-కళ్ళు మూసుకుని ఉండబట్టే ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓటమిపాలయ్యింది
-ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు
అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కళ్ళు మూసుకున్నానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టే ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓటమిపాలయ్యిందన్నారు. తిరుపతిలో జి 7 రెస్టారెంట్ ను ముఖ్యఅతిథిగా హాజరై రఘురామకృష్ణం రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోటల్లో ఆర్ ఆర్ ఆర్ పేరిట ఇడ్లీని ఏర్పాటు చేశారని, అది రాజమౌళి చిత్రం పేరు కాదని తన పేరేనని ఆయన చమత్కరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు కళ్ళు మూసుకుంటే, ఐదేళ్లపాటు కంటి రెప్ప కూడా వాల్చని నాయకుడు చంద్రబాబు నాయుడన్నారు. ఐదేళ్లపాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లపాటు కాదు, మరో పదేళ్లపాటు కళ్ళు మూసుకొని ఉండాల్సిందేనని, ఆ తర్వాత ఆయన గురించి ప్రజలెవరు పట్టించుకోరన్నారు.
రాజకీయాలలో ఉన్నవారు ఎవరైనా ప్రజల మధ్యకి వెళ్లాలని కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని, పదవి పోయిన తర్వాత చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం కలిగినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి పరదాల చాటున తిరిగారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరదాలను తొలగించాలని ఆదేశించడాన్ని ఎలా చూస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ పరదాల చాటున తిరుగుతూ చెట్లు నరుక్కుంటూ వెళ్లడమనేది ఆయన అభద్రతా భావానికి నిదర్శనం పేర్కొన్నారు .
చంద్రబాబు నాయుడు తాను ప్రజల మధ్యనే ఉంటానని వరదాలను తొలగించాలని ఆదేశించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు అంటే భయపడ్డారని, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలతో మమేకమవుతూ తొలిరోజే తన కార్యాచరణను స్పష్టంగా తెలియజేశారన్నారు. వైకాపా కున్న సంఖ్య బలం ఆధారంగా ఏ విధంగా పోరాటం చేస్తారన్న ప్రశ్నపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ పోరాటానికి సంఖ్యా బలానికి సంబంధం లేదన్నారు. అది నేను ఒప్పుకోనని 10 మంది ఉంటే పోరాడలేరని, 50 మంది ఉంటే మాత్రమే పోరాడుతారనేది కరెక్ట్ కాదన్నారు. పోరాటానికి ఒక్కరు కూడా చాలని పేర్కొన్నారు.
గత ఐదేళ్లపాటు మీడియా ముందు రాని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి తొలి రోజు వివిధ ఫైళ్ళపై సంతకం పెట్టగానే మీడియా ముందుకు రావడానికి ఎలా చూస్తారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు క్షవరం అయినంక వివరం తెలిసిందన్నట్లుగా ఉందని రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు. కచ్చితంగా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా ఉంటుందని నాతోపాటు ప్రజలంతా విశ్వసిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని అవి అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే కష్టపడితే సరిపోదని, అందరూ ఈ పార్టీ నాది అని సొంతం చేసుకుని కష్టపడాలన్నారు.
అందరూ కష్టపడితే ప్రజలకు ఇచ్చిన హామీలను సునాయాసంగా అమలు చేయవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైనికుల మాదిరిగా పనిచేయడంతో పాటు ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ప్రజలపై, ప్రతిపక్షాలపై దాడులు చేయవద్దని, ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ సంయమనంతో వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగాలన్నారు. ఒకవేళ ఒకటి రెండు హామీల అమలులో ఏమైనా ఆలస్యం జరిగితే దాని గురించి ప్రజలకు సవివరంగా వివరించాలన్నారు .
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేని హామీలు కాదని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు , ప్రాధాన్యత ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేస్తారన్నారు. అన్నీ ఒకేసారి కాకపోయినా మూడు నెలలు, ఆరు నెలల వ్యవధిలో హామీలన్నీ నెరవేర్చే అవకాశం ఉందని తెలిపారు. లోటు బడ్జెట్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యమేనా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం చేశారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అసలు నిధుల దుర్వినియోగమన్నదే జరగదన్నారు.
గతంలోనూ గ్రోత్ రేటు ఉందని కానీ ఆ నిధులను మింగేశారన్నారు. నిధుల దుర్వినియోగం లేకపోతే చంద్రబాబు నాయుడు అమలు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాలను సునాయసంగా అమలు చేయవచ్చునన్నారు. సంక్షేమ పథకాలు కొన్ని ఈరోజు నుంచే అమలు కాగా, మరి కొన్ని మూడు నాలుగు నెలల తరువాత అమలు చేసి తీరుతారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్న ఆయన, గతంలో ఏ రాష్ట్రానికి దక్కని అప్పులు ఈ రాష్ట్రానికి దక్కాయని, ఇంకా కొంతకాలం కేంద్రం అలాగే సహకరిస్తే మన కాళ్ళ మీద మనం నిలబడతామన్నారు.
పోలవరం తో పాటు రాజధానిని పూర్తి చేసుకోవడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించవచ్చునని తెలిపారు. అలాగే స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ కూడా తీసుకురావడం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సమర్థుడైన నాయకులని, బాగా పరిపాలన చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ప్రజలకు నేనేదైనా మంచి చేయాలని కలకాలం జనాల మనసుల్లో గుర్తుండి పోవాలనే మంచి సంకల్పం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
అన్ని సబ్జెక్టులు అందరికీ తెలియాల్సిన అవసరం లేదని, మంచి మనసుంది మంచి సంకల్పంతో ఉంటే చాలని అది పవన్ కళ్యాణ్ కు మెండుగా ఉందని తెలిపారు. జీతం తీసుకుంటేనే బాధ్యత తెలుస్తుందని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఇచ్చే జీతాన్ని తీసుకోవాలని నిర్ణయించారన్నారు. ఒక్క రూపాయి జీతం తీసుకున్న వ్యక్తి ప్రజల రూపాయలను దోచుకున్నారని, ఎప్పుడూ ఒక్క రూపాయి జీతం తీసుకునే వారిని నమ్మవద్దన్నారు.
పవన్ కళ్యాణ్ తీసుకుని లక్షన్నర రూపాయల జీతం ఆయనకు పెద్ద అమౌంట్ కాదని, ఐదారు మంది నిర్మాతలు ఆయనతో 100 కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చారన్నారు. ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమావేశం అయ్యారో ఆయనకే తెలియాలి అన్నారు. గతంలో ఎమ్మెల్సీ వ్యవస్థనే వద్దని జగన్మోహన్ రెడ్డి భావించారని గుర్తు చేశారు. గతంలో మేము వద్దనుకున్న ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయమని ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కోరితే పరిశీలిస్తారేమో చూడాలన్నారు.
అంతేకానీ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా ఉక్రోషంతో ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలనుకునే వ్యక్తి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు కాదన్నారు. ఎన్డీఏ కు రాజ్యసభలో భేషరతుగా మద్దతు ఇస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. బిజెపి అడగకపోయినా వారే ముందుకొచ్చి మద్దతు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్, హరిణి శ్రీనివాస్, ఎం ఎం రత్నం, తిరుపతి జనసేన నాయకులు హరి ప్రసాద్, టిడిపి నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు.
ఆశలు లేవు ఆశయం మాత్రం ఉంది
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ బాధ్యత అప్పగించిన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తానేంతో ఓపెన్ మైండ్ తో ఉన్నానని, ఏ బాధ్యత లేకుండా లేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, అదనంగా ఏ బాధ్యత అప్పగించిన నెరవేర్చడానికి సిద్ధమేనని చెప్పారు. అదనపు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలనని తాను భావిస్తున్నానని పేర్కొన్న ఆయన, మంత్రివర్గంలో క్షత్రియులకు స్థానం కల్పించకపోవడంపై స్పందిస్తూ త్వరలో ఇస్తారేమో చూడాలన్నారు.
రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయని అన్ని కులాల వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం పెద్దాయనకు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు. తనకు ఏ ఆశలు లేవన్న ఆయన ఆశయం మాత్రం ఉందని తెలిపారు.