జగన్మోహన్ రెడ్డి పచ్చి నియంత కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు

– జగన్మోహన్ రెడ్డికి మద్ధతిచ్చేవారంతా చరిత్రహీనులుగా మిగులుతారు
• ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు, ఉద్యోగుల సమస్యలు గొంతెత్తినవారు రాజద్రోహులని ముఖ్యమంత్రి చెప్పడం దురదృష్టకరం
• వారంలో రద్దుచేస్తామన్న సీపీఎస్ 33నెలలైనా ఎందుకు రద్దుచేయలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా?
• దేశచరిత్రలో ఎక్కడాలేనివిధంగా వేతనసవరణ జరిగాక, వేతనాలు తగ్గడమేంటని జగన్మోహన్ రెడ్డిని నిలదీయకూడదా?
• జనాభాలో 60శాతంపైగా ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను ముఖ్యమంత్రి దారుణంగా వంచిస్తున్నాడు
• తన మూడేళ్లపాలనలో ఒక్క వెనుకబడిన,దళిత యువకుడు, యువతికైనా ముఖ్యమంత్రి స్వయంఉపాధికల్పించాడా?
– మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

జగన్మోహన్ రెడ్డిని పొగిడినవారు సక్రమంగా పనిచేస్తున్నట్లు, ప్రశ్నించినవారేమో రాజధ్రోహానికి పాల్పడుతున్నట్టు ఆయన ప్రచారం చేయడం దుర్మార్గమని, ముఖ్యమంత్రిస్థానంలో ఉండి ప్రతిపక్షాలపై ఆయన సాగిస్తున్న విషప్రచారం విచారకరమైనదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు స్పష్టంచేశారు. బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…

సత్యదూరమైన తప్పుడుసమాచారాన్ని ప్రభుత్వమే ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళుతుంటే, అది ప్రజాప్రభుత్వం అవుతుందా? పీఆర్సీ, ఇతరత్రా డిమాండ్లపై ఉద్యోగసంఘాలనేతలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై అనేకమంది బాహటంగా వారిఅభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయసంఘాలు, ఇతరసంఘాలప్రతినిధులు పీఆర్సీ సాధనసమితికి రాజీనామాచేసి, ప్రభుత్వం అవలంభిస్తున్న ఉద్యోగులవ్యతిరేక చర్యలపై నిరసించాలని తీర్మానించుకున్నారు.

ఉద్యోగులు, ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలు బహుళ చర్చనీయాంశలుగా మారడం సహజం. వాటిపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు వాటి అభిప్రాయాలు వ్యక్తంచేయడం సర్వసాధారణం. కానీ అలామాట్లాడేవారిని, న్యాయంచేయమని డిమాండ్ చేసేవారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజద్రోహులని ముద్రవేస్తోంది. ఈ ప్రభుత్వం భావప్రకటనా స్వేఛ్ఛని హరిస్తోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది? ముఖ్యంగా వామపక్షపార్టీలు, నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రతిపక్షపార్టీలు, రాజకీయనేతలు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరడం ప్రభుత్వంపై కుట్రలుచేయడం అవుతుందా? ఆ విధంగా ముఖ్యమంత్రే అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం, అసత్యఆరోపణలు గుప్పించడం దురదృష్టకరం. పీఆర్సీ, వేతనసవరణ విషయంలో సాధారణంగా వేతనసంఘం సిఫార్సులు బయటపెట్టి, వాటి అమలుకు ఉన్నసాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఆలోచించి, చర్చలద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అలా చేయకపోగా ప్రభుత్వ ఒంటెత్తుపోకడలను తప్పుపట్టిన ప్రతిపక్షాలు, రాజకీయనేతలపై విమర్శులుచేయడం సిగ్గుచేటు.

అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదు? భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వేతనసవరణ జరిగినతర్వాత ఎక్కడైనా వేతనాలు తగ్గాయా? ఈ ప్రభుత్వంలో మాత్రమే అలాంటి వింతలు జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రభుత్వ ఉద్యోగులంతా తమకు పాతజీతాలే కావాలని డిమాండ్ చేస్తుంటే, భారీసంఖ్యలో విజయవాడకు వచ్చి గొంతెత్తితే దానిగురించి ఆలోచించకుండా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలపై విషప్రచారం చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండి స్తోంది. వారంలో సీపీఎస్ రద్దుచేస్తామని ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అన్నాడాలేదా?

ఇప్పటివరకు ఎన్నివారాలు గడిచాయి? 33నెలలకు ఎన్నివారాలు అవుతాయో ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పటివరకు సీపీఎస్ ఎందుకు రద్దు చేయలేదు? వేతనసవరణలో కోతలు పెట్టి ఫిట్ మెంట్ ప్రకటించడం ఏమిటి? ఇంటిఅద్దె అలవెన్సుల శ్లాబుల్లో మార్పులు ఎందుకు చేశారు? పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుండా, పెన్షన్లలో కోతలు పెట్టమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడమేంటి? ముఖ్యమంత్రిగాఉన్నవ్యక్తి ఏంచేసినా, ఎందరిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా అందరూ మౌనంగా ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనా?

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడిపేవారు ఎవరూ ఇలాంటి ఆలోచనలు చేయరు? పచ్చినియంతలకు మాత్రమే అటువంటి ఆలోచనలు వస్తాయి. ముఖ్యమంత్రి ఆలోచనలు పెత్తందారీ, బూర్జువా ఆలోచనలు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడుతున్న ప్రతిపక్షాలు, నేతలపై నిందలు వేస్తున్నాడు. ప్రతిపక్షాలు, రాజకీయపార్టీలనేతల నిజాయితీని, చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలకు జగన్మోహన్ రెడ్డి తెరలేపడం దుస్సాహసమే అవు తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి ప్రతిపక్షాలను ఒకేగాటిన కట్టి, వాటి విశ్వసనీయతను దెబ్బతీయాలని చూడటం అత్యంత కిరాతకమైన చర్య. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు ఏవైనా అంశాలపై మాట్లాడితే, వాటిలో ఏవైనా తప్పులుంటే సరిదిద్ది వివరణ ఇవ్వడం ప్రభుత్వబాధ్యత.

కానీ ప్రభుత్వమే తప్పుడు సమాచారం వ్యాప్తిచేయడం దుర్మార్గమైన విషయం. ఈ పాలకుల సమయం అయిపోయింది. ప్రతిపక్షాలన్నీ వేటిదారిలో అవి ఉద్యోగుల సమస్యలపక్షాన పోరాడటానికి నడుం బిగించాయి. ఎవరికితోచినదారిలో వారు, వారిశక్తిమేరకు ఉద్యోగుల బాగుకోసం పనిచేశారు. అదిచూసి ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారానికి తెరలేపాడు. అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నిఅబద్ధాలు చెప్పాడో ప్రజలకు బాగాతెలుసు. అదేక్రమంలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు కోటలు దాటేలా హామీలు ఇచ్చాడు.

వారంలో రద్దు అన్నసీపీఎస్ ఏమైందో తెలియదు. 2,37,000 ఉద్యోగాలు ఇస్తాననిచెప్పిన వాగ్ధానం సంగతేమిటని ప్రశ్నిస్తే నోరుమెదపడు. ప్రతిసంవత్సరం కొత్త జాబ్ క్యాలెండర్ విడుదలచేయడంతో పాటు, మెగాడీఎస్సీ నిర్వహిస్తాను అన్న హామీకి, ముఖ్యమంత్రి అయ్యాక తిలోదకాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు ముగిసినా జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. చేదోడు…ఆతోడు.. ఈతోడు అంటూ పెద్ద మోసానికి పాల్ప డుతున్నాడు. వెనుకబడిన వర్గాలకార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఒకప్పుడు ఆయివర్గాల ఆర్థికఅభ్యున్నతి, స్వయంఉపాధికల్పన కోసం కృషిచేసే సంస్థలుగా వెలుగొందాయి.

ఈ ముఖ్యమంత్రి వాటిని నిర్వీర్యంచేశాడు. 56కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, ఏం వెలగ బెట్టాడంటే సమాధానంలేదు. ఒక్కరూపాయి ఇవ్వకుండా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల సంఖ్య పెంచుకుంటూ పోతే వెనుకబడిన వర్గాలకు న్యాయంజరుగుతుందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఏ ఒక్క యువకుడు, యువతికైనా వారికాళ్లపై వారు నిలబడేలా ఉపాధి అవకాశం ఈ ముఖ్యమంత్రి కల్పించాడా అని ప్రశ్నిస్తున్నాం. ఒక్కటంటే ఒక్కటైనా రాయితీతోకూడిన స్వయంఉపాధి మార్గాన్ని ఆయావర్గాల్లోని యువతకు చూపించాడా?

సమాజంలో 60శాతం పైగా ఉన్న దళితులు, మైనార్టీలు, వెనుకబడినవర్గాల అభివృద్ధిని సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. ఒకవైపు వారిఅభివృద్ధిని, ఉన్నతిని అడ్డుకుంటూనే, మరోపక్క వారినేదో ఉద్ధరి స్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలు, మోసపూరిత ప్రకటనలు, కల్లబొల్లి వాగ్ధానాలు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతపెంచాయి.

ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని భుజానికెత్తుకొని, ఆయన జెండామోస్తే, ఆయనకు మద్ధతిచ్చేవారంతా చరిత్రహీనులుగా మిగిలిపోవ డం ఖాయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాలు ప్రజలకు చెప్పి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, బలహీనవర్గాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు సరిపడా నిధులిచ్చి, వాటిని పరిపుష్టంచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply