‘‘ మీ అందరికీ తెలుసు. నా కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేశారో. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. రాజ్యాంగ సూత్రాలను సమర్ధించిన న్యాయవ్యవస్ధ సభ్యులు బదిలీలు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. న్యాయమూర్తుల కుటుంబాలు రాజకీయ కుట్రలకు లక్ష్యంగా మారాయి’’
– ఇది సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల విట్ స్నాతకోత్సవంలో.. గత జగన్ ప్రభుత్వం, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసిన వేధింపులనుద్దేశించి చేసిన ఆవేదనాభరిత వ్యాఖ్యలు
సీన్ కట్ చేస్తే..
‘‘ జస్టిస్ ఎన్వీ రమణ మామూలు వ్యక్తి కాదు. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అటువంటి వ్యక్తి ఇప్పుడు తనను జగన్ టార్గెట్ చేశారని, తాను ఏమీ చేయలేకపోయానని నిస్సహాయంగా మాట్లాడటం చూస్తే కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? రమణ అవినీతిపరుడా? లేక ఆయన చేతకానివాడా? లేక రెండూనా? ఈ రెండూ కాకపోతే ఆయన జగన్‌పై తిరిగి ఎందుకు చర్యలు తీసుకోలేదు? జగన్ చేసిన రాజ్యాంగవిరుద్ధ చర్యలు, నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టడం వంటివాటిపై ఎందుకు స్పందించలేదు? ఇప్పుడెందుకు రోదిస్తున్నారు’’
– ‘ఎక్స్’లో సీబీఐ మాజీ డైరక్టర్ ఎం.నాగేశ్వర్రావు ట్వీట్
మళ్లీ సీన్ కట్ చేస్తే..
‘‘ ఆయన టార్గెట్ చేశాడు అని ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారు. చీఫ్ జస్టిస్‌గా ఉండి, అటకెక్కిన జగన్ అవినీతి కేసులు, వివేకా కేసులకు ఎందుకు ముందుకు తీసుకుపోలేదు? ఆంధ్రాకు వచ్చి కోర్టులో కేసులు ఉన్న అవినీతి కింగ్ జగన్‌తో సన్మానం ఎందుకు చేయించుకున్నారు? జగన్-ఆయన భార్యను విజయవాడ నోవాటెల్‌లో దొంగచాటుగా ఎందుకు కలిశారు? సీటులో కూర్చోవడం గొప్పకాదు సార్. కూర్చుని ఏం సాధించారన్నది ముఖ్యం’’
– సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్, సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ నలమోతు చక్రవర్తి ట్వీట్
ఇంకో సీన్ కట్ చేస్తే..
‘‘ ఆయన సీజేగా ఉన్నప్పుడు జగన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అవకాశం ఉన్నప్పుడు జగన్‌పై చర్య తీసుకోకుండా, ఇప్పుడు తనను టార్గెట్ చేశారని వాపోవడంలో అర్ధం లేదు. ఇప్పుడు విట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ ప్రభుత్వం-కార్యకర్తల సానుభూతి కోసమే. ఆయన సీజేగా ఉన్న కాలంలో కనీసం విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిధులు ఇప్పించలేకపోయారు. విజయవాడ కోర్టు బయట పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? అడ్వకేట్లు పార్కింగ్ లేక కార్లు బయట పెట్టుకుంటున్నారు’’
– ప్రముఖ న్యాయవాది ఏ.ప్రసాద్
మళ్లీ సీన్ కట్ చేస్తే..
‘‘ హాయిగా శ్రీమంతం ఫంక్షన్లకు, నూతన వస్త్ర బహూకరణ వేడుకలకి వెళ్తున్న రమణులకి ఇదెక్కడనుండి గుర్తొచ్చిందో వింతగా’’?!
ఇప్పుడు బాధపడి ఏమి ఉపయోగం రమణ గారు?
*మీరు భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైనప్పుడు తెలుగు వారిగా మేము ఎంతో సంతోషించాం. న్యాయవ్యవస్థలో మీదైన ప్రత్యేక ముద్ర వేస్తారని, రాష్ట్రానికి చెందిన జగన్ రెడ్డి లాంటి అరాచక, ఆర్ధిక నేరగాళ్ళకు ఇక చిప్ప కూడే గతి అని అనుకున్నాం. కానీ, మీరు ఒరగబెట్టిందేమిటి?
*తన రాజకీయ విరోధులకు ప్రయోజనం కలిగించేలా మీరు ఒక ప్రణాళికతో వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో మీరు కుమ్మక్కయ్యారని ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి మీపై అనేక ఆరోపణలు చేస్తూ అప్పటి CJI కు లెటర్లు రాస్తే… మీరు ఏం చేయగలిగారు?
*అప్పటి ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డి గారు ప్రెస్‌మీట్ పెట్టి మరీ మీపై ఆరోపణలు చేస్తే మీరు ఏం చర్యలు తీసుకోగలిగారు?
*ఆ సమయంలో మేము టివి చర్చల్లో పాల్గొన్నప్పుడు మీపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ముప్పు వాటిల్లే చర్య అని, అప్పటి ఏపీ ప్రభుత్వ చర్యలు ఖశ్చితంగా కోర్టు ధిక్కరణే అని గొంతులు చించుకున్నాం. ఫలితం ఏముంది?
*మీపై ఆరోపణలు చేసిన వ్యక్తితో , మీరు ఇప్పుడు మీ కుటుంబాన్ని టార్గెట్ చేశారని అంటున్న వ్యక్తితో మీరు రాష్ట్రానికి వచ్చి సన్మానాలు చేయించుకోవడం, జగన్ రెడ్డి దంపతులను విజయవాడ హోటల్ లో రహస్యంగా కలవడం మరిచిపోయారా సార్?
అవకాశం ఉన్నప్పుడు సమాజానికి ఏమీ చేయలేని మీరు, ఇప్పుడు వాపోవడం దండుగ. చక్కగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అటెండ్ అవడం, మీ మాటలు వింటూ తలూపే వారికి నీతి సూత్రాలు వల్లించడం… ఇవే ఇక మీరు చెయ్యాల్సిన పనులు నో (N ) వాయిస్ (V) రమణ గారు!!!
– ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న మరో పోస్టు ఇది.
ఇవన్నీ టీడీపీ సోషల్‌మీడియా సైనికులు.. ప్రధానంగా కమ్మ సామాజికవర్గ ప్రముఖులు, సోషల్‌మీడియా వేదికగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలే కావడం విశేషం. దీన్నిబట్టి కమ్మ సామాజికవర్గం అవసరం వచ్చినప్పుడు, ఎక్కడా వెనక్కితగ్గదని.. ఎవరినీ లెక్కచేయదన్నది ఈ పోస్టుల సారాంశం. ఏపీలో ఆయనను, ఆయన శిష్యవర్గాన్ని సోషల్‌మీడియా వేదికగా సమర్ధిస్తున్న వారి ఆ‘వేదన’ కంటే.. వారిపై సోషల్‌మీడియా సైనికుల ఆగ్రహమే ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం.
* * *
జగన్ ప్రభుత్వ హయాంలో తనను, కుటుంబం వేధింపులకు గురయిందన్న ఒక్క వ్యాఖ్య, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీరమణకు శిరోభారంగా మారింది. ఆ వ్యాఖ్య ఆయనను చాలా కాలం వెనక్కి తీసుకువెళ్లి, ప్రశ్నల బోనులో నిలబడేందుకు దారితీసింది.
రమణగారు వెళ్లింది నిట్ యూనివర్శిటీ స్నాతకోత్సవానికి. వెళ్లిన సందర్భం వేరు. మామూలుగా అక్కడికి వెళ్లి, విద్యార్ధులకు నాలుగు హితోక్తులు చెప్పి వెళ్లిపోయి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. కానీ జగన్ ప్రభుత్వం తన కుటుంబాన్ని వేధించిందని, అమరావతి రైతుల పోరాటం వీరోచితమంటూ వ్యాఖ్యానించారు. నిజానికి విట్ విద్యార్ధులకు ఆ రెండు అంశాలతో సంబంధం లేదు. అది సమయం కాదు. సందర్భం అంతకంటే కాదు.
* * *
ప్రముఖులను కాపాడేందుకు ప్రతిసారీ రంగంలోకి దిగుతున్న ‘రక్షకులు’ ఎంత వాదించినా, జస్టిస్ రమణ గారి ఉన్నతి మొదలయిందే తెలుగుదేశం ప్రభుత్వంతో.. అన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా తెలుసు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్, హైకోర్టు న్యాయమూర్తి అయ్యారన్నది రహస్యేమేమీ కాదు.
నిజానికి అంతకుముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాలు కూడా.. తమకు సేవలందించిన న్యాయవాదులను, ఆరకంగా ప్రోత్సహించడం కొన్ని ద శాబ్దాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమే. దానికి ముసుగులు-మొహమాటాలు అవసరమే లేదు. ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ జడ్జిలు, సీజేలుగా ఉన్న వారంతా ఏదో ఒక రాజకీయ పార్టీ సిఫార్సు చేసి, ప్రోత్సహిస్తేనే అక్కడిదాకా వెళ్లారన్నది బహిరంగ సత్యం. కాబట్టి రమణ గారి ఒక్కరివైపే వేళ్లు చూపించడం న్యాయం కాదు. ఫలానా వ్యక్తి జడ్జి అయినంత మాత్రాన, ఒకరికి అనుకూలంగా తీర్పులు ఎలా ఇవ్వగలరు? వాళ్లకు పార్టీలతో ఏం సంబంధం? అని ప్రశ్నించిన వారు అమాయకుల కిందే లెక్క. ఎందుకంటే ఎవరూ ఏదీ శాస్త్రప్రకారం చేయరు.
***
విట్‌లో జస్టిస్ రమణ గారి వ్యాఖ్యలు టీడీపీ సోషల్‌మీడియా సైనికులు, కమ్మ వర్గానికి ఎక్కడో తగిలినట్లు ..సోషల్‌మీడియా వేదికగా వారు పెడుతున్న పోస్టులే చెబుతున్నాయి. నిజానికి జస్టిస్ రమణ గారు జగన్‌పై అలాంటి పరోక్ష వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఆయనకు మద్దతు పెరగాలి.
సోషల్‌మీడియా వేదికగా, రమణ గారి భుజం మీద నుంచి జగన్‌ను పేల్చి ఉండాలి. కానీ విచిత్రంగా.. దానికి బదులు.. రమణ గారి వ్యాఖ్యలపైనే ప్రశ్నాస్త్రాలు సంధించడం విశేషం, విస్మయకరం. ఇది ఒకరకంగా టీడీపీ సోషల్‌మీడియా సైనికులు-కమ్మ వర్గం ఆయనపై ‘ప్రేమ’ను చాటేవే.
* * *
అమరావతిలో రమణ గారి కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కొన్నారు. 77 యాక్టు ప్రకారం దళితుల భూములు అమ్మడం కొనడం-అమ్మడం నేరమని సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఆయనకు తెలియదా? అసైన్ల్యాండ్స్ అయినప్పటికీ ఎల్పిఎస్ కింద ఇస్తున్నారు కాబట్టి కొనుగోలు చేశామని వాదించినప్పటికీ.. ముందస్తుగా అది వస్తుందని ముందు తెలిసినందుకే, ఆ భూములు కొనుగోలు చేశారంటూ నాటి జగన్ సర్కారు ఆయన కుటుంబసభ్యులపై కేసులు పెట్టింది. ఇప్పటి మరో హైకోర్టు న్యాయ ప్రముఖుడిపైనా కేసు పెట్టింది. అది వేరే వ్యవహారం.
రమణ గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ఆయనపై నాటి ప్రభుత్వ సలహాదారు అజయ్కల్లంరెడ్డితో, ప్రెస్‌మీట్‌లోనే ఆరోపణలు చే యించి.. సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ గారు తన పలుకుబడిని ఉపయోగించి, రాష్ట్రంలోని జడ్జిలను ప్రభావితం చేస్తున్నందున, వారు తమ సక్రమంగా తమ విధులు నిర్వర్తించకపోతున్నారంటూ నాటి సీఎం జగన్.. చాంతాడంత ఉత్తరంతో నాటి సీజే, కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
పైగా ఆయన టీడీపీకి సానుభూతిపరుడని ఆరోపించారు. కాబట్టి ఆయనకు సీజే పదవి ఇవ్వవద్దని తన ఫిర్యాదులో కోరారు. అప్పుడు టీడీపీ సోషల్‌మీడియా సైనికులే కాదు.. కమ్మ సామాజికవర్గం, టీడీపీ నాయకులు, సానుభూతిపరులు ఒక్కతాటిపైకి వచ్చి జగన్ దుస్సాహసాన్ని ఎండగట్టారు. రమణ గారికి రక్షణగా నిలబడి, నైతిక మద్దతు ఇచ్చారు. నిజానికి ఒక సీఎం.. సుప్రీంకోర్టు జడ్జికి, ఫలానా వ్యక్తికి చీఫ్ జస్టిస్ పదవి ఇవ్వవద్దంటూ లేఖ రాయడం, దేశ చరిత్రలో అదే ప్రథమం. అంటే అప్పుడు జగన్ బరితెగింపు-బీజేపీ దన్ను ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు.
* * *
సరే.. నాటి సీజే వాటిని పట్టించుకోకుండా వైసీపీ సర్కారు ఫిర్యాదును బుట్టదాఖలు చేసి, సంప్రదాయం ప్రకారం తన వారసుడు జస్టిస్ రమణ గారేనంటూ కేంద్రానికి ఉత్తరం రాశారు. తర్వాత రమణ గారు సీజే అయ్యారు. రమణగారు సీజే అయినందుకు తె లుగువారంతా చాలా సంతోషించారు. ఒక తెలుగువాడికి అత్యున్నత పదవి వచ్చినందుకు గర్వపడ్డారు. ఒకప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన ప్రముఖులంతా, ‘మన రమణ’ సీజే అయ్యారని ఒకింత గర్వంగా ఫీలయ్యారు. ఇక కృష్ణా జిల్లా వారి ఆనందానికి అవధులే లేవు.
సహజంగా తెలుగుదేశ ప్రస్థానమే ఆయన ఉన్నతికి కారణం కాబట్టి.. తెలుగు సైనికులు, మీడియా, విశ్లేషకులు, చివరాఖరకు వైసీపీ వర్గాలు కూడా.. ‘‘రమణ గారు సీజే అయిన తర్వాత ఇక జగన్‌కు సినిమా మొదలవుతుంది. పెండింగ్‌లో సుఖనిద్రపోతున్న ఆయన అక్రమార్కులకేసు, వివేకానందరెడ్డి హత్య కేసులను రమణగారు దుమ్ము దులిపి, జగన్‌ను మళ్లీ జైలుకు పంపిస్తార’’ని ఆశించారు. ఊహించారు. వారి కోణంలో అది అత్యాశేమీ కాదు.
* * *
కానీ విచిత్రంగా అలాంటి అద్భుతాలేమీ జరగలేదు. పైగా జగన్‌పై గుండెధైర్యంతో, ఆయన అధికారానికి భయపడకుండా న్యాయ సమరం చేసిన కమ్మ సామాజికవర్గానికే చెందిన డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కేసు, బెంచి మీదకు వెళ్లేందుకు కూడా ఫైలు రమణ గారి అనుమతి కోసం ఎదురుచూసిందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. నిజానికి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేస్తే, జగన్ ప్రభుత్వం దానిని ప్రతిష్ఠగా తీసుకుని సుప్రీంకోర్టులో అపీలుకు వెళ్లింది. అప్పుడు సీజే రమణ గారే.
కాబట్టి ఏబీకి న్యాయం జరుగుతుందని, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తుందని టీడీపీ వర్గాలు, కమ్మ సామాజికవర్గం అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. నిజానికి రమణ గారు సీజేగా ఉన్నందున.. ఆ కేసు ఏబీకి అనుకూలంగానే తీర్పు వస్తుందని, వైసీపీతో సహా అందరూ ఊహించారు. అయితే అందుకు జరిగింది భిన్నం.
* * *
ఇక నాలుగేళ్లు జగన్ సర్కారుపై ఢిల్లీ కేంద్రంగా ఒంటరి యుద్ధం చేసి రచ్చబండతో వైసీపీలో గత్తర లేపిన నాటి వైసీపీ రెబల్‌స్టార్ రఘురామకృష్ణంరాజు కూడా, జగన్‌కు వ్యతిరేకంగా ఇరే రమణ గారి బెంచ్ ముందు పిటిషన్ వేశారు. నిజానికి జగన్ జమానాలో ఆయనపై నోరెత్తేందుకే విపక్షాలకు వణుకు పుట్టిన పరిస్థితి. అయినా మొండిధైర్యంతో రఘురామరాజు వైసీపీ సర్కారుపై ప్రారంభించిన యుద్ధమే తర్వాత విపక్షంలో జోష్ నింపింది. రచ్చబండతో జగన్ ఉతికిఆరేసిన ఆయన వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక నాయకుడికి, ఆ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పట్టడమే విశేషం. సరే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పోరాటానికి మంత్రి పదవితో గుర్తింపు లభిస్తుందనుకున్నారు. జరగలేదు. అది వేరే విషయం. జగన్‌పై ఉన్న కేసులను త్వరగా విచారించాలని రఘురామరాజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ వేశారు.
దానితో.. ఇంకేముంది? జగన్‌పై అలుపెరుగని యుద్ధం చేస్తున్న రాజు గారు పిటిషన్ వేశారు కాబట్టి, రమణగారు ఆ కేసులో చొరవ చూపి, జగన్ కేసును నిర్ణీత గడువు విధించి, అప్పటిలోగా కేసును తేల్చాలని సీబీఐ కోర్టును ఆదేశిస్తారేమోనని అంతా అనుకున్నారు. నిజానికి ఆయనకు అలాంటి అధికారం కూడా ఉండటమే వారి అంచనాలకు కారణం కావచ్చు. కానీ విచిత్రంగా ఆయన వేసిన రెండు ఎస్ఎల్పీని మూసి వేస్తూ, జగన్ కేసును త్వరగా తేల్చాలని కింది కోర్టుకు సూచించారు. పోనీ ఆమేరకు ఆయన ఆదేశాలు, ఆ కింది కోర్టులో అమలయిందా అంటే అదీ లేదు.
* * *
రమణ గారు సీజేఐకి అనర్హుడని, రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు జడ్జిలపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ జగన్.. నాటి సీజేఐ- కేంద్రానికి లేఖ రాశారు కదా? అయినా దానిని పట్టించుకోకుండా, తదుపరి సీజేఐగా రమణ గారినే ఎంపిక చేసిన తర్వాత.. జగన్‌పై సీజేఐగా ఉన్న రమణ గారు సుమోటోగా కేసు ఎందుకు పెట్టలేదు? పోనీ సీజేఐగా కాకున్నా ఒక బాధితుడిగా, జగన్‌పై పరువునష్టం దావా ఎందుకు వేయలేదు? ఒక సుప్రీంకోర్టు జడ్జిపై చిన్నపాటి ఆరోపణలు చేస్తేనే.. సుప్రీంకోర్టు న్యాయవాదులను సైతం బహిష్కరిస్తున్న క్రమంలో, ఒక సీఎం తనపై వేసిన అభాండాలు తెలిసి కూడా, రమణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు అప్పుడే తెరపైకి వచ్చాయి.
* * *
రమణ గారు సీజేఐ హోదాలో తిరుపతి వచ్చినప్పుడు సీఎం జగన్.. ఆయనకు స్వాగతం పలకలేదన్న వార్త, అప్పుడు చర్చనీయాంశం కావడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలే తమ్ముళ్లను ఆశ్చర్యపరిచాయి. ఉప్పు-నిప్పుగా ఉన్న జగన్-జస్టిస్ రమణ గారు, విజయవాడ నోవాటెల్‌లో.. ఏకాంతంగా భేటీ అయ్యారన్న వార్త ఆలస్యంగా లీకయిన తర్వాత అగ్గిరాముళ్లవడం తమ్ముళ్ల వంతయింది.
రమణ గారు విడిది చేసిన విజయవాడ నోవాటెల్‌కు, సీఎం జగన్ సతీసమేతంగా కాన్వాయ్ లేకుండా వచ్చి.. కారును సెల్లార్లో పార్కు చేసుకుని మరీ రమణ గారితో, గంట ఏడునిమిషాలు భేటీ అయ్యారన్న వార్త తమ్ళుళ్ల ఆగ్రహానికి దారితీసింది. తనపై వేధింపులకు పాల్పడి, చివరాఖరకు తన సీజేఐ సీటుకే ఎసరు పెట్టిన జగన్‌తో రమణ గారు, అదే సీజేఐ హోదాలో అంత ఆత్మీయంగా ఎలా మాట్లాడారు? అసలు జగన్‌తో మాట్లాడేందుకు ఆయనకు మనసెలా వచ్చిందంటూ, సోషల్‌మీడియా సైనికులు ఇంతెత్తున లేచి, తమ అసంతృప్తిని అప్పుడే వెళ్లగక్కారు.
***
సరే.. నాటి సీఎం జగన్ తన ప్లాన్ బెడిసికొట్టినందున, గత్యంతరం లేక రమణ గారిని సతీమేతంగా రహస్యంగానో, బహిరంగంగానో కలిశారనుకుందాం. అందుకు అప్పట్లో ఒక టీటీడీ జేఈఓ, ఆయన మిత్రుడైన మరో మాజీ జేఈఓ తడిక రాయబారం చేసి.. ఇద్దరినీ ఒక చోట చేర్చారన్న ప్రచారం నిజమే అనుకుందాం. కానీ ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రమణ గారికి నిర్వహించిన పౌరసన్మానం, ఆ సందర్భంగా విజయవాడలో ఆకాశం కూడా ఈర్ష్యపడేంత ఎత్తున, జగనన్న సర్కారు ఏర్పాటుచేయించిన ఫ్లెక్సీల ముచ్చట్లే హైలెట్.
* * *
హేమిటీ.. రమణ గారికి ఆ పదవి ఇవ్వవద్దంటూ ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగి, ఆయనపై ఫిర్యాదు చేసిన జగనన్నే రమణ గారికి హారతి పడుతున్నారా? సరే ఆయనకంటే సవాలక్ష వర్రీస్ ఉన్నాయి కాబట్టి, శరణు వేడటంలో తప్పు లేదు. మరి జగన్‌తో అన్నేసి అవమానాలు ఎదుర్కొన్న రమణ గారు, జగన్ సర్కారు ఆతిథ్యం స్వీకరించినట్లు? అప్పుడు ఆయనకు ఆ అవమానాలు గుర్తుకు రాలేదా? అవన్నీ కరుణామయుడు మాదిరిగా క్షమించేశారా? అసలు నోవాటెల్ నక్షత్ర హోటల్లో వారిద్దరి మధ్య ఏం జరిగింది? వారి భేటీ తర్వాత జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తనయుడిని, ఏఏజీ పోస్టు నుంచి జగన్ అర్ధాంతరంగా ఎందుకు తొలగించారు? లేక తనంతట తానుగా ఎందుకు వైదొలగాల్సివచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు అప్పట్లో సోషల్‌మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. రమణ గారు అసలు జగన్ సర్కారు ఆతిధ్యం స్వీకరించకపోతే.. ఇన్ని ప్రశ్నలు, ఇంత పంచాయతీ జరిగేదే కాదన్నది అప్పటి విశ్లేషకుల ఉవాచ.
* * *
సరే.. ప్రభుత్వం వేరు- వ్యక్తులు వేరని కాసేపు సర్దుకుపోదాం. కానీ ఆనాటి పౌరసన్మాన వేదికపై రమణ గారు, ఇప్పుడు తనకు జగన్ జమానాలో వేధింపులు ఎదురయ్యాయని విట్ వేదికపై చెప్పినట్లే.. అదేరోజు కూడా చెప్పి ఉంటే ఆయన ఔన్నత్యం హిమాయమంత ఎత్తు ఎదిగేది కదా? అదే వేదికపై.. తన కుటుంబసభ్యులపై జగన్ సర్కారు అక్రమ కేసులు పెట్టి వేధించిందని నిండు సభలో చెప్పి ఉంటే, నిఖిల ప్రపంచం ఆయన ధైర్యానికి-నిర్మొహమాటానికి నీరాజనాలర్పించేది.
‘విట్’ వేదికగా.. ఎన్నాళ్లనుంచో తన గుండెలో గూడుకట్టుకున్న ఆవేదనను వెళ్లబోసుకున్న రమణగారు.. అదే ప్రభుత్వ పౌరసన్మాన వేదికపై.. అదే నోటితో.. ‘‘నా కుటుంబం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఆ భూముల కొనుగోళ్లన్నీ చట్టబద్ధమే. నేను ఏ జడ్జిలపై ఒత్తిడి తీసుకురాలేదు. నేను పులుకడిగిన ముత్యాన్ని. నాపై వేసిన నిందలు నిరాధారం’’ అని ఎందుకు చెప్పలేకపోయారన్నది బుద్ధి జీవుల సందేహం. నిజానికి అది ఆయనకు అందివచ్చిన గొప్ప అవకాశం. అంతకంటే.. జగన్ ఇచ్చిన చక్కని వేదిక.
* * *
ఓకే. ఆయన నాటి జగన్ ప్రభుత్వ పౌరసన్మానానికి సీజే హోదాలో వచ్చారు కాబట్టి, వ్యక్తిగత వ్యవహారాలు ప్రస్తావించకూడదనే అనుకుందాం. కానీ ‘ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న నాలాంటి వాడికే ఇన్ని వేధింపులు జరిగితే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? అందుకే చట్టం ఎవరికీ చుట్టం కాకూడదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. విలువలే ముఖ్యం. దాన్ని కాపాడే బాధ్యత పాలకులదే’ అని సున్నితంగా- హుందాగా వాతలు పెట్టే అవకాశం కూడా, రమణ గారు ఎందుకు చేజార్చుకున్నారన్న ఆశ్చర్యం అప్పట్లో వ్యక్తమయింది.
* * *
మరి ఇన్నేళ్ల తర్వాత.. రమణ గారికి ఆ జ్ఞాపకాలు ఎందుకు దొర్లాయో.. ‘విట్’ను అందుకు వేదికగా ఎందుకు ఎంచుకున్నారో.. ఆ ఏడుకొండలవాడికే ఎరుక.
* * *
ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును.. జగన్ సర్కారు అక్రమ కేసులతో 53 రోజులు జైల్లో పెట్టిన సమయంలో, ఆయనకు బెయిల్ కోసం రమణ గారు తన పలుకుబడి ఏమాత్రం ఉపయోగించలేదన్న ఆగ్రహం, అప్పట్లో సోషల్‌మీడియా సైనికుల్లో వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పైగా ఆ సమయంలో ఆయన బాబు సన్నిహితుల ఫోన్లకూ స్పందించలేదన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో విస్తృతంగా జరిగిన సంగతీ తెలిసిందే. అప్పటినుంచీ ఆయనపై టీడీపీ వర్గాలకు పీకల్లోతు కోపం ఉందట. కానీ తర్వాత.. అమరావతిలో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రమణగారు హాజరయ్యారు మరి! ఏ బంధం ఎటుపోతుందో.. నిజం నారాయణుడికెరుక?
https://x.com/MNageswarRaoIPS/status/1984956409310830606