Suryaa.co.in

Andhra Pradesh

రేషన్ బియ్యాన్ని జగన్ రెడ్డి విదేశాలకు తరలించాడు

-మూడున్నరేళ్లలో రూ.7వేల కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించాడు
– ఉత్త రేషన్ బియ్యాన్ని తూతూమంత్రంగా పంపిణీచేస్తే ప్రజలు పండుగ ఎలా చేసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలి?
– జగన్మోహన్ రెడ్డిస్థానంలో మరొకరుంటే సిగ్గుతో ఉరివేసుకునేవారు
• రాజధాని రైతుల్ని అవమానిస్తున్న బొత్స, తమ్మినేని వారి రాజకీయజీవితంలో ఉత్తరాంధ్రకు ఏం సాధించారు?
• విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వారు, మూడురాజధానులు నిర్మిస్తారా?
ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకుపెడితే అదేగొప్ప విషయమా?
– మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్

పండుగనాడు ప్రజల్ని పస్తులుంచి, వారి జీవితాల్లో చీకట్లు నింపి పండుగ ఆనందాన్ని దూరంచేస్తున్న జగన్ రెడ్డి, రేషన్ బియ్యాన్ని తూతూమంత్రంగా పంపిణీ చేయిస్తూ, ఈ మూడున్నరేళ్లలో రూ.7వేలకోట్ల విలువైన పేదల బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించాడని టీడీపీనేత, మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ అన్నారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …

“పాదయాత్రలో పచ్చి అబద్ధాలాడి, బుగ్గలు నిమిరి, తలపై చేతులుపెట్టి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని గుండుసున్నాచేశాడు. వైసీపీ మేనిఫెస్టోలో 95శాతం హామీలు నెరవేర్చానంటున్న జగన్, తన వ్యాఖ్యలకు కట్టుబడి, హామీల అమలుపై వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయగలడా? వాస్తవాలను ప్రజల ముందుంచే ధైర్యం ఆయనకుందా? సొంత బాబాయ్ ని చంపిన వారిని కనిపెట్టలేని వ్యక్తి, ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడా?

పథకాలు, అభివృద్ధికి, ఆఖరికి జీతాలకు కూడా నిధులులేవని మంత్రులు అంటుంటే, నిధుల సమస్యలేదని చెబుతున్న ముఖ్యమంత్రి, డబ్బులు ఎక్కడున్నాయో సమాధానం చెప్పాలి, ఎవరికీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇడుపులపాయలో దాస్తున్నాడా? గాలిలోపుట్టి, అబద్ధాలతో, మోసంపునాదులపై నెగ్గినవారు, భవిష్యత్ లో 175స్థానాలు గెలుస్తారా? గడపగడపకు వెళ్తున్నవారిపై ప్రజలు ఉమ్మేస్తున్నారు. జనం దెబ్బకు భయపడే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుంటున్నారు. తనతండ్రికి, తనకుటుంబానికి రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీకే జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడనే వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిది. రాజకీయాల్లో అసలైన వెన్నుపోటుదారుడెవరంటే ముందుగా గుర్తొచ్చేది జగన్ రెడ్డే.

రేషన్ పంపిణీ పేరుతో ఉత్తబియ్యం ఇస్తే ప్రజలు సంతోషంగా పండుగ చేసుకోగలరా? చంద్రబాబునాయుడు పండుగలవేళ 10రకాలసరుకులతో కూడినకిట్లు ప్రజలకు ఉచితంగా అందించారు. అలాచేయడం చేతగాదు కనుకనే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్, పండుగ సరుకుల పంపిణీని అవహేళన చేశారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో కోటి 47లక్షల రేషన్ కార్డులుంటే జగన్ వాటిని కోటి 44 లక్షలకు తగ్గించాడు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమరవాణా జరుగుతుంటే పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ విభాగాలు ఏంచేస్తున్నాయి?

వైసీపీఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు బాగోలేదంటున్న ముఖ్యమంత్రి తీరుచూస్తే చెప్పేవాడికి, వినేవాడికి బుద్ధిలేదన్నట్లుంది. బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి పనితీరే బాగోలేదంటున్న జగన్, ఇక ఇతరుల్ని ఏంచేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. కోర్టుల ద్వారా జగన్ రెడ్డికి పడినన్ని చీవాట్లు, మొట్టికాయాలు దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా పడ్డాయా? జగన్మోహన్ రెడ్డిస్థానంలో మరొకరుంటే సిగ్గుతో ఉరివేసుకునేవారు. నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఆగ్రహావేశాలతో ముఖ్యమంత్రి డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ చేసిన నినాదాలు, ఈ ప్రభుత్వం చేసిన దసరా ఉత్సవాల నిర్వహణకు అద్దం పట్టాయనే చెప్పాలి.

3 పంటలుపండే భూముల్ని రాజధానికి త్యాగం చేసినవారిని అవమానించి, ఆనందిస్తున్న వారికి సిగ్గుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండటాన్ని స్వాగతించినవారు, ఇప్పుడెందుకింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? అన్నంపెట్టే 33వేల ఎకరాల భూముల్ని ఉచితంగా ఇచ్చారని చెబితే స్వయంగా ప్రధానమంత్రే ఆశ్చర్యపోయారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రాజధాని రైతుల్ని తూలనాడుతున్న బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారామ్ ఇన్నేళ్లలో వారికున్న రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్రకు ఏంచేశారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేని వారు, మూడు రాజధానులు నిర్మిస్తారా? వారిద్దరేకాదు, ఇతర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? రైతుల్ని అవమానించినవారికి ఎప్పటికైనా అన్నదాతల ఉసురు తగలకతప్పదు.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏమన్నారో తెలియడంలేదా? చంద్రశేఖర్ రావు, తెలంగాణ వారితో పెట్టుకుంటే ఏమవుతుందో వైసీపీ వారికి బాగాతెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటో, ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజనానంతర రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిచేశారో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడున్న ఈ జగన్ రెడ్డి, ఆయన మంత్రుల్లాగా మట్టి, నీరు, ఇసుక, భూములు, ఖనిజసంపద అమ్ముకోలేదు.

చంద్రబాబు నాయుడు కి ముఖ్యమంత్రి పదవి కొత్తేమీ కాదు, ఆయన ఆలోచన ప్రజల గురించి, రాష్ట్రం గురించేనని తెలుసుకోండి. అలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు అనుభవిస్తున్నది అంతా ఆయనఆలోచనలు, అభివృద్ధి ఫలితమే. మహానుభావుడైన ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకుపెడితే అదేగొప్ప విషయమా?” అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు.

LEAVE A RESPONSE