వారికి రూ.50లక్షలు ప్రకటించిన జనసేనాని

269

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. జై ఆంధ్రా, జై తెలంగాణ, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు, నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.

“కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీరమహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నాను. అలాగే, సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు… మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ వ్యాఖ్యానించారు.