దేవుడికి కైంకర్యం

మనం దైవాన్ని ఏమి కోరుకోవాలంటే జీవితాంతం భగవంతునికి కైంకర్యం చేసే వరం ప్రసాదించమని వేడుకోవాలి.

కైంకర్యం అంటే ….
మనకి అమూల్యమైన యీ మానవ జన్మనిచ్చి, మనకి కలిగే అనేక కష్టనష్టాల నుండి కాపాడుతూ వచ్చిన ఆ భగవంతునికి మనకి తగిన వీలైన సేవను ఏ విధమైన ఫలితం ఆశించకుండా చేయడమే కైంకర్య భక్తి.
క్రమం తప్పక ఆలయాలను శుభ్రపరచడం, ముగ్గులు పెట్టడం, దేవునికి పువ్వుల మాలలు సమర్పించడం వంటి చిన్న చిన్న సేవలను భక్తిశ్రధ్ధలతో చేయాలి. ధనికులైనవారు దేవుని ఉత్సవాలకి ధనాన్ని సమర్పించి ఆ ఉత్సవా‌లు విజయవంతంగా జరగడానికి మనస్ఫూర్తిగా సహకరించడమే కైంకర్యం .
శ్రీమద్రామాయణం లో ఒక రసవత్తర ఘట్టం వున్నది. అదే ఉడుతలు శ్రీ రామునికి చేసిన కైంకర్యం. శ్రీ రాముడు లంకకి చేరడానికి సేతువును నిర్మిస్తున్న సమయంలో వానరులు పెద్ద పెద్ద రాతిబండలను, పెద్దపెద్ద రాళ్ళను తెచ్చి సముద్రంలో పడవేస్తూ సేతువు నిర్మించడానికి సహాయపడుతున్నారు.
అక్కడున్న ఉడుతలు వానరులు చేస్తున్న కృషిని చూస్తూ వున్నాయి. అహా..! తాము కూడా ఏవిధంగానైనా రాములవారికి కైంకర్యం చేయాలని సంకల్పించి…  తాము గుంపులు గుంపులుగా సముద్రంలో ములిగి వచ్చి తీరాన వున్న ఇసుకలో దొర్లుతూ ఆ బండరాళ్ళమధ్య తమ ఒంటిని అంటుకున్న ఇసుకని విదిలించడం ప్రారంభించాయి. వానరులకు ఉడతలు చేస్తున్న పనేమిటో ఏమీ అర్ధం కాలేదు. ఈ ఉడుతలు ఏమి చేస్తున్నవి అన్న కుతూహలంతో ఉడుతలను చూసి ” మీరు ఏమిటి చేస్తున్నారు ? ” అని అడిగాయి.

దానికి ఉడుతలు ” శ్రీరామునికి మేము సేతువు కట్టడంలో మాకు చేతనైన చిన్న సహాయం కైంకర్యం గా చేస్తున్నాము.” అని చెప్పాయి. “ఏమిటి ..కైంకర్యం చేస్తున్నారా.. అని వానరములు నవ్వినవి. ” అవునవును.. మేము ఆ సముద్రంలో స్నానం చేసి ఈ ఇసుకలో దొర్లనందున ఆ ఇసుక మావెన్నుల మీద అంటుకుంటున్నది. ఆ ఇసుకని యీ రాళ్ళ మధ్య విదిలించినందున ఆ ఇసుక రాళ్ళమధ్య అంటిపెట్టుకుని రాళ్ళు గట్టిగా నిలబడతాయి. శ్రీ రాముని మెత్తని పాదాలు కర్కశమైన రాళ్ళమీద నడిచేప్పుడు పాదాలకి గాయమై రక్తం రావచ్చు…. అలా జరుగకుండా మేము విదిలించిన ఇసుక సాయపడుతుంది. అని ఉడుతలు బదులు చెప్పాయి. ఉడుతల మాటలను విన్న శ్రీ రాముడు ఆ ఉడుతల వెన్నులను ప్రేమగా నిమిరాడు. ఆ ఉడతల జన్మ సార్ధక్యం పొందింది. ఆనాడు శ్రీ రామునికి కైంకర్యం చేసిన ఉడుతల వెన్ను పై రాముని చేయి పడినందున ఏర్పడిన మూడు గీతలు ఈనాటికి ఉడుతల వెన్ను పై మనకు కనిపిస్తాయి. అంతకు ముందు ఉడతజాతి వీపులపై గీతలు ఉండేవికావు.

ఈ విధంగానే ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా తిరుపతిలో కైంకర్యం చేసిన నిస్స్వార్ధ భక్తులు అనేకమంది మనకు చరిత్రలో కనిపిస్తారు. తమ గురువైన రామానుజాచార్యుల వారు చెప్పారని ఆనందాళ్వార్ అనే భక్తుడు నిండుగర్భిణి అయిన తన భార్యతో కలసి తిరుమల కొండలలో వన్యమృగాలు చుట్టు వున్న ఆ ప్రాంతంలో ఒక అందమైన ఉద్యానవనం ఏర్పాటు చేసి శ్రీనివాసునికి నిత్యం పుష్పమాలలు కైంకర్యం చేశేవాడు. ఆవిధంగానే, వృధ్ధాప్యంలో వేంకటేశ్వురుని అభిషేకానికి కావలసిన పవిత్ర తీర్ధాన్ని కష్టపడి ఆకాశగంగ నుండి తీసుకుని వచ్చి ఏడు కొండలవాడికి సమర్పించి తరించిన పెద్ద తిరుమలై నంబి అందరిచేత “పితామహుడు” అని గౌరవించబడ్డారు.

పూవిరుందమల్లిలో నంబి అనే పరమ వైష్ణవభక్తుడు తన తండ్రి తనకు యిచ్చిన భూమిలో ఒక అందమైన నందనవనం ఏర్పరిచి, ఆ నందన వనంలోని రకరకాల పుష్పాలతో కాంచీపుర వరదరాజస్వామి కి నిత్యం పుష్ప కైంకర్యం చేసి, తాను పక్కనుండి వరదరాజస్వామి కి వీవనలు వీచి కైంకర్యం చేసేవారు. మనం దైవాన్ని ఏమి కోరుకోవాలంటే జీవితాంతం భగవంతునికి కైంకర్యం చేసే వరం ప్రసాదించమని వేడుకోవాలి.

శేష శ్రీ గారి సౌజన్యంతో
– భవాని రాంబాబు బంగారు

Leave a Reply