Suryaa.co.in

Editorial

బీజేపీ అధ్యక్ష రేసులో మోదీ ప్రత్యర్ధి జోషి?

– తెరపైకి సంజయ్ జోషి పేరు
– ఆరెస్సెస్ దన్నుతో అధ్యక్ష రేసులో జోషి
– గడ్కరీ, రాజ్‌నాధ్‌సింగ్ వంటి అగ్రనేతల మద్దతు?
– గతంలో జోషిని యుపి ఇన్చార్జిగా నియమించిన గడ్కరీ
– మోదీ రాకతో జోషిని తప్పించిన వైనం
– నాడు మోదీతో పొసగకపోవడంతో ఢిల్లీకి
– జాతీయ సంఘటనా మహామంత్రిగా చేసిన జోషి
– జోషిని తప్పించకపోతే ప్రధానిగా పనిచేయనన్న మోదీ
– ఆయనను తప్పించిన తర్వాతనే మోదీ ప్రమాణస్వీకారం
– ఇప్పుడు మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి జోషి రావడంతో ఉత్కంఠ
– జోషి పేరు రావడంతో బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం
– చిన్నవయసులోనే జాతీయ సంఘటనా మహామంత్రిగా చేసిన రికార్డు
– జోషి నియామకాన్ని మోదీ-షాలు అంగీకరిస్తారా?
– జోషి రాకతో బీజేపీ వర్గాల్లో పెరుగుతున్న జోష్
(మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీతోపాటు దేశాన్ని కంటిచూపుతో శాసిస్తున్న ప్రధాని నరేంద్రమోదీని సవాల్ చేసే శక్తి ఇప్పట్లో ఎవరికీ లేదు. ఆయనను ఢీకొట్టే మొనగాడు కూడా ఏ పార్టీలోనూ భూతద్దం వేసినా కనిపించడం లేదు. అయితే ఒకప్పుడు మోదీ కంట్లో నలుసుగా ఉండే సొంత పార్టీ సీనియర్ నేత ఒకరు, మళ్లీ తెరపైకి రానుండటం ఆసక్తికరంగా మారింది.

సైద్ధాంతికంగా మోదీ వ్యతిరేకించే ఆ సంఘ దళపతి పేరు, ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి వినిపిస్తోంది. హటాత్తుగా ఆయన పేరు తెరపైకి వచ్చేందుకు, సంఘమే అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. పార్టీలో తొలి నుంచి ఉప్పు-నిప్పుగా ఉన్న వారిద్దరి వ్యవహారం.. ఇప్పటి తరానికి తెలియకపోయినా, కమలం పాతకాపులకు కొట్టినపిండి.

మోదీని తొలి నుంచే సైద్ధాంతికంగా వ్యతిరేకించే ఆ యోధుడే సంజయ్‌ వినాయక్ జోషి . ఒకప్పటి బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి. అంటే పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ అన్నమాట. బీజేపీలో ప్రధాని పదవి కంటే, ఈ జాతీయ సంఘటనా మహామంత్రి పదవే ఎక్కువ. ఇప్పుడు ఆ పదవిలో బీఎల్ సంతోష్‌జీ ఉంటే.. ఇరవైఏళ్ల క్రితమే జోషి ఆపదవిలో బీజేపీని వెలిగించారు.

గుజరాత్‌కు చెందిన ఇంజనీరయిన సంజయ్ జోషి ప్రభ, నితిన్‌గడ్కరీ ఉన్నంతవరకూ బీజేపీలో దేదీప్యమానంగా వెలిగింది. 2011-12లో జోషిని, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ యుపి ఇన్చార్జిగా నియమించారు. జోషి తొలి నుంచీ మోదీ వ్యతిరేకి అన్నది బహిరంగమే. మోదీ వ్యతిరేకులకు దన్నుగా నిలవడంతో, అక్కడి నుంచీ ఇద్దరి మధ్య దూరం పెరిగి.. అది చివరకు, సంజయ్‌జోషి ఉంటే పార్టీ ప్రచార బాధ్యతలు-ప్రధానిపదవి తీసుకోనని, మోదీ హఠం వేసేంత వరకూ వెళ్లింది.

ఒకప్పుడు పార్టీలో జోషి కత్తికి ఎదురులేదు. సమర్ధుడైన ఆర్గనైజర్‌గా పేరుంది. ముచ్చటగా ముగ్గురు అధ్యక్షులు ఆయన హయాంలో పనిచేశారు. ఉత్తరాదిలో కాషాయం కళకళకు ఆయనో కారకుడు. పార్టీ శ్రేణులకు ఆయనో భరోసా. అపాయింట్‌మెంట్ పటాటోపం లేదు. బీజేపీలో తాను టాప్ బాసునన్న భేషజం లేదు. ఎవరైనా ఆయనను సులభంగా కలిసే అవకాశం ఉండేది. ఆయన పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ రోజూ వందలమందిని ఆయనను కలుస్తున్నారంటే, పార్టీలో జోషి ముద్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

అయితే మోదీషా-రంగప్రవేశం, జోషిని విజయవంతంగా తెరవెనక్కి నెట్టేసింది. ఆయన ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో సుదీర్ఘ విరామానంతరం.. మళ్లీ తెరంగేట్రం చేస్తుండటం పార్టీలో సహజంగానే చర్చనీయాంశంగా మారింది.

బీజేపీలో ఒకప్పుడు ఎవరెంత గొప్పవారయినా దాని మార్గదర్శి ఆరెస్సెస్ తర్వాతే ఎవరైనా. వ్యక్తిస్వామ్యానికి విరుద్ధమైన బీజేపీలో తన చరిష్మా-త్యాగంతో ఆ పద్ధతిని పక్కనపెట్టి.. అదే వ్యక్తిస్వామ్యానికి తెరలేపిన నేత నరేంద్ర మోడీ అన్నది నిర్వివాదాంశం. గత పదేళ్లుగా ఆయన ప్రభ జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

గతంలో వాజపేయి, అద్వానీ, కుశభవ్‌ఠాక్రే, జనా కృష్ణమూర్తి, మురళీమనోహన్‌జోషి, వెంకయ్యనాయుడు, రాజ్‌నాధ్‌సింగ్ వంటి హేమాహమీలున్నప్పటికీ.. వారికి సంఘ్ నిర్ణయమే శిలాశాసనం. కానీ మోదీ-షా ఢిల్లీ ప్రవేశంతో, సంఘ్ శైలి కూడా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారిద్దరి అభీష్టానికి భిన్నంగా, ఎవరూ బీజేపీ అధ్యక్షులయ్యే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా బీజేపీని సంఘ్ శాసిస్తుందా? సంఘ్ బీజేపీని శాసిస్తుందా? సంఘ్ పెద్దనా? మోదీషా పెద్దనా? అన్న సైద్ధాంతిక చర్చకు కారణమయింది.

ఈ క్రమంలో మోదీకి అప్పట్లో పార్టీలో బద్ధశత్రువైన సంజయ్‌జోషి, త్వరలో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. మోదీ అప్పట్లో గుజరాత్ బీజేపీ సంఘటనా మంత్రిగా పనిచేసిన రోజుల్లో, సీఎం అయిన కేశూభాయ్‌పటేల్‌ను మోదీ వ్యతిరేకించేవారు. ఆ దానితో సంఘ్ జోక్యం చేసుకుని, మోదీని ఢిల్లీకి పంపింది.

అంతకుముందు మోదీ.. 1993 నుంచి 1996 వరకూ, గుజరాత్ పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెట్రరీగా పనిచేశారు. 1996లో ఆయనను సంఘ్, జాతీయ పార్టీ కార్యదర్శిగా పంపించింది. ఆ పదవిలో ఆయన 1998 వరకూ కొనసాగారు.

సంఘ్ ఆదేశం మేరకు 2001లో మోదీ గుజరాత్ సీఎంగా వెళ్లారు. ఆ సమయంలో జోషి గుజరాత్ పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా వెళ్లారు. అప్పుడే మోదీ-జోషి మధ్య సైద్ధాంతిక విబేధాలు తారాస్థాయికి చేరాయి. తన వ్యతిరేవర్గాన్ని జోషి ప్రోత్సహించడం మోదీకి నచ్చేదికాదు.

వారిద్దరిమధ్య ఘర్షణ వాతావరణం పెరగడంతో రంగంలోకి దిగిన సంఘ్ పెద్దలు, జోషిని జాతీయ పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా పంపించింది. ఆరకంగా 43 ఏళ్లకే, జాతీయ సంఘటనా మహామంత్రి పదవి చేపట్టిన వారిలో ఆయనే ప్రధముడు. అయితే అక్కడ కూడా, జోషి నాటి గుజరాత్ సీఎం మోదీ వ్యతిరే వర్గాన్ని ప్రోత్సహించేవావారన్న విమర్శలుండేవి.

ఈ నేపథ్యంలో 2014 లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. అప్పటికే దేశంలో మోదీ ప్రభ వెలిగిపోతోంది. మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది. అన్ని రాష్ట్రాలూ గుజరాత్ వైపే చూసే పరిస్థితి. జాతీయ మీడియా సైతం మోదీని ఆకాశానికెత్తేసింది. జాతీయ స్థాయిలో సోనియాను ఎదుర్కొనే ఏకైక నేతగా, మోదీని ప్రచారంలో పెట్టింది. అటు హిందూ సంస్థలు సైతం.. మోదీ సారథ్యంలో భారతదేశం, హిందూదేశంగా ఆవిర్భవిస్తుందనే ప్రచారాన్ని మోతమోగించాయి. తొలిసారి మోదీ సారథ్యంలో, సోషల్‌మీడియాను బీజేపీ విసృత్తంగా వినియోగించుకుంది.

దానితో బీజేపీ ఎన్నికల సారథ్యాన్ని సంఘ్ మోదీకి అప్పగించింది. అయితే తాను ఆ బాధ్యతలు తీసుకోవాలన్నా, తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టాలన్నా.. అప్పటి జాతీయ సంఘటనా మహామంత్రిగా ఉన్న, సంజయ్‌జోషిని తప్పించాలని మోదీ షరతు విధించారు. దానితో రంగంలోకి దిగిన సంఘ్ పెద్దలు.. జోషికి పరిస్థితి వివరించి, తప్పుకోవాలని సూచించారు. దానికి అంగీకరించిన జోషి, తనకు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించాలని కోరగా, సంఘ్ అందుకు అంగీకరించింది. అయితే మోదీ దానికి సైతం అంగీకరించలేదు. అసలు జోషి పార్టీలోనే ఉండకూడ దని షరతు విధించారు.

అప్పటికే జోషిపై పార్టీలో అంతర్గతంగా ‘‘మానవ బలహీనతకు సంబంధించిన ఆరోపణ’’ అంశం బలంగా బిగిసుకుంది. కొద్దికాలం క్రితం బీజేపీలో వెలిగిన రాంమాధవ్‌ కూడా, అంతర్గతంగా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో.. ఆయనను తప్పించాల్సి వచ్చిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. అయితే ఇవన్నీ.. పార్టీ వర్గాలకే పరిమైతమైన రహస్యాలే తప్ప, బయట ప్రపంచానికి తెలిసినవి కాదు. సహజంగా సంఘ్ వ్యవహారాలు, మిగిలిన పార్టీల మాదిరిగా బయటకు రావు. కారణం సంఘ్ మీడియాకు దూరంగా ఉండటం, అసలు తెరపైకి రాకపోవడమే!

దానితో విధిలేక మీడియా ముందుకొచ్చిన జోషి, తనంతటతాను జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాతనే మోదీ.. పార్టీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు, తర్వాత ప్రధాని పదవి చేపట్టారు. ఇవన్నీ బీజేపీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లకు తెలిసినవే.తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన జోషి, ఢిల్లీలోనే ఉంటూ మోదీ వ్యతిరేక శిబిరం నడిపారన్న ఆరోపణలు లేకపోలేదు. జోషికి సమర్ధవంతుడైన నాయకుడన్న పేరుంది.

అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సంజయ్‌జోషి పేరు, అధ్యక్ష పదవికి తెరపైకి రావడం పార్టీవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఢిల్లీలో జోషి పేరు మళ్లీ చర్చకు వస్తోంది. సమర్ధుడైన ఆర్గనైజర్‌గా పేరున్న జోషి ఒకవేళ అధ్యక్షుడైతే, పార్టీలో మోదీ-షా హవాకు తెరపడినట్లేనన్న వ్యాఖ్యలు అప్పుడే మొదలవడం విశేషం.

అయితే ఇప్పుడున్న పరిస్థితితో జోషి రావడం అసంభవమని, మరికొందరు సీనియర్లు చెబుతున్నారు. అసలు జోషికి ఎంట్రీనే కష్టమంటున్నారు. మోదీ-అమిత్‌షాకు ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో.. వారే అధ్యక్షులవుతారన్నది వారి వాదన.

అయితే ఒకప్పుడు మోదీ-జోషి మంచి మిత్రులని, 1995లో గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి, వారిద్దరూ పడిన కష్టమే కారణమని బీజేపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన విబేధాలే వారిద్దరి మధ్య శత్రుత్వం పెంచాయంటున్నారు.

‘ఇప్పుడు జోషి మళ్లీ తెరపైకి వస్తున్నారన్న ప్రచారం ఢిల్లీలో బాగా ఊపందుకుంది. అదే నిజమైతే మోదీ అందుకు అంగీకరించి ఉండాలి. సంఘ్ పెద్దలు వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చి ఉండాలి. లేకపోతే జోషి ప్రవేశం అంత సులభంగా జరగద’ని సంఘ్ సీనియర్ నాయకుడొకరు వాఖ్యానించారు.

కాగా దేశంలో నెలకొన్న రాజకీయాలు, గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బలం తగ్గడం, వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పెరుగుతున్న నేపథ్యంలో.. పార్టీలో ఇక వ్యక్తిస్వామ్యానికి తెరదించాలని, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన సంఘ్ కీలక భేటీలో నిర్ణయం తీసుకుంది. బహుశా అందులో భాగంగానే, సంఘ్ విధేయుడైన సంజయ్ జోషి పేరు తెరపైకి వచ్చి ఉండవచ్చంటున్నారు. సంఘ్ ప్రమేయం-అనుమతి లేనిదే జోషి పేరు తెరపైకి రావటం అసంభవమంటున్నారు.

సంఘ్ ఎవరి ప్రాధాన్యతను ఎప్పుడు తగ్గిస్తుందో, ఎప్పుడు పెంచుతుందో ఎవరి ఊహకు అందదు. ఏడాది క్రితం వరకూ బీజేపీలో ఒక వెలుగువెలిగి, ట్రబుల్‌షూటర్‌గా పేరున్న సీనియర్ ప్రచారక్ రాంమాధవ్‌ను.. ఒకదశలో విదేశాంగశాఖమంత్రిగా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ హటాత్తుగా ఆయన ప్రాధాన్యతను దారుణంగా తగ్గించి, తిరిగి సంఘ్‌కు పంపించేసిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

మోదీ-షాతో సరిపడని క్రమంలోనే ఆయన ప్రాధాన్యం తగ్గించారన్న ప్రచారం జరిగింది. అయితే సుదీర్ఘ విరామానంతరం..ఇటీవలి జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రాంమాధవ్‌ను ఇన్చార్జిగా పంపించారు. ఆయనతోపాటు ఒకప్పుడు సమానంగా వెలిగి, బీజేపీలో చక్రం తిప్పిన మరో సీనియర్ ప్రచారక్ బాగయ్య ప్రాధాన్యతను కూడా ఒకేసారి తగ్గించారు.

పురందేశ్వరికి అధ్యక్ష పదవి వచ్చేందుకు ఆయనే కారణమన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఆయన ఒక వర్గాన్ని విపరీతంగా ద్వేషించేవారని, ఆయన వల్ల ఆ వర్గానికి చెందిన చాలామంది సీనియర్లకు ప్రధాన్యం దగ్గకుండా పోయిందన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ పరిణామాలు పరిశీలిస్తే.. సంజయ్ జోషిని తిరిగి తెరపైకి తీసుకువచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.

LEAVE A RESPONSE