Suryaa.co.in

Features

సామాజిక స్మగ్లర్లు

పుష్ప సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . “స్మగ్లర్ హీరో ఏంటి ?” ” వెయ్యి రూపాయిలు ఇచ్చి అమ్మాయిని ముద్దు పెట్టమని అడగడం ఏంటి ? యివతకు ఏమి సందేశం ఇస్తున్నాము ? ఎటు పోతోంది యువత ?” అని కొంతమంది మేధావులు అడుగుతున్నారు .ఈ విమర్శల్లో నిజం ఉంది. సమస్య లోతుల్లోకి పోదామా ? లేదా గొంగట్లో తింటూ వెంటుకల్ని, అదీ ఒకటి రెండు వెంటుకల గురించి మాత్రం మాట్లాడుకొందామా ?

నేటి తల్లితండ్రుల గతం :
ఇరవై ఏళ్ళ ముందుకు పోదాము. కాలేజీ లలో, యూనివర్సిటీ లలో చదువులు . మంచి మార్కులు రావాలని, జీవితం లో ఉన్నత స్థానాలలో స్థిరపడాలని బుద్ధిగా చదువుకొనే వారు కొందరు . వెనుక బెంచ్ పోకిరీ లు అప్పుడూ ఉండేవారు . కానీ చదువులు ముగిసి నిజ జీవితం అనే సినిమా కు తెర లేచేటప్పటికి వీరికి కూడా తత్త్వం బోధ పడేది. జీవితంలో లో స్థిరపడాలని వీరూ ప్రయత్నాలు మొదలుపెట్టేవారు .

ఇంజనీరింగ్ , మెడికల్ లాంటి ప్రొఫషనల్ కోర్స్ ల లో స్థిరపడే వారు కొంత మంది అయితే సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, ఎస్ ఐ అఫ్ పోలీస్ , ప్రభుత్వ టీచర్ … ఇలా రకరకాల ఉద్యోగాల కోసం పోటీ పడేవారు ఎక్కువ శాతం . కాలేజీ లేదా యూనివర్సిటీ చదువు ముగిసాక తరువాత కోచింగ్ తీసుకోవడం .. రెండు మూడు ఏళ్ళు కాంపిటీటివ్ పరీక్షల కోసం పోటీ .. సివిల్స్ స్థాయిలో చదివితే కనీసం ఎస్ ఐ జాబ్ లేదా dsc ద్వారా ప్రభుత్వ టీచర్ జాబ్ దక్కేది .. అక్కడితో ఆపకుండా జాబ్ చేసుకొంటూ గ్రూప్స్ కోసం పోటీ .. వారి వారి ప్రతిభ, కాస్త లక్ ఆధారంగా .. జీవితం లో మంచి స్థానాల్లో స్థిరపడడం .. ఆ అవకాశం దక్కక పోయినా, పోటీ పరీక్షల ప్రిపరేషన్ నేర్పిన క్రమశిక్షణ, కష్టపడే తత్వం లాంటి లైఫ్ స్కిల్స్, జీవితం లో ఏదో ఒక రంగం లో స్థిరపడడానికి అవకాశం ఇచ్చేది .ఇదీ నేటి తరం తండ్రుల చరిత్ర . వారిది అశోక నగర్ , నారాయణగూడా బ్యాచ్ .. వారు జీవితం లోస్థిరపడింది ఈ దారిలోనే .

అటుపైన యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమీర్పేట్ బ్యాచ్ వచ్చింది . సోఫ్త్వేర్ ఉద్యోగాలు .. ఆకర్షణీయ జీతాలు .. అధునాతన లైఫ్ స్టైల్ .. యువత ఎక్కువ మంది అశోక నగర్, నారాయణగూడ నుంచి, అమీర్పేట్ వైపు అంటే కంపెటేటివ్ పరీక్షల నుంచి సాఫ్ట్ వేర్ జాబ్ ల వైపు షిఫ్ట్ అయ్యారు . అమీర్పేట్ లో వేలాది మంది కోచింగ్ తీసుకొనేవారు . ఉద్యోగాల కోసం పోటీపడే వారు . గతం “అంతా ఘనం .. అంతా మంచే .. చెడు అసలు లేదు” అని చెప్పడం లేదు ..

కానీ ప్రవాహం ఎటు వైపు ? “కష్టపడాలి .. జీవితం లో స్థిరపడాలి” .. అంటూ పోటీ .. ఒక పాజిటివ్ మైండ్ సెట్ .. పాజిటివ్ గోల్ .. జీవితానికి గమ్యం గా ఒక వెలుగు రేఖ కనపడేది .. ఆ గోల్ వైపు యువత సాగేది . కొంతమంది దారితప్పినా, దెబ్బ తిన్నా , మంచి దారిలో వెళ్లి గమ్యం చేరిన వారి ని చూసి, స్ఫూర్తి పొంది తిరిగి మంచి మార్గం లో సరైన గమ్యం వైపు పయనం సాగించేవారు .

మరి ఇప్పుడు ?
ఏదీ గమ్యం ? ఏది దారి ? ప్రవాహం ఎటు వైపు ?కరోనా ప్రపంచ సమస్య . కానీ కరోనా పేరు చెప్పి రెండేళ్లు, గంపగుత్తగా ఎక్కడైనా విద్య సంస్థలు మూసేసారా ? లేదే .. మరి ఇండియా లో మాత్రం ఎందుకు ? స్వార్థం ..

వందేళ్లకు ఒక్క సారి వచ్చే దౌర్భాగ్యాన్ని కూడా వదలకుండా కాష్ చేసుకొనే స్వార్థం .. కాలేజీ లు, స్కూల్స్ మూతపడితేనే ఆన్లైన్ ఎడ్యు అప్స్ బిజినెస్… లాప్ టాప్ లు, టాబ్స్, స్మార్ట్ ఫోన్స్ బిజినెస్ నడిచేది . మెడికల్ మాఫియా కు ఆన్లైన్ బిజినెస్ ల సిండికేట్ ల కు అమ్ముడు పోయిన మీడియా .. రోజూ విష ప్రచారం .. రేండో వేవ్ ముగిసింది . బుద్ది జ్ఞానం వున్నవాడు ఎవడికైనా మరో వేవ్ రావాలంటే కనీసం ఆరు నెలలు పడుతుందని తెలుసు . కానీ జూన్ లో మూడో వేవ్ .. జులై లో .. ఆగష్టు లో .. ఇలా ముహుర్తాలు పెట్టుకొంటూ ఫేక్ ప్రచారం చేసుకొంటూ తల్లితండ్రులను భయపెడుతూ , అసలు ఈ సారికి కరోనా పిల్లల పైనే పగపట్టనున్నదని అరుంధతి , చంద్రముఖి , తులసిదళం … ప్రచారం చేసుకొంటూ విద్యార్థులను క్లాసులకు దూరం చేసారు .చదువు చట్టబండలు అయ్యింది.

ఇంటర్ నెట్ .. అదొక చీకటి ప్రపంచం .. మంచి, బంజారా గుట్టల ఎత్తు.. చెడు హుస్సేన్ సాగర్ అంత లోతు.. కాదు కాదు పసిఫిక్ మహాసముద్రం అంత .సెల్ ఫోన్ అడిక్షన్ .. ఒకప్పుడైతే ఎంత మంది? అని చూడాల్సి వచ్చేది . ఇప్పుడు ఇంకా ఎవరైనా మిగిలారా? అని చూడాలి . అందులో వినోదం పేరుతొ కాలకూట విషం .. కపాలాలు డాం.. అని పగిలి మెదడు చిన్న చిన్న ముక్కలుగా గాల్లోకి ఎగిరే సన్నివేశాలు ఉన్న వీడియో గేమ్స్ .. టీచర్ -స్టూడెంట్ , పినతల్లి – కొడుకు , ఇద్దరు అమ్మాయిలు , ఇద్దరు అబ్బాయిలు , మధ్య సెక్స్ .. ఇంకా రేప్ , చిన్న పిలల్లతో సెక్స్ , గ్రూప్ సెక్స్ ఇదీ సీన్ .. పండెమిక్ కలం లో పోర్న్ సినిమా ల ప్రొడక్షన్ వందరెట్లు పెరిగింది . ఇది కాకుండా రకరకాల వెబ్ సిరీస్ , యు ట్యూబ్ .. హింస , బూతులు , సెక్స్ … ఇవన్నీ కలబోసిన వీడియోలు .. ఇదీ నేటి ప్రపంచం

టీన్ ఏజ్ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పటికి ఈ ట్రాప్ లో చిక్కుకొంటున్నారు . నలుగురితో నారాయణ అంటారు .. మన పక్క వాడు ఏమి చేస్తే మనం అదే చేయడం మానవ నైజం . చదువు ముగిసాక కోచింగ్ తీసుకొని జీవితం లో స్థిరపడే ప్రయత్నం .. నా పక్కవారు చేస్తున్నారు .. నేనూ చెయ్యాలి .. అది నేటి తల్లితండ్రుల గతం . మరి ఈ తరం పిల్లలు ?

“రాత్రంతా వాడు సెల్ ఫోన్ లో ఈ గేమ్ ఆడాడు . నేను ఇది చేస్తా ! ” . గే సెక్స్ గురించి గంజాయి గురించి చర్చలు . చదువులు లేవు .. సెల్ ఫోన్ తీసుకొంటే ఒక పక్క బోర్ కొట్టే జూమ్ క్లాసు .. మరో పక్క కిక్ ఇచ్చే వీడియో లు .. అసలే హార్మోన్ ల కిక్కుపై నుండే వయస్సు . దారి తప్పవుతారు , అంటే తప్పరా ?సరే .. విద్య సంస్థలు తెరిచారు .. ఇప్పటికైనా గాడిలో పడుతారా ?

సెల్ ఫోన్ అడిక్షన్ .. పోర్న్ అడిక్షన్ .. ఆన్లైన్ గేమ్స్ అడిక్షన్ .. ఇంతేనా ? వయస్సు బట్టి ఇంకా ఎన్నెన్నో .. బీర్ తాగితే కానీ నిద్ర పోలేని యువత .. గంజాయి .. హుక్కాలు.. గే , లెస్బియన్ .. రకరకాల పేర్వేషన్ లు …అసలు ఇది ఒక సమస్య అని గుర్తిస్తే కదా ? మనాళ్ళు మహానటులు . సమస్యే లేనట్టు నటిస్తారు . ఇక పరిష్కారం ఎక్కడ ?గొంగట్లో తింటూ పుష్ప అనే వంట్రుక గురించే మాట్లాడితే ఎట్టా పద్మశ్రీ స్వామీ ? .. ఒకే వైపు చూస్తే ఎలా ? రెండో వైపు .. మిగతా కోణాల్లో చూడనంటే ఎలా ?

ఒకప్పుడు సంవత్సరానికి రేండు బ్యాంకింగ్ క్లరికల్ నోటిఫికేషన్ లు .. కనీసం రెండేళ్లకు ఒక సారి గ్రూప్ వన్ , గ్రూప్ టు పరీక్షలు . ఇప్పుడు ? పదేళ్లకు ఒక్క సారి కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ల ఇవ్వడం లేదు . “ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం పనా?” అని ప్రశ్న . పెరుగుతున్న జనాభా కు తగ్గట్టు ఉద్యోగాల భర్తీ ఎందుకు జరపరు ? జాబ్ క్యాలెండరు అనేది “ఓ స్త్రీ రేపు రా… ” అని గోడ పై రాసిన నినాదం అవుతోంది .పోనీ ప్రైవేట్ రంగం లో జాబ్స్ ఉన్నాయా అంటే కరోనా పుణ్యమా అని అదీ లేదు .. ఫుడ్ డెలివరీ బాయ్స్ లాంటి చిన్న చితక ఉద్యోగాలు మాత్రమే .

విదార్థులు .. చదువులు .. ఉపాధి .. ఇవి ఏ రాజకీయ పార్టీ కైనా, నాయకుడికైనా ఎజెండా గా ఉన్నాయా ? రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి ? భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాలి ? దీని కోసం కుట్రలు .. కుతంత్రాలు .. డబ్బు కూడ పెట్టడం .. ఇది నేటి రాజకీయ నాయకుల పరిస్థితి . నోరు తెరిస్తే బూతులు .. బూతు అంటే మహిళలని అవమాన పరచడమే కదా . వీరా యివత కు సరైన దారి చూపేది ? చల్ ఫట్ ..నేటి రాజకీయనాయకులు సామజిక స్మగ్లర్లులు .. ఒక్కోడు వెయ్యి మంగళం శీనులు.

మరి మీడియా ? పత్రికలు ? అదెక్కడుంది ? ఇప్పుడు వున్నది పార్టీ ల కరపత్రాలు మాత్రమే . మీడియా చచ్చి పొయ్యి చాలా కాలం అయ్యింది .ఇదీ నేటి స్థితి . జనాల బలహీనతల తో సొమ్ము చేసుకొనే వారు కోకొల్లలు . ఇలాంటి దుర్భాగ్యపు స్థితి లో ..

ఆదర్శాలు ఎవరు చెప్పాలి ? చెప్పే నైతిక హక్కు ఎంతమందికి ఉంది ? ఎవరికి చెప్పాలి ? చెబితే వినేవారు ఎవరు ? విని ఏమి చెయ్యాలి ?” అందరిదీ ఇదే దారి .” అని సమాధానం వస్తుంది .” చదువుకో .. బాగా లైఫ్ లో సెటిల్ కావొచ్చు” అని చెప్పే అవకాశం ఇప్పుడు ఉందా ? .. ఫుడ్ డెలివరీ బాయ్ .. పోర్న్ ఫిలిం మోడల్ , డ్రగ్ సప్లై ఏజెంట్ ఇలాంటివే కదా నేటి యువతకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు . ఎర్ర చందనం స్మగ్లెర్ జీవితం ఆదర్శం అయ్యింది అంటే తప్పెవడిది ?

చదువు పాయె .. నేర్చుకొనే తత్త్వం పాయె .. కాలేజీలు .. యూనివర్సిటీ క్యాంపస్ లు అటు పై అశోక్ నగర్ అమీర్పేట్ .. ఇప్పుడివన్నీ కాలం చెల్లిన దారులు . మూడు వీడియో గేములు .. ఆరు నీలి చిత్రాలు .. తగ్గేదే లే ! ఇది నేటి వాస్తవ లోకం . నేటి యువతరం

ఇంతటి చీకటి లో ఉన్న యువత కు స్మగ్లర్ హీరో గా అనిపించడా ? నిలదీయాల్సింది సుకుమార్ ను కాదు కాదు . జనాల దౌర్భాగ్యాన్ని సొమ్ము చేసుకోవడం లో అతనిది ఒక చిన్న పాత్ర . నిలదీయాల్సింది రాజకీయ పార్టీ లను .. నాయకులను .. మీడియా ను .. పెద్దరికాన్ని .. నిగ్గు దీసి అడుగు సిగ్గు లేని లోకాన్ని ..నేటి సమాజం లో వేలమంది దుర్గుణకుమార్ లు

దగాపడిన యువత .. నీలి చిత్రాలతో హింసాత్మక వీడియో ల తో నిద్దరోతోంది . నిద్ర లేస్తే .. మత్తు వీడితే ? హింస .. సామజిక అశాంతి .. తిరుగుబాటు.. వ్యవస్థలను కదిలిస్తుంది .. ఆలా నిద్దరోనీ .. జో కొట్టు … నీలి చిత్రాలకు వూ అనాలి .. సామజిక చైతన్యానికి ఉహూ అనాలి . అప్పుడే మన సామజిక స్మగ్లెర్ ల ఆటలు సాగుతాయి .

.ఉమ్మెత్త గింజెలు వేస్తె తులసి మొక్క మొలుస్తుందా ? . కొలంబియా లాంటి దేశాల అడుగుజాడల్లో మన దేశం కూడా నడుస్తోంది . దీని ఫలాలు త్వరలో అందరికీ దక్కుతాయి . రేప్ లు .. కిడ్నప్ లు .. గ్యాంగ్ వార్ లు మాదకద్రవ్యాలు .. ఇవీ కొలంబియా లో నిత్యకృత్యాలు .. మన కొంప కూడ కొలంబియా కాబోతోంది.

వద్దనుకొంటే …
నిలదీయండి .. బూతులు మాట్లాడే రాజకీయ నాయకులను నిలదీయండి .. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు .. రాజకీయ నాయకులందరిదీ ఒకటే పార్టీ .. దోచుకొనే పార్టీ .. తమ అధికారాన్ని కాపాడుకొనే పార్టీ .. మనది అంటే… ప్రజలది కావాలి ఒక పార్టీ .. అంటే పార్టీ పెడుదాము అని కాదు . కనీసం ప్రశ్నిద్దాము .. నిలదీద్దాము ..

1 . స్కూల్స్ లో కాలేజీ ల లో సెల్ ఫోన్ అడిక్షన్ పై ఉద్యమం లా కార్యాచరణ కావాలి .
2 . ఇంటర్ నెట్ పై నియంత్రణ ఉండాలి.సినిమాలు , యూట్యూబ్ వీడియోల పై సెన్సారింగ్ జరగాలి.
3 . జాబ్ క్యాలండర్ ప్రకటించాలి . ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగాలి . ప్రైవేట్ రంగం లో ఉపాధి పొందేందుకు వీలుగా యూనివర్సిటీ ల లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్ల శిక్షణ ను ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు చేపట్టాలి .
4 . పాజిటివ్ గోల్స్ ను పాజిటివ్ ప్రపంచాన్ని యువత ముందు ఉంచాలి . నేటి పెద్దరికం తమ పిల్లల గురించి సరైన రీతిలో ఆలోచించాలి . పేరెంట్స్ కు సరైన అవగాహన కల్పించాలి .

కరోనా కాలం లో రెండేళ్లు ఉచితంగా సేవలందించా ! సివిల్స్ మొదలైన పోటీ పరీక్షలకు శిక్షణ నిచ్చిన వేలాది మంది పిలల్ల జీవితాలను తీర్చి దిద్దిన వ్యక్తిగా నేటి యువత ను సరైన దారిలో పెట్టడానికి నా వంతు పాత్ర కు నేను రెడీ . మరి మీరు ?

ముందుగా .. మీ వంతు పాత్రగా ..జనాలకు సరైన అవగాహన కల్పించండి .

LEAVE A RESPONSE