Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జగన్ ఆలోచనల వాస్తవరూపమే జాబ్ మేళాలు

-గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం చర్యలు
-ఆర్బీకేల్లో  ఇక ఎనీ టైం మనీ
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, రాష్ట్రంలో నిరుద్యోగం పూర్తిగా నిర్మూలించేందుకు నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన ఆలోచనలకు వాస్తవరూపమే మెగా జాబ్ మేళాలని అన్నారు. తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 30,473 మందికి ఉద్యోగాలు లభించాయని, అదే స్ఫూర్తితో మే 7, 8 తేదీల్లో గుంటూరులోనూ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగార్థులు తమ వివరాలను వైఎస్సార్ జాబ్ మేళా వెబ్ సైట్ లో తక్షణమే నమోదు చేసుకోవాలని కోరారు. తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్ మేళాలలో ఎంపికైన అభ్యర్థులు రూ.15 వేల నుంచి లక్ష వరకు వేతనాలు పొందారని గుర్తుచేశారు.  గుంటూరు జాబ్ మేళాకు ఇప్పటికే 44 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వివిధ రంగాలకు చెందిన 148 కంపెనీలు పాల్గొననున్నాయని అన్నారు.

సమాజం ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందేందుకు పర్యావరణ పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనదని, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్య నిర్వహణ కోసం ఇంటింటా చెత్తసేకరణకు 2 కోట్ల చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్నారని, చెత్తను తరలించేందుకు 5500 ట్రాక్టర్లు అందుబాటులోకి తేనున్నారని అన్నారు.  ప్రతి గ్రామంలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించనున్నారని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎల్లప్పుడూ నగదు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల్లోనే ఏటీఎంలను ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు . ప్రభుత్వ పిలుపు మేరకు యూనియన్ బ్యాంక్ పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో ఆర్బీకే వద్ద ఏటీఎంలు ఏర్పాటు చేసిందని అన్నారు. వీటి పనితీరు పై అధ్యయనం చేసిన బ్యాంకు అధికారులు సత్ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారని తెలిపారు. రోజుకు 50 నుంచి 100 మంది ఏటీఎం సేవలు వినియోగించుకుంటున్నారని, ప్రతిరోజూ రూ.3 లక్షలకు పైగా విత్ డ్రా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE