Suryaa.co.in

Entertainment

నట పారిజాతం కైకాల సత్యనారాయణ

నటుడు సత్యనారాయణ లేని స్వర్ణయుగం ఊహించలేం, వర్ణయుగం కూడా ఊహించలేం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 750 పైచిలుకు తెలుగు సినిమాలలో నటించగలిగారంటే ఆయన ఏక్టింగ్ పొటంషియాలిటీ మనం అర్ధం చేసుకోవచ్చు. 1959లో హీరోగా ప్రవేశించిన సత్యనారాయణ కు కాలం కలిసిరాలేదు. ఐదేళ్ల తర్వాత విలన్ పాత్రలపై శ్రద్ధ చూపడం ఈయనకి బాగా కలిసొచ్చింది. మరో ఆరేళ్ల తరువాత ఓ పక్క విలన్ పాత్రలు పోషిస్తూ మరోవైపు క్యారెక్టర్ పాత్రలు ధరించటం మొదలుపెట్టారు.

శారద చిత్రంలో అన్న పాత్రలో సత్యనారాయణ కరుణరస పాత్ర పోషణ చూసి ఆశ్చర్యపోని ప్రేక్షకులు లేరు. రైతు కుటుంబంలో తన వ్యసనాల వలన చెల్లాచెదురైన తన కుటుంబం గురించి పశ్చాత్తాపం పడిన వైనం మనల్ని కదిలిస్తుంది. ఇక నిప్పులాంటి మనిషి, నా పేరే భగవాన్ చిత్రాల్లో నటనంటే ప్రాణం పెట్టే బాలీవుడ్ నటుడు ప్రాణ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నటించి అందరిచేత జేజేలు అందుకున్న నటసారభౌముడు సత్యనారాయణ.

శ్రీరంగ నీతులు చిత్రంలో తన కొడుకు ప్రేమ పెళ్లి జరగకూడదనే ఆత్రంతో కురిపించిన హాస్యం ఇంతా అంతా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. సత్యనారాయణ నటించని తరహా చిత్రం లేదు.. పోషించని పాత్ర లేదు.. ఏ పాత్రలోనూ అసంతృప్తిని కలిగించలేదు.. నటించని హీరో లేడు. మూడు తరాల హీరోలతో నటించి మెప్పించిన నటుడు ఈయన.

జానపదాలలో రాజనాల తరువాత, సాంఘికాలలో ఎస్ వి రంగారావు తరువాతి స్థానం నిస్సందేహంగా సత్యనారాయణదే. హీరోలందరి కంటే కృష్ణ తో అత్యధికంగా 150 పైచిలుకు చిత్రాల్లో, ఎన్టీఆర్ తో సుమారు 101 చిత్రాల్లో, ఏయన్నార్ తో 60-70 చిత్రాల్లో.. సహనటుడిగా తండ్రిగా అన్నగా విలన్ గా నటించి ఆవిధంగా రికార్డు సృష్టించిన నటుడు సత్యనారాయణ.

మంచి పర్సనాలిటీ వాయిస్ నటనలో ఈజ్ ఉండటంతో సులభంగా రాణించారు. తెలుగు సినిమా అగ్ర హీరోలు కృష్ణంరాజు, కృష్ణ లతో పాటు సత్యనారాయణ కూడా యీ ఉదయం కొద్దిరోజుల గ్యాప్ తరువాత మరణించడం బహు బాధాకరం. ఈయన మరణంతో తెలుగు సినీ దిగ్గజ నటులందరూ మనకు శాశ్వతంగా దూరమైనట్టే.

సత్యనారాయణ గారు గత కొద్ది నెలలుగా పలు అనారోగ్య సమస్యలతో పోరాడుతూ యీ వేకువజామున (23-12-2022) తుదిశ్వాస విడిచారు. నట సార్వభౌముడు గా నీరాజనాలు అందుకున్న నట పారిజాతం సత్యనారాయణ గారికి భారంగా ఆశ్రు నయనాలతో వీడ్కోలు చెబుదాం..

– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం

LEAVE A RESPONSE