– కామినేని-బాలకృష్ణ-చిరంజీవి వివాదం కథ
(నవీన్)
ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రజల్ని నమ్మించడానికి “ఏ ఒక్కరినీ వొదిలేది లేదు” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పదే పదే చేసే చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూనే వున్నాయి. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తగ్గలేదన్న నివేదికలను ఈ వైఫల్యాలు దృవపరస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ “కామినేని శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ – చిరంజీవి” వివాదం.
ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఒక రాజకీయ వ్యూహం బెడిసికొట్టి, దాన్ని ప్రారంభించిన వారికే ఇబ్బందికరంగా మారిన ఉదంతం ఇది.
2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి శాసనసభను వేదికగా చేసుకుంది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించడానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని గుర్తుచేశారు.
చంద్రబాబుకి, చిరంజీవికి ఎన్ టి ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కామినేని ఉభయకుశలోపరి అన్నట్టుగా చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్‌ను అహంకారిగా చిత్రీకరిస్తూ, అదే సమయంలో కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని హీరోగా ప్రశంసించడం ఆయన ఉద్దేశం.
కామినేని మాటలు ముగియకముందే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. జగన్‌ను ఎవరూ నిలదీయలేదని కామినేని వాదనను ఖండించారు. అంతటితో ఆగకుండా, జగన్‌ను “సైకోగాడు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు.
ఇది మిత్రపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. జగన్‌కు ప్రధాన విమర్శకుడిగా తనకున్న ఇమేజ్‌కు, కామినేని వ్యాఖ్య భంగం కలిగిస్తుందని బాలకృష్ణ భావించి ఉండవచ్చు. ఏమైనా ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు, కూటమిలోని సమన్వయ లోపాన్ని బయటపెట్టాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లౌక్యంగా ముగింపు పలికారు. ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఏమాత్రం అవమానించలేదని, సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జగన్ – చిరంజీవి దంపతులను భోజనానికి ఆహ్వానించి సాదరంగా గౌరవించారు.
తర్వాత సినిమా రంగం ప్రతినిధులతో కలిసి చిరంజీవి వెళ్ళినపుడు జగన్ వీరిని పట్టించుకోనట్టు వ్యవహరించి తన ఆధిక్యత చూపించారు. ఇందులో చిరంజీవి పాక్షిక వాస్తవాన్ని మాత్రమే అశ్వద్ధామ హత: కుంజర అన్నట్టు ప్రస్తావించి అంతేకాకుండా, తన చొరవ వల్లే సినిమా టికెట్ ధరలు పెరిగాయని, అది బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” చిత్రానికి కూడా మేలు చేసిందని సున్నితంగా గుర్తుచేశారు.
ప్రత్యక్ష దాడికి దిగకుండా, వాస్తవాలతోనే ఆయన బాలకృష్ణకు సమాధానమిచ్చారు. తనను ఒక రాజకీయ పావుగా వాడుకోవడాన్ని నిరాకరిస్తూ, తన గౌరవాన్ని, స్వతంత్రతను చాటుకున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదం కూటమి ఐక్యతకు నష్టం చేస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకున్నారు.
ఆయన ఆదేశాలతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ద్వారా వివాదాన్ని తుంచేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరిస్తూ, రికార్డుల నుంచి తొలగించాలని పెద్దరికంతో హుందాగా స్పీకర్‌ను కోరారు. స్పీకర్, కామినేని, బాలకృష్ణ ఇద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.
ఈ వివాదాన్ని వైఎస్ఆర్సిపి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయని, వారు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తమ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఈ వ్యూహం పూర్తిగా విఫలమైంది. చిరంజీవి ప్రకటనతో, ఈ కథనంలో “బాధితుడు” లేకుండా పోయారు. కూటమి నాయకత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో, వైఎస్ఆర్సిపి ప్రచారానికి ఆయుష్షు లేకుండా పోయింది.
ఈ సంఘటన వైఎస్ఆర్సిపికి రాజకీయంగా నష్టాన్నే మిగిల్చింది. ఎలాగంటే ఈ వివాదం కూటమిలోని బలహీనతను కాకుండా, సంక్షోభాన్ని పరిష్కరించగల వారి నాయకత్వ బలాన్ని ప్రదర్శించింది.
చిన్న సమస్యపై అతిగా దృష్టి పెట్టడం ద్వారా, వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని ప్రజలకు మరోసారి బోధపడింది. ఈ వివాదం, సినీ పరిశ్రమతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణాత్మక గతాన్ని ప్రజలకు తిరిగి గుర్తు చేసింది. ఇది వారికి “బూమరాంగ్” అయింది
( రచయిత సీనియర్ జర్నలిస్టు)