Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న భవిష్యత్తు కాదు… విపత్తని చెప్పేద్దాం

-అంబానీ, అదాని తర్వాత అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి
-వట్టి మాటలు కట్టిపెట్టివోయి జగన్… గట్టి మేలు చేయవోయి జగన్
-రాష్ట్ర జిడిపిలో ఒడిశా 13% అప్పులు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 82 నుంచి 83%
-జగనన్న ప్రభుత్వంలో మద్యం నాణ్యత తగ్గి హరించుకుపోతున్న ప్రజల ప్రాణాలు
-చూసి రమ్మంటే కాల్చి వచ్చే సునీల్ కుమారులు… శిశుపాలుడిని మించిన విజయ పాల్ తో పాటు కడప బ్యాచ్ అండగా ఉండగా అంగ బలం లేదనడం ఆశ్చర్యకరం
-గంజాయి అరికట్టలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

జగనన్నే మా భవిష్యత్తని ఏడు లక్షల మంది ఆయన సైన్యం రాష్ట్ర ప్రజలతో ఒక్కొక్క అక్షరం పలికిస్తారట. అయితే, జగనన్నే మా విపత్తని రాష్ట్ర ప్రజలందరం ముక్తకంఠంతో నినదిద్దామని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ఒక్క లక్ష మంది రాష్ట్ర ప్రజానీకంలో ఏడు లక్షల మందిని మినహాయించి, మూడు కోట్ల 94 లక్షల మంది ముక్తకంఠంతో జగనన్న నువ్వే మా విపత్తు అని చెప్పేద్దామని ఆయన పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పుకునే ఏడు లక్షల మందికి, ట్విట్ చేసిన విజయసాయి రెడ్డికి మాత్రం జగన్మోహన్ రెడ్డే భవిష్యత్తు అంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దీదీకి బోలో అనేది బెంగాల్ లో ప్రజల నుండి వచ్చిన నినాదం. దాన్ని కాపీ కొడుతూ, జగనన్నకు చెప్పుకుందాం అనే పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డిలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే కావడం వల్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించి ఉంటారు . జగనన్న టెలిఫోన్ లో దొరికితే ఆయనకు చెప్పేద్దాం… నువ్వు మాకు అక్కర్లేదని .

ఎన్నికలకు ముందు చెప్పింది ఏది ఆయన చేయలేదని చెబుదాం. మహిళలు మధ్య నిషేధం గురించి, ఉద్యోగస్తుల భార్యలు తమ భర్తల జీతాలు, పెండింగ్ టి ఏ, డి ఏ ల గురించి, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు తమ కుటుంబ పెద్దల జీతాలు ఇస్తావా? లేదా??అంటూ ప్రశ్నిద్దాం. ఓటు వేసి మీ కూలీగా పనిచేసే అవకాశం ఇవ్వమని ప్రజలను మనమే ఎన్నికలకు ముందు అడుక్కున్నాం. జగన్మోహన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో సహా తాను కూడా అలా ఓట్లను అడుక్కున్నవారమే. విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లు ప్రజలను ఓట్లు అడుక్కోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో మహానుభావుడైనట్లు ప్రజలను చెప్పుకోమనడం ఏమిటి?… నాన్సెన్స్. అందుకే మనమే చెప్పేద్దాం. నువ్వు ఎంతో ఆరగెంటుగా ఉన్నావని, మరొకరిని చూసుకుంటామని అన్నారు. బానిస స్వభావం ఉన్నవారు కాకుండా, ఆత్మగౌరవంతో బ్రతికే సాధారణ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మాకు అక్కర్లేదని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

టాప్ ముగ్గురిలో కాకపోతే 30 మంది జాబితాలో జగన్ ఉంటారు
దేశంలో అత్యంత సంపన్నులలో అంబానీ, అదాని తరువాత స్థానం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని రఘురామకృష్ణంరాజు అన్నారు . తనకు ఆర్థిక బలం లేదని ఆయన పేర్కొనడం హాస్యాస్పదం. 2012 లో ఎన్నికల అఫిడవిట్ లో 370 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే సంపన్నులలో మొదటి ముగ్గురి జాబితా లో కాకపోతే, 30 మంది జాబితాలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఉంటారు. ఈ నాలుగేళ్లలో ఇసుక, మట్టి, మద్యంలలో గడించిన ఆదాయం ఎంతో ఆయనే చెప్పాలి. 370 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి తాను ధనికుడి కేటగిరిలో రానని భావిస్తుండగా, అంబానీ, అదాని తరువాత జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడని దేశ ప్రజలు అనుకుంటున్నారు. తనకు తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్ అధికారికంగానే 600 నుంచి 700 కోట్ల రూపాయలు ఉంటుంది. అయినా, తాను బీద వాడినని బీద ఏడుపులు ఏడిస్తే, ప్రజలు విశ్వసించరు. తనకు అంగ బలం లేదని జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉంది. నోరు విప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని పోలీసులు చంపేశారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే సునీల్ కుమార్ లాంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి వద్ద ఉండగా, శిశుపాలుని మించిన విజయ పాల్ తో పాటు , కడప బ్యాచ్ తో ఆయన అంగ బలం బీభత్సం గా ఉంది. తనకు అంగ బలం లేదంటూనే తనపై కండబలం చూపించి జగన్ , వేధించి హింసించారు. అయినా, తనకు అంగ బలం లేదని మీరంటే పిచ్చి వెధవలు ఎవరైనా నమ్మితే నమ్మవచ్చేమో కానీ తాను మాత్రం నమ్మనని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తాను ఒంటరి అని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటుంటే , రాచిరంపాన పెట్టే వారితో ఎవరు జత కడతారని ప్రజలు అంటున్నారు . బటన్ నొక్కుతున్నానని చెప్పి, ఏమి నొక్కుతున్నారో తెలియదు కానీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని, వారు ఓట్లు వేస్తారనే ధీమాతో ఎవర్ని ఆయన కలుపుకొని వెళ్లడం లేదు. ఎవరు కూడా మీతో కలిసేందుకు సిద్ధంగా లేరు. అడిగినప్పుడు అప్పు ఇచ్చే వ్యవస్థ మాత్రం మీతోనే ఉన్నది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పు ఇచ్చి ఆదుకుంటున్నారు. కరువు ఉన్నా కూడా మీ అప్పుకు మాత్రం కరువన్నదే లేకుండా పోతోందన్నారు.

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ జిడిపి
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తన జీడిపిలో 13% అప్పు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 82 నుంచి 83% అప్పులు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒడిశా అంటూ తేలికగా తీసి పారెసే రాష్ట్రం తన జీడిపిలో 13 శాతం మాత్రమే అప్పులు చేయగా, రాష్ట్ర ప్రభుత్వ జీడీపీ 9 నుంచి 10 లక్షలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 15 లక్షలు గా పేర్కొంటుంది. ఎవరి మద్దతు లేకుండానే జీడీపీలో రుణ శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా పెంచుకుంటుందో చెప్పాలి. మనం ఒక్కరమే కాదు… మనకు సహాయం చేస్తున్నవారు కొందరు ఉన్నారనేది సుస్పష్టం. ఎన్ని బీద అరుపులు అరిచినా ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మరు. నాలుగు నెలల క్రితం తన వెంట్రుక కూడా పీకలేరని భాస్వరం లా వినిపించిన జగన్మోహన్ రెడ్డి స్వరం, ఇప్పుడు వీక్ అవుతోంది. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నాను మీరే దిక్కని ప్రజల్ని కోరుకుంటున్నారు. తా ను లేకపోతే ప్రజలకు చాలా నష్టమని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటున్నారు కానీ ప్రజలు మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే తమకు బారం మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రజలు ఫియర్ తో ఉన్నారు కానీ, మీ పట్ల ఫీలింగ్ తో లేరు. ఇకనైనా విషాద ఏడుపులు ఏడవడం మానండి అని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. సాక్షి మీడియా చైర్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి అయినప్పుడు, సాక్షి మీడియాతో తనకు సంబంధం లేదంటే ప్రజలు నమ్ముతారా?. సాక్షి మీడియా, పత్రిక ఎంత కాదన్నా మీదేనన్నది అక్షర సత్యం. టీవీ5, ఏబీఎన్, ఈనాడుపై దుమ్మెత్తి పోస్తున్న జగన్మోహన్ రెడ్డికి 9, 10 సంఖ్యలతో కూడిన చానెల్స్ తో పాటు, కొన్ని అక్షరాలు, సింగిల్ లెటర్స్ ఉన్న చానల్స్ ను గంటసేపు చూస్తే, ఆ చానల్స్ ఎవరి పక్షమో తెలిసిపోతుంది. విజయసాయి రెడ్డి ఓ 50 వెబ్ సైట్స్, భార్గవ్ రెడ్డి 50 నుంచి 100 వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నారు. ఇక పొలిటికల్ పంచ్ అనే వెబ్ సైట్ ద్వారా పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. రెండు అక్షరాల తోక కలిగి వారు సోషల్ మీడియా లో మనకు మద్దతుగా నిత్యం పోస్టులు పెడుతూనే ఉంటారు. వాళ్లకు మీడియా మద్దతు ఉన్నదని, మనకు లేదని ఏడుపు ఎందుకు?. మీడియా మద్దతు మనకు లేదన్నది శుద్ధ అబద్ధం. సొంత మీడియాతో పాటు, అరువు మీడియా కూడా ఉండనే ఉంది. టిడిపి కి ఉన్నది ఆరువు మీడియా మాత్రమే. ఏ మీడియా సంస్థలోను టిడిపి కి వాటాలు లేవు. మీడియా మద్దతు తనకు లేదన్న జగన్మోహన్ రెడ్డి మొర ఎవరు ఆలకించరు. ఇక తనపై ఎటువంటి కేసులు లేవని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదం. దీనితో ఈయనకు ఏమయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కసారి ఎన్నికల అఫిడవిట్ ను పరిశీలించమని సూచిస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో తనపై 33 కేసులు ఉన్నాయని స్వయంగా ఆయనే వెల్లడించారు. కేసుల్లో దోషో, నిర్దోషో తేలాలంటే ముందు ఆయన కోర్టుకు వెళ్లాలి కదా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయిస్తున్నారు
దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయించడం విడ్డురంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఒంగోలు డిఎస్పి కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు మద్యం తాగి మరణించారు. రాష్ట్రంలో గతంలో నాణ్యమైన మద్యం విక్రయించేవారు. కానీ ఇప్పుడు నాసిరకమైన మద్యం విక్రయిస్తూ, ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యం విక్రయించడం వల్ల, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవలసిన పరిస్థితి నెలకొంది. కంపెనీ పేరు చెప్పి క్వార్టర్ అడిగే విధానం రాష్ట్రంలో లేదు. కేవలం మద్యం ధరల చెప్పి క్వాటర్ అడిగే విధానం మాత్రమే అమలులో ఉంది. నాసిరకం మద్యం విక్రయాయాల గురించి ప్రశ్నించినందుకు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు. మద్యం నాణ్యతను తగ్గించి, నాలుగు రెట్ల ఆదాయం పెంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని లాక్కుంటుంది. రామోజీరావు చేసిన చట్ట ఉల్లంఘనలు ఏవి లేవీ లేవు. న్యాయస్థానాలలో ఈ కేసు నిలబడదు. ఈ కేసుల ద్వారా రామోజీరావు లూజ్ వెంట్రుకను కూడా రాష్ట్ర ప్రభుత్వం పీకలేదు. గతంలో తనని లాకప్లో చిత్రహింసలు పెట్టడానికి లుంగీలతో వచ్చిన బ్యాచ్, ఇప్పుడు రామోజీరావును ప్రశ్నించడానికి సూట్ లలో వెళ్తున్నారు. రామోజీరావు ను విచారిస్తున్న విధానాన్ని సాక్షి దినపత్రికలో పూస గుచ్చినట్లు రాయడం పరిశీలిస్తే, సాక్షి దినపత్రిక వాడు టేబుల్ కింద నక్కి వింటున్నాడా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

మద్యం డిస్టలరీలను నిర్వహిస్తున్నది ఎవరు?
రాష్ట్రంలో మద్యం డిస్టలరీలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చారని పేర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఆ మద్యం డిస్టలరీలు ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు . గతంలో డిస్టలరీలకు దరఖాస్తులు చేసుకున్న వారే, ఆ డిస్టలరీలకు నిర్వహిస్తున్నారా?, ఆడాన్ డిస్టలరీ యజమాని శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్న డిస్టలరీలు ఎన్ని? మరో రెడ్డి ఇంకొక రెడ్డి నిర్వహిస్తున్న డిస్టలరీలు ఎన్నో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కిందిస్థాయి అధికారి వాసుదేవ రెడ్డికి బాధ్యతలను అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటి?. తమిళనాడులోని రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. అక్కడ ఏ బ్రాండ్ అడిగినా లభిస్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా విక్రయించని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్, రాబిన్ హుడ్ బ్రాండ్లను ఎవరు కావాలని అడుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి లు సమాధానం చెప్పాలని అధికార పార్టీ ఎంపీగా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి లో ఎవరు సమాధానము చెప్పినా పరవాలేదు. సాక్షి దినపత్రిక ప్రభుత్వం తరఫున సమాధానం చెబుతుందా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలను నగదులోనే ఎందుకు విక్రయిస్తున్నారు. ఆలి తాళిని తాకట్టు పెట్టి తాగే తాగుబోతుని తాకట్టు పెట్టిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచమంతా అనుకుంటున్నారు . రాష్ట్రంలో కొనసాగుతున్న మద్య మరణ మృదంగాన్ని ఎన్నికల ద్వారానే ఆపాలి. అమ్మ ఒడి తమకు అవసరం లేదని, తమ భర్త, పిల్లల ప్రాణాలతో ఉంటే చాలని రాష్ట్ర మహిళలు జగన్మోహన్ రెడ్డి ని కోరాలి . జగన్మోహన్ రెడ్డి, భారతీ లు మాత్రమే సుఖంగా ఉంటే చాలా?, తాము తమ కుటుంబంతో సుఖంగా ఉండవద్దా అని ప్రశ్నించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

గంజాయిని క్షేత్రస్థాయిలో అరికట్టండి
గంజాయి సాగును క్షేత్రస్థాయిలో అరికట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణంరాజు కోరారు . దేశం మొత్తానికి రాష్ట్రం నుంచే గంజాయి సరఫరా అవుతుందన్నది జగద్విదితం. గంజాయి సాగును అరికట్టేందుకు కృషి చేసిన సవాంగ్ ను పదవి నుంచి తప్పించారు. తనకు హోం మంత్రి పదవి కేటాయిస్తే ఆరు నెలల వ్యవధిలో గంజాయి సాగు, సరఫరా అన్నదే లేకుండా చేస్తాను. కానీ ముఖ్యమంత్రి తనకు హోం మంత్రి పదవి ఇవ్వరని తెలుసు. ఎందుకంటే, గంజాయి వ్యాపారం చేస్తున్నది ఆయన అస్మదీయులే కావడం వల్ల. గంజాయిని అరికట్టలేని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు?, తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలి. గంజాయి సరఫరాను అడ్డుకోవడానికి సింహమైనా జగన్మోహన్ రెడ్డికి, ఏ తోడేళ్లు అడ్డు వస్తున్నాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వట్టి మాటలను కట్టిపెట్టి, గట్టి మేలు చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం… ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉంటే బాగుండేది కానీ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏ ఉత్సవాలలో పాల్గొనకూడదని నిన్ననే ప్రారంభించి ఉండి ఉంటారు. క్రీస్తు భక్తులైన వారు హింసకు దూరంగా, వీడియోలను చూసి ఆనందించ కుండా, క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.

LEAVE A RESPONSE