– ఖేలో ఇండియా ప్రాజెక్టుల పూర్తి చేయాలి
– కేంద్ర మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈ రోజు కేంద్ర కార్మిక, ఉపాధి మరియు యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి డా. మాన్సుఖ్ మాండవియా ని కలిసి ప్రజలకు సంబంధించిన రెండు ముఖ్య అంశాలపై విజ్ఞప్తి చేశారు.
కాకినాడ ఈఎస్ఐసి ఆసుపత్రిలో సిబ్బంది కొరత సమస్యను ప్రస్తావించారు. 500 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిలో మొత్తం 205 పోస్టులు మంజూరై ఉన్నప్పటికీ, ప్రస్తుతం 88 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 43% సిబ్బంది కొరత ఉంది.
ఇందులో స్పెషలిస్టులు, సీనియర్ రెసిడెంట్స్, నర్సింగ్ ఆఫీసర్లు, టెక్నీషియన్లు వంటి విభాగాలు ఉన్నాయి. తూర్పు గోదావరి మరియు పరిసర జిల్లాలకు చెందిన 2 లక్షలకు పైగా కార్మికులు, వారి కుటుంబాలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతుండగా, సిబ్బంది కొరత వలన రోగులకు సమయానికి చికిత్స అందడంలో ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ఖాళీలను తక్షణం భర్తీ చేసి ఆసుపత్రి పూర్తి స్థాయి సేవలు అందించేలా చూడాలని ఆయన మంత్రి ని కోరారు.
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి అవసరాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో జాతీయ క్రీడా ప్రావీణ్య కేంద్రాలు (NCE) ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఖేలో ఇండియా ప్రాజెక్టుల పూర్తి, ప్రతి జిల్లాలో అదనపు ఖేలో ఇండియా సెంటర్స్, రాయలసీమలో కొత్త SAI ట్రైనింగ్ సెంటర్ స్థాపన వంటి ప్రతిపాదనలను సమర్పించారు.
“కాకినాడ ఈఎస్ఐసి ఆసుపత్రి కార్మికుల కుటుంబాలకు జీవనాధారం. ఖాళీలు భర్తీ చేస్తే ఆరోగ్య సేవలు మెరుగుపడతాయి. అదే విధంగా ఖేలో ఇండియా ప్రాజెక్టులు పూర్తయి, కొత్త క్రీడా మౌలిక వసతులు ఏర్పడితే యువత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈ రెండు రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాను” అని సతీష్ బాబు తెలిపారు.