Suryaa.co.in

Political News Telangana

జయహో జననాయక

(మధు)

పేదల రక్షణ కవచం
నిజాయితీకి నిలువెత్తు రూపం
అక్రమార్కులకు కొదమ సింహం
అపర చాణిక్యుడు
పట్టు వదలని విక్రమార్కుడు
స్నేహమంటే ప్రాణం
భూమి పుత్రుడా భట్టి జయహో జననాయక
శతమానం భవతి

హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకులే నూతన చరిత్రను సృష్టిస్తారు. సామాన్యులు, బడుగులు, అట్టడుగు వర్గాల జీవితాలకు ఒక కొత్త దిశ, దశను అలాంటివారే ప్రసాదించగలరు. డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్, మహాత్మాగాంధీ, కార్ల్ మార్క్స్ వంటి మహనీయుల ఆశయాలకు, ఆదర్శలకు అనుగుణంగా జీవితాన్ని అర్థవంతంగా మలచుకుని … చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో నిజాయతీ నిబద్ధతను కనబరిచే భట్టి విక్రమార్క ఇవ్వాళ నాయకత్వానికే కొత్త అర్థం చెబుతున్నారు.

సమాజాన్ని నిరంతరం సానుకూలంగా ప్రభావితం చేస్తూ, ఎప్పుడూ చుట్టూ ఉన్నవాళ్ళ బాగు కోరే భట్టి విక్రమార్క జన్మదినం ఇవ్వాళ. సమాజ హితం కోరే వారంతా భట్టి విక్రమార్క పుట్టిన రోజును పర్వదినంగా అభివర్ణిస్తున్నారు.

పట్టు వదలని విక్రమార్కుడు, అపర చాణక్యుడు, రాజకీయాల్లో రాణించాలంటే కులం, డబ్బు మూలం కాదు ప్రణాళిక, పట్టుదల, కార్యాచరణ ఉండాలని నేటి తరానికి ఆచరించి చూపిన దిక్సూచి.. నిలువెత్తు నిదర్శనం
సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన భట్టి విక్రమార్క నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత.

భట్టి విక్రమార్క మనిషిని ప్రేమిస్తారు. మనిషి గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపిస్తారు. తెలిసిన వాళ్ళైనా తెలియనివాళ్లు అయినా కనిపించిన మనిషిని హృదయపూర్వకంగా నవ్వుతూ పలకరిస్తారు. మానవ సంబంధాలు, సమాజం మీద మనం వేసే ముద్ర, మన నైపుణ్యాలు ఇవి నిజానికి ఎవరికైనా వెలకట్టలేని ఆస్తి. ఆ రకంగా చూస్తే మానవతావాది భట్టి విక్రమార్క మరెవరూ అందుకోలేని స్థాయిలో ఉన్న అత్యంత గొప్ప ధనవంతుడు అని చెప్పక తప్పదు.

పేదల బాగుకోసం నిత్యం తపన పడే భట్టి విక్రమార్క ఆ క్రమంలో ఎక్కడ రాజీ పడకుండా, తాను అనుకున్నది సాధిస్తున్న ధీరోదాత్తుడు. బడుగులు, నిరుపేదలు బాగా చదువుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని పరితపించే యోగి. కోరుకోవడమే కాదు అందుకు మార్గాలను అన్వేషించి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించే సంస్కర్త. నిజాయితీకి నిలువెత్తు రూపం.. అక్రమార్కులకు కొదమ సింహం.

సాధారణ నాయకుడిగా మొదలు…
ఉప ముఖ్యమంత్రిగానూ,ఆర్థిక మంత్రిగానూ జన జీవితాలను గుణాత్మకంగా మార్చే ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడువలేదు ఆయన. తాజా బడ్జెట్లో సంక్షేమానికి ఆయన పెద్దపీట వేసిన తీరే అందుకు తార్కాణం. మధ్యలో మరే దళారీతోనూ పని లేకుండా ప్రభుత్వ నిధులను నేరుగా అర్హులైన పేదలకు గడపల దరికి చేర్చిన ఆధునిక భగీరతుడు భట్టి విక్రమార్క.

చదువు సంస్కరాన్ని నేర్పుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం భట్టి విక్రమార్క. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణకు ఆయన పెట్టింది పేరు.

ప్రేమ, ఆప్యాయతలకు ఆయన ప్రతిరూపం. కాంగ్రెస్ భావజాలాన్ని బతికించేందుకు ఆయన ఓ జ్వలించే సైనికుడిలా నిత్యం ప్రయత్నిస్తుంటారు.

ఎదుటివారి కోణంలో నుంచి సమస్యలను అర్థం చేసుకుని, శాయశక్తులా సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండే భట్టి విక్రమార్క వంటివారే ఈ సమాజానికి చోదక శక్తులు… నిత్య స్ఫూర్తి ప్రదాతలు.

కుటుంబం, వ్యక్తిగత ఆనందం కన్నా ప్రజలు, పేదల కష్టాలు, పల్లెల్లో నిత్య సంచారమే ఆయనకు ప్రియమైన వ్యాపకం. ఏ స్థాయిలో ఉన్నా ఆయన జీవనం విధానం సాధారణంగా ఉంటుంది. కాళ్లు యెన్నడూ నేలకు ఆనించే జీవిస్తారు. పల్లెని, పచ్చదనాన్ని ఆయన ఆస్వాదిస్తారు.

స్నేహమంటే ప్రాణం పెట్టే ఆయన, తన వారు అనుకుంటే ఎంత దాకా అయినా వెళ్లి వారికోసం దేన్నైనా ధిక్కరించి పోరాడుతారు.చేసే సాయం గోప్యంగా ఉంచే ఆయన ఏనాడూ ఆడంబరాల జోలికి పోరు. ప్రచారాల పట్టింపు లేకుండా పని చేసుకోవడమే ఆయనకు తెలిసిన విద్య.

కమ్యూనిస్టుల కంచుకోటలు బద్దలు కొట్టి వరుసగా నాలుగు సార్లు మధిర ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దురంధరుడు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పేరిట మండువేసవిలో సుదీర్ఘ పాదయాత్రతో గులాబీ గోడలు బద్దలు కొట్టిన యోధాగ్రేసరుడు ఆయన. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించి న పరిణతశీలి. సమాజంలో సగభాగమైన మహిళలకు సాధికారత కల్పించి… వారి చుట్టూ పరుచుకొన్న ఆర్థిక, సామాజిక అసమనతలను రూపుమాపాలని కంకణం కట్టుకున్న మార్గదర్శి భట్టి విక్రమార్క.

ఎలాంటి అవసరంలోనైనా పిలిస్తే పలికే వ్యక్తిగా, నమ్మిన ఆశయాల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిగా, వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగిన భట్టి విక్రమార్క వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి…మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా కలకాలం విలసిల్లాలని పౌర సమాజం అభిలషిస్తోంది. జయహో జననాయక.. మీకు శతమానంభవతి.

LEAVE A RESPONSE