నేను ఎంతో ఇష్టపడే, దేశం ప్రేమించే సమున్నత వ్యక్తిత్వం, ఎంతో మందికి స్ఫూర్తి….మన కలాం గారు. కలియుగ మాయామర్మం, కల్లా కపటం తెలియని అమాయక మానవుడు.మంచి, మానవత్వం గల జ్ఞాని.నిజాయితీ, నిబద్దత గల విజ్ఞాని.
కులం, మతం, కుటుంబానికి , బంధువులకి ఏమి చెయ్యని, నెపోటిజమ్ లేకుండా జీవితమంతా నిష్ఠగా గడిపిన బ్రహ్మచారి. పిల్లలలో పిల్లలుగా కలసిపోయిన, పెద్దలలో పెద్ద, అపార విజ్ఞాన పారంగతుడు.ఆఖరిశ్వాస వరకూ ఈ లోక అభ్యున్నతి కోసం భావితరాల కోసం జీవితాన్ని వెచ్చించి ఆ సేవలోనే ఆఖరికి ఒరిగి జీవితానికి సాఫల్యత చేకూర్చకున్నవాడు.
మిస్సైల్ మాన్ గా రోదసీ రంగంలో దేశాన్ని ఉన్నంతంగా నిలబెట్టినవాళ్ళల్లో, రెండు అణు ప్రయోగాలలో సహకరించిన శాస్తవేత్త, రోదసీరంగంలో ప్రపంచానికే మేలు చేసినవారిలో ఒకరు. అయితే హృద్రోగులకు, వికలాంగులకు ఆ పరిశోధనాఫలాలు అందించిన మానవీయుడు.
జాతిగా మన ద్రావిడులు, భాష పరంగా మన సోదర తమిళుడు, అయితేనేమి విశ్వమానవుడు. ఆయన తండ్రి స్థానిక మసీదులో ఇమాం.. కలాం గారు రోజూ నమాజ్, రంజాన్లో ఉపవాసం ఆచరించేవారు. అన్నీ తెలుసు కలాం గారికి. తన మతంలోని సారం మానవాళి మంచికే అని మంచిని తీసుకుని ఆచరించి, సంస్కృత పఠనం చేసారు, భగవద్గీత సారంలో మంచి స్వీకారించారు, ఇతరమతాల్లోని గ్రంథాలు కూడా పఠించి పరమత సహనంతో మంచిని మనసవాచకర్మణః అంటూ పాటించిన యోగి మన ఆవుల పకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం. శాఖాహారి.
ఆయన జీవిత అనుసరణలలో నాలాంటివారికి, మరికొందరికి 1% నచ్చకపోవచ్చు కానీ ఆ లోపం కూడా లేకపోతే ఆయన almighty గా మారిపోయి మనకు చిన్నప్పుడే అందనంత ఎత్తుకు వెళ్లిపోయేవారేమో. అయితే మనిషిలో 99% నచ్చడం అద్భుతం. ఇక మతాల గురించి ఆయన ఒకసారి.. “For great men religion is a way of making friends, small people make religion a fighting tool” అన్నారు. దురదృష్టవశాత్తు ఏ మత పెద్దలూ వారిని ఓన్ చేసుకోలేదు, కానీ ఆ వందమంది మతఛాందసులు మినహా కుల, మత, వర్గ, వర్ణ, జాతి ఎవరైనా ఆ అందరూ.. 130 కోట్ల మంది ఆయన్ని స్వంతం చేసుకున్నారు. ఇంకేం కావాలి జీవిత సార్ధకతకు?
ఎన్నో పుస్తకాలు మనకి వ్రాసి అందించిన నిరంతర జ్ఞానపిపాసి, ఋషి. ఒకనాడు బాగా సంపన్నులైనా, తాను పుట్టేనాటికి సంపద కోల్పోయి పేదలుగా మారిన కుటుంబం వారిది. సముద్రతీర పంబన్ దీవిలో పడవలు నడిపేవారి ఆ కుటుంబంలో అయిదవవాడిగా ఆ మన రామేశ్వరంలో కళ్ళు తెరిచి, పేపర్లు వేసే బాయ్ గా తన సంపాదనతో జీవితం మొదలుపెట్టి, దేశం గర్వించే శాస్త్రవేత్తగా, ఆఖరికి రాష్ట్రపతిగా చేసి ఎంతో ఎత్తుకి ఎదిగి ఆ మేఘాలయ కొండల్లోని షిల్లాంగ్ లో కనుమూసేవరకూ ఆయన జీవితం మానవీయము, కమనీయం. వారి జయంతి నేడు. మరోసారి గుర్తుచేసుకుందాము.
నిరాడంబరంగా జీవించారు, కొన్ని జతల బట్టలు, cd ప్లేయర్, (టివి కొనుక్కోలేదు, సాధారణంగా చూడరు), సంగీతం అంటే ఇష్టం, వీణ వాయిస్తారు గాన అది, ఆయన స్వంత ఆస్తులు చెప్పుకోటానికి ఏమీ లేవు,
కొంత బాంక్ బాలెన్స్ మొ. నవి అవీ ఆయన చనిపోయేనాటికి ఆస్తులు, తన అన్నకు సంక్రమించినవి.
ఇండియాకు ఉన్న భిన్నత్వంలో ఏకత్వం, దేశానికి ఉన్న జీవిత చిహ్నములు చెప్పమంటే ఆయన జీవితం కూడా ఒకటి అని నాకు అనిపిస్తుంది.
