జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనం

– స్విచ్ వేయకుండానే జగన్ రెడ్డి ప్రజలను విద్యుత్ షాక్ లకు గురిచేస్తున్నారు
– టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.11,600 కోట్ల భారం మోపిన జగన్ రెడ్డి మరోసారి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సిగ్గుచేటు. ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుంది. జగన్ రెడ్డి తన చేతగానితనంతో ఒకవైపు విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. పాలన చేతగాకపోతే దిగిపోవాలి.

అంతేకానీ పన్నులు, ఛార్జీలు పెంచుతూ ప్రజలను దోచుకోకూడదు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని అనేక సభల్లో చెప్పారు. ఇప్పడు పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నాడు. స్విచ్ వేయకుండానే ప్రజలకు జగన్ రెడ్డి కరెంటు షాక్ లు ఇస్తున్నాడు. జగన్ రెడ్డి పలాన దానిపై పన్నులు పెంచలేదని చెప్పగలడా? చెత్తపన్ను దగ్గర నుంచి నిత్యవసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు వరకు ప్రతీది పెంచుకుంటూ పోతున్నాడు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వినియోగదారుడు గత సంవత్సరం లో వాడిన సరాసరి యూనిట్ల ఆధారంగా కేటగిరి నిర్ణయించడం జరిగింది. దీని వల్ల సంవత్సరం మొత్తం వినియోగదారుడు ఒకే కేటగిరిలో ఉండే వాడు. వినియోగదారుడు ఒక నెల ఎక్కువ కరెంటు వినియోగించినప్పటికీ భారం పడేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదు.

కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2020-21 లో (ఈ.ఆర్.సి ఆర్డర్ 10.02.2020) విద్యుత్ స్లాబులు మార్చి ప్రజలపై భారం మోపారు. అంతేకాకుండా గత ఏడాది సరాసరి వినియోగం ఆధారంగా ఉన్న కేటగిరైజేషన్ ను రద్దు చేసి నెలవారీ వాడకం ఆధారంగా కేటగిరిని నిర్ణయించే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

ఈ విధానం ద్వారా వినియోగదారుడిపై, ప్రత్యేకించి పేద, దిగువ మధ్య తరగతి వినియోగదారులపై మోయలేని భారం పడింది. కేటగిరీలు మార్చి ప్రజలను దోచుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా పేద, దిగువ మధ్యతరగతి వారిపై విద్యుత్ ఛార్జీలను 45 శాతం పెంచారు. ఇది అత్యంత దుర్మార్గం. దీనిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. పల్లె, పల్లెకు జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రజలకు వివరించి చెప్పి ఛార్జీలు తగ్గించే వరకు జగన్ రెడ్డిని విడిచిపెట్టే సమస్యే లేదు.

Leave a Reply