డీజీపీ కోర్టులో సునీల్‌ బంతి!

Spread the love

– సీఎస్‌ జవహర్‌రెడ్డి పాత్ర ముగిసినట్లేనా?
– సునీల్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశం
– కేంద్రహోం శాఖ లెటర్‌ను డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి పంపిన సీఎస్‌ జవహర్‌రెడ్డి
– దానిపై నివేదిక ఇవ్వాల్సింది డీజీపీనే
– అయితే అది ఎన్నాళ్లన్నదానిపైనే అస్పష్టత
– విచారణకు గడువు విధించని సీఎస్‌ జవహర్‌రెడ్డి
– దానితో విచారణ సాగదీసే అవకాశం?
– డీజీపీ నిబద్ధతబట్టే విచారణ పూర్తి
– ప్రస్తుతం అమెరికాలో ఉన్న సునీల్‌
– విచారణ కమిటీ వేశారా? లేదా?
– డీజీ స్థాయి అధికారిపై విచారణ చేసేది ఎవరు?
– గతంలో ఏబీవీని విచారించిన డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ
– సునీల్‌కూ అదే పద్ధతి పాటిస్తారా?
– లేక సీనియర్‌ ఐపిఎస్‌కు అప్పగిస్తారా?
– డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి నివేదికనే కీలకం
– సీఎం ఆమోదిస్తేనే సునీల్‌పై చర్యలు
– అందరి చూపూ డీజీపీ నివేదికపైనే
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాలపై కదలిక మొదలయింది. కేంద్రం రాసిన లేఖను ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి పంపిన సీఎస్‌ జవహర్‌రెడ్డి.. సీఐడీ మాజీ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. ఈ విచారణ నత్తలతో పోటీ పడుతుందా? లేక వాయువేగంతో నడుస్తుందా? అన్నదే అందరి సందేహం. విచారణకు కాలపరిమితి లేకపోవడమే దానికి కారణం.

ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ, సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌కుమార్‌పై కేంద్ర హోం శాఖకు ఇచ్చిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆయనకంటే ముందు.. వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, కేంద్రహోం శాఖ, డీఓపీటీకి సునీల్‌పై ఫిర్యాదు చేశారు. తనను చిత్రహింసలు పెట్టారంటూ ఆయన, సునీల్‌కు వ్యతిరేకంగా ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. కస్టడీ సమయంలో రఘురామకృష్ణంరాజుకు పెద్దగా గాయాలేమీ లేవని గుంటూరు ప్రభుత్వాసుపత్రి తేల్చింది. అయితే సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రి వైద్యులు మాత్రం, ఆయనను కస్టడీలో పోలీసులు కొట్టినట్లు నిర్ధారించారు. ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత ఏపీ డీజీపీకి సైతం లేఖ రాసినా పెద్దగా ఫలితం లేదు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా, ఎంపీ రాజు అన్ని వేదికలపైనా సునీల్‌ దాష్టీకాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక సునీల్‌ హిందూ మాలగా ఉద్యోగం సంపాదించి.. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ, హిందువులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నట్లు, లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ సంస్థ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది.

అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ పేరుతో సునీల్‌ కార్యకలాపాలు, ఆ మేరకు ఆయన చేసిన ప్రసంగాల వీడియోలను సాక్ష్యంగా చూపింది. దానితో ‘ఎయిమ్స్‌’ వెబ్‌సైట్‌లో, అంతకుముందు పెట్టిన సునీల్‌ ప్రసంగాల వీడియోలు డిలెట్‌ చేశారు. కానీ దానిని ముందే పసిగట్టిన లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ సంస్థ, వాటి ఒరిజినల్‌ సిడిలను హోంశాఖకు సమర్పించడంతో, సునీల్‌ ప్రయత్నాలు బెడిసికొట్టినట్టయ్యాయి.

దానికి స్పందించిన కేంద్రహోం శాఖ.. ఆ వివరాలను నాటి సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్‌కు పంపింది. అందులో ఆధారాలుంటే.. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ సీఎస్‌ దాస్‌ దానిని పట్టించుకోలేదు. సునీల్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఎలాంటి ఆదేశాలనూ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. జవహర్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా, కేంద్ర ఆదేశాలు అమలుచేసే ప్రయత్నం చేయటం విశేషం.

లాయర్‌ లక్ష్మీనారాయణ ఫిర్యాదుకు కేంద్రం స్పందించి, సునీల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ప్రతిపక్షాలు, గిట్టనివారిని వేధించేందుకు సునీల్‌ తన అధికారాలు దుర్వినియోగం చేస్తున్నారని లక్ష్మీనారాయణ.. డీఓపీటీ, కేంద్ర హోంశాఖ మంత్రి, సీవీసీ, సీబీఐకి ఫిర్యాదు చేశారు. దానితో సీరియస్‌ అయిన హోంశాఖ.. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సునీల్‌పై, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ర్టానికి ఘాటు లేఖ రాసింది. సునీల్‌ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉన్న విషయాన్ని గ్రహించిన జగన్‌ సర్కారు.. మేల్కొని, సునీల్‌కు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా, జీఏడీకి రిపోర్టు చేయమని ఆదేశించింది. ప్రస్తుతం సునీల్‌ అమెరికాలో ఉన్నట్లు సమాచారం.

ఆ రకంగా సునీల్‌ బంతి ప్రస్తుతం డీజీపీ రాజేంద్రనాధ్‌ కోర్టులో పడినట్లయింది. డిస్ట్రిక్ట్‌ పోలీసు యాక్ట్‌- సెక్షన్‌ 5 ప్రకారం.. డీజీ స్థాయి అధికారిపై పోలీసు బలగాల అథిపతికి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నది, పోలీసు అధికారుల వాదన. అయితే.. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పూర్తి స్థాయి డీజీపీ కాదు. ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నారు. కాబట్టి అదే డీజీపీ హోదా ఉన్న సునీల్‌పై, చర్యలు తీసుకోవడం కుదరదన్నది మరికొందరు అధికారుల వాదన. అయితే.. ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పటికీ, అధికారికంగా డీజీపీ హోదా ఒక్కటే ఉన్నందున, ఆయనకు చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నది మరో వాదన.

ఈ వాదోపవాదనలు, సాంకేతిక సమస్యలు పక్కనపెడితే.. ముందు సునీల్‌పై విచారణ కమిటీ వేయాల్సి ఉంది. అది డీజీపీ రాజేంద్రనాధ్‌ ఇప్పటివరకూ చేసినట్లు లేదని, పోలీసు అధికారులు చెబుతున్నారు. విచారణ కమిటీ నియమించిన తర్వాత.. సదరు కమిటీ సునీల్‌తోపాటు, ఆయన బాధితులు- ఫిర్యాదుదారులను విచారించవలసి ఉంటుంది. అదే జరిగితే అంతకుముందు సునీల్‌పై ఫిర్యాదు చేసిన ఆయన భార్య, మామతోపాటు, ఎంపీ రఘురామకృష్ణంరాజును కూడా విచారించాల్సి వస్తుంది. అయితే విచారణ కమిటీ పరిథి ఏమిటన్నది నిర్థారణ అయితే తప్ప, వాటి గురించి చెప్పలేమన్నది సీనియర్‌ ఐపిఎస్‌ అధికారుల వ్యాఖ్య.

ఆ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికపై.. డీజీపీ మరొక నివేదిక రూపొందించి, దానిని ప్రభుత్వానికి అందచేయవలసి ఉంటుంది. దానిని ఆమోదించడం, ఆమోదించకపోవడం ముఖ్యమంత్రి విచక్షణ కిందకు వస్తుందని అధికారులు వివరిస్తున్నారు. అయితే, డీజీపీ ఇచ్చిన నివేదికను సీఎం త్రోసిపుచ్చే అవకాశాలు ఉండవంటున్నారు.

దానికంటే ముందు.. సునీల్‌పై విచారణ వ్యవహారంలో ఉన్న చిక్కును అధికారులు ప్రస్తావిస్తున్నారు. సునీల్‌పై విచారణకు కేంద్రహోంశాఖ, నిర్దిష్టకాలపరిమితి విధించని విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అదే ఆయనకు రక్షణ కవచంగా ఉపయోగపడినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. అది డీజీపీ నిజాయితీ, చిత్తశుద్దిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

‘మేం కేంద్ర హోంశాఖ రాసిన లేఖ చూశాం. కానీ అందులో ఎక్కడా ఫలానా తేదీలోగా విచారించి, చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఆదేశించలేదు. ఆయనపై చర్యలు తీసుకోండి అని మాత్రమే పేర్కొన్నారు. దానితో సహజంగానే సునీల్‌కు మరికొంత సమయం తప్పించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ డీజీపీ నిజాయితీపరుడు, చిత్తశుద్ధి, కేంద్ర ఆదేశాలను పాటించాలన్న అంకితభావం ఉంటే, విచారణను నెలరోజుల్లో ముగించవచ్చు. కానీ ఇప్పటి డీజీపీకి అంత స్వేచ్ఛ, త్వరగా నివేదిక ఇచ్చేంత వెసులుబాటు ఉందా అన్నదే చూడాలి’ అని ఓ మాజీ సీఎస్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఇప్పుడు సునీల్‌ను… ఎవరు విచారిస్తారన్న అంశం, పోలీసు వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సునీల్‌ డీజీపీ స్థాయి అధికారి కావడమే దానికి కారణం. ఒక డీజీపీని ఆ స్థాయి అధికారి మాత్రమే విచారిస్తారా? లేక కింది స్ధాయి అధికారులు విచారిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. దానికంటే ముందు.. సునీల్‌కు చార్జిమెమో ఇచ్చే అవకాశం ఉందా? లేదా? అన్న చర్చ కూడా జరుగుతోంది. పోలీసు శాఖలో డీఎస్పీ నుంచి ఏఎస్పీ స్థాయి అధికారిపై, నేరుగా ప్రభుత్వమే చర్య తీసుకుంటున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. సునీల్‌పై చర్యకు నేరుగా ప్రభుత్వమే ఆదేశించించి కాబట్టి, ఆయనకు ప్రత్యేకించి చార్జి మెమో ఇచ్చే అవసరం లేదని, విచారణ కమిటీ సరిపోతుందని వివరిస్తున్నారు.

అయితే డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారులే విచారించారు. మరి సునీల్‌ను కూడా ఆ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తారా? లేక తొలిసారి సునీల్‌ కంటే సీనియర్లకు ఆ బాధ్యత అప్పగిస్తారా? అన్న అంశంపై పోలీసు శాఖలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి నిర్వర్తించబోయే పాత్ర మీదే ఈ ఎపిసోడ్‌ ఆధారపడి ఉంది. చట్ట ప్రకారం సునీల్‌ అంశాన్ని డీజీపీ శరవేగంగా విచారణ జరిపిస్తారా? లేక సాటి పోలీసు శాఖ అధికారి అన్న సానుభూతితో, నింపాదిగా విచారణ జరిపిస్తారా అన్నది, ఆయన నియమించనున్న విచారణ కమిటీపై ఆధారపడి ఉంది. అసలు కమిటీ నియామకానికి ఎంతకాలం పడుతుందన్న దానిపై విచారణ తీరు విశ్లేషించవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

సునీల్‌పై ఎన్ని విచారణలు జరిగినా, దానిపై ముఖ్యమంత్రిదే అంతిమ నిర్ణయం కాబట్టి.. సీఎం జగన్మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్నదే ప్రశ్న, అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ‘ఈ విచారణ కమిటీలు, దానిపై నివేదికలు, ఆ నివేదికపై డీజీపీ వ్యాఖ్యలు, దానిపై సీఎం నిర్ణయం జరిగే సరికి పుణ్యకాలం పూర్తవుతుంది. ఈలోగా ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికల్లో సునీల్‌ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఎలాంటి చర్యలు లే కుండా సునీల్‌ విచారణ కథ కంచికివెళుతుంద’ని ఓ మాజీ సీఎస్‌ విశ్లేషించారు.

Leave a Reply