– మేం కేసీఆర్ వెంటే ఉంటాం
– కవిత నిర్ణయంతో మా రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం
– ఇప్పుడు జాగృతి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది?
– వేల మంది జాగృతి కార్యకర్తల ఉసురు పోసుకున్నట్లు కాదా?
– జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్
– కవితపై జాగృతి నేతల తిరుగుబాటు
హైదరాబాద్: ఏ జాగృతి సంస్థకు ఊపిరిపోసి దాని ద్వారా సొంతగా ఎదిగేందుకు ఉబలాటపడుతున్న జాగృతి అధినేత్రి, బీఆర్ఎస్ నుంచి సస్పెండయిన కేసీఆర్ బిడ్డ కవితకు.. అదే జాగృతి నేతలు ఝలక్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన జాగృతి నేత మేడే రాజీవ్ సాగర్.. తాము కేసీఆర్‌తోనే నడుస్తామని, కవితతో అడుగులు వేసేలేదిలేదని తిరుగుబాటు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. తాము ముందు కేసీఆర్‌కు విధేయులం, బీఆర్ఎస్ సైనికులమని కుండబద్దలు కొట్టారు. కవిత తీసుకున్న నిర్ణయంతో.. తమ 19 సంవత్సరాల భవితవ్యం ఏంకావాలని, కవిత వెంట నిత్యం కనిపించే జాగృతి నేతలు మీడియా సమక్షంలో నిలదీశారు. తాజా పరిణామాలతో కవితకు సొంత జాగృతిలోనే మద్దతు లేదన్నది తేలిపోయింది.
ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ ఏమన్నారంటే.. జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తాం. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పని చేసిన ఎంతో మంది జీవితాలు ఏం అవ్వాలి? 19 సంవత్సరాలు పని చేసిన వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి?
కవిత సామాజిక న్యాయం అని అంటున్నారు. వారికి 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి. కానీ, వారి వెనక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా? కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఎవరి కోసం పని చేస్తున్నారు? ఎవరి ఆశయం కోసం పని చేస్తున్నారు?
కేటీఆర్ మిమ్మల్ని ఎలా ఉన్నావని అడగ లేదని బాధ పడుతున్నారు కదా? మరి మీతో ఉన్న మమ్మల్ని, తమ్ములు మీరు ఎలా ఉన్నారని ఒక్కసారైనా అడిగారా అక్క? ఇన్ని ఏండ్లు మేము మీతో పని చేసినందుకు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంటి? మీరు ఇవ్వాళ మీ సొంత అజెండా తోని పోతే.. వేల మంది జాగృతి కార్యకర్తల ఉసురు పోసుకున్నట్లు కాదా?