భావిస్తున్నట్లున్నారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితిలో మునుపటి మాదిరిగా ధైర్యంతో ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగనన్నకు లేదని, ఆయనకూ తెలుసన్నది వేరే విషయం. దానికి కారణాలు బోలెడు. ఇక.. హోదా అంశంపై వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే, తాము కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. గతంలో వైసీపీ ఆడిన ‘హోదా గేమ్’లో చిక్కుకుని భంగపడిన టీడీపీ విసిరిన సవాలుకూ వైసీపీ నుంచి జవాబు లేదు.
ఇప్పుడు సీన్ కట్ చేస్తే…
నాటి యోధుడు జగనన్నకు పితలాటకం మొదలయింది. అదెలాగంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, కేంద్రం మరోసారి నిండుసభలో కుండబద్దలు కొట్టింది. అది కూడా విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా! ‘ప్రత్యేకహోదాపై 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేయలేదు. కేంద్రపన్నుల్లో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం. ఏపీ విభజన చట్టంలోని చాలా అంశాలు నెరవేర్చాం’- ఇదీ కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభ సాక్షిగా ఇచ్చిన సమాధానం.
కాబట్టి.. ఇకపై ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్దలు కొట్టినందున.. కేంద్రాన్ని బతిమిలాడుకున్నా, బామాడుకున్నా ఫలితం శూన్యమన్నది సుస్పష్టం. సో.. మిగిలింది రెండే మార్గాలు. కేంద్రంతో రణమా? రాజీనా? అటు ఆంధ్రావనిలో కూడా హోదాపై మళ్లీ ఒతిడి సెగ మొదలయింది. సర్వత్రా హోదా గళం వినిపిస్తోంది.
మరిప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? ఏం చేయబోతోంది? అదే వైసీపీ ముందు బాహుబలిగా నిలిచిన ప్రశ్న.
హోదా ఇచ్చేది లేదని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పిన తర్వాత కూడా.. మరో రెండేళ్లలో బీజేపీ మనసుమారకపోతుందా అన్న ఆశావహ దృక్పథంతో అప్పటివరకూ వేచిచూస్తుందా? లేక ఆంధ్రావని ఆకాంక్షలకు పార్లమెంటులో ఆశాదీపాలుగా ఉన్నందున, ఆ ఆకాంక్షను మరోసారి దేశప్రజలకు చాటేందుకు మునుపటి వాడి వేడితో, మళ్లీ ఎంపీలతో రాజీనామా చేయిస్తుందా? అన్నదే ఇప్పుడు నాటి మహాయోద్ధ జగనన్న ముందు బాహుబలి-2లా నిలిచిన ప్రశ్న.
ఇవన్నీకాకపోతే.. అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబునాయుడే కారణమంటూ, మూడేళ్ల నాటి అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డునే మళ్లీ వినిపిస్తుందా? లేకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం ఎంపీ సీట్లు ఇస్తే, అప్పుడు కచ్చితంగా కేంద్రం కాళ్లు విరిచి హోదా తీసుకువస్తామని చెబుతుందా? ఇంకాస్త ముందుకెళ్లి.. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీపై ప్రజలు తిరగబడాలని రాజగురువు కేసీఆర్ మాదిరిగా గర్జిస్తుందా?
పోనీ అదీకాకపోతే, గత ఎన్నికల ముందు చంద్రబాబు మాదిరిగా ఢిల్లీకి వెళ్లి, బీజేపీ సర్కారుపై యుద్ధం ప్రకటించి అక్కడే నిరసన సభలు పెడుతుందా? అన్నది చూడాలి. ఏదేమైనా.. ఎన్నిసార్లు బ్రతిమిలాడుకున్నా.. ఎన్ని పొర్లు దండాలు పెట్టినా.. ఎంత గుక్కపెట్టి రోదించినా.. ఎన్ని శాపనార్ధాలు పెట్టినా.. పార్లమెంటులో ఎన్ని ప్రశ్నలు సంధించినా..కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదన్నది మనం మనుషులం అన్నంత నిజం.
మరిప్పుడు జగనన్నం ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారు? తనపై నమ్మకంతో గెలిపించిన ఆంధ్రా ప్రజలకు ఏం చెబుతారు? మీడియా ముందుకొచ్చి చెప్పే అలవాటు ఎటూ లేదు కాబట్టి, కనీసం పార్టీ గళధారులతోనయినా ఏం చెప్పిస్తారు? ఎలా ఒప్పిస్తారు? కేంద్రం కాదన్నందున మళ్లీ రాజీనామా చేస్తారా?..ఇవీ ఆంధ్రా పాలకుడి ముందున్న భేతాళప్రశ్నలు.
కాకపోతే జగన్‌కు సజీవంగా మిగిలిన ఏకైక మార్గం రేపటి రాష్ట్రపతి ఎన్నికలు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు ఉన్న బలం 48 శాతం. ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులు విజయం సాధించాలంటే 51 శాతం ఓట్లు అవసరం. అంటే బీజేపీకి ఇంకా 3 శాతం ఓట్లు తక్కువగా ఉన్నాయి. మునుపటి మాదిరిగా కేసీఆర్ బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటేసే పరిస్థితి లేదు. సభలో వైసీపీ బలం 4 శాతం. ఒడిషాలో బీజేడీ పార్టీ బలం 3 శాతం. సో.. బీజేపీకి ననీన్ పట్నాయక్ లేదా జగన్ అవసరం. నిజం చెప్పాలంటే జగన్‌కు ఇదే సరైన సమయం. బీజేపీ ముందు హోదా డిమాండ్ పెట్టి, కావలసిన కార్యం కానిచ్చుకోవచ్చు. మరి జగనన్న ఏం చేస్తారో చూడాలి.