– పువ్వు పార్టీలో వారసత్వ పరిమళాలు
– దేశభక్త పార్టీలో వారసులు ఎలా వస్తున్నారు?
– కర్నాటక బీజేపీ అధ్యక్షుడిగా యడ్డి కొడుకు నియామకం
– సీనియర్లను కాదని వారసత్వానికి పట్టాభిషేకం
– విద్యాసాగర్‌రావు తనయుడికి బీజేపీ టికెట్
– తుల ఉమకు టికెట్ ఇచ్చి మరీ లాగేసుకున్న వైనం
– వారసత్వ రాజకీయాలపై బీజేపీ వింత వైఖరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుంది.. పువ్వుపార్టీ ప్రవచిత వారసత్వ రాజకీయ విమర్శల వ్యవహారం! కాంగ్రెస్ సహా.. బీఆర్‌ఎస్, టీడీపీ, జన తాదళ్, మజ్లిస్, శివసేన, వైసీపీ, డిఎంకె, అన్నాడిఎంకె, టీఎంసీ వంటి పార్టీలను కుటుంబపార్టీలని పువ్వు పార్టీ తరచూ విమర్శిస్తుంటుంది. వాటిని పరివార్ పార్టీలుగా అభివర్ణిస్తుంటుంది. తాము కుటుంబ రాజకీయాలకు దూరమని గర్వంగా చెబుతుంటుంది. కుటుంబపార్టీలు రాష్ట్రాలను లూటీ చేస్తున్నాయని ఆరోపిస్తుంటుంది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద ప్రాజెక్టులను ఏటీఎంగా వాడుకుంటున్నాయని, వెళ్లిన ప్రతిచోటా ఆరోపణ వర్షం సంధిస్తుంటుంది. అలాంటి పరిశుద్ధ పువ్వుపార్టీ.. ఇప్పుడు తానూ ఆ తాను ముక్కనే అని నిరూపించుకుంది. అదే విచిత్రం!
కాంగ్రెస్ సహా దేశంలోని పార్టీలన్నీ కుటుంబపార్టీలే అని, తానొక్కటే పరిశుద్ధురాలినంటూ ప్రచారం చేసుకునే బీజేపీ.. మళ్లీ వారసుల బురదలో కాలేసింది. కర్నాటక బీజేపీ దళపతిగా, మాజీ సీఎం యడ్యూరప్ప ముద్దుల కుమారుడైన శిఖరిపురమ్మెల్యే విజయేంద్ర యడ్యూరప్పను నియమించింది. సునీల్‌కుమార్, బసవగౌడపాటిల్ వంటి సీనియర్లు అధ్యక్ష పద వి రేసులో ఉన్నప్పటికీ, వారిని కాదని.. బీజేపీ నాయకత్వం యడ్డీ కుమారుడికే కర్నాటక పగ్గాలు అందించింది. ఇప్పటికే యడ్డీ మరొక తనయుడైన రాఘవేంద్ర షిమోగా ఎంపీగా ఉన్నారు.
మాజీ సీఎం ఎస్.బంగారప్పపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన రాఘవేంద్ర కూడా, కర్నాటక బీజేపీలో చక్రం తిప్పుతున్న కొద్దిమందిలో ఒకరు కావడం విశేషం. మరి ఇతర పార్టీలపై కుటుంబముద్ర వేసే కమలనాధులు, కర్నాటకలో చేసింది కూడా అదే కదా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ వారసత్వ రాజకీయాలను కొనసాగించింది. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు డాక్టర్ వికాస్‌రాజ్‌కు వేములవాడ టికెట్ ఇచ్చింది. నిజానికి ఇక్కడ బీఆర్‌ఎస్ నుంచి ఈటలతో పాటు బీజేపీలో చేరిన తుల ఉమ పేరు తొలుత ప్రకటించారు. మళ్లీ చివరి నిమిషంలో బండి సంజయ్ పట్టుపట్టడంతో ఉమను మార్చి, వికాస్ పేరు ప్రకటించి బీజేపీ తన పరివార్‌పార్టీ పేరు సార్థకం చేసుకుంది.
నిజానికి దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది బీజేపీ కుటుంబసభ్యులు, వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. వారంతా ఎమ్మెల్యే-ఎంపి-ఎమ్మెల్సీ-కేంద్రమంత్రులు, పార్టీ పదవుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రుల కొడుకులు ఎంపీ, కేంద్రమంత్రులుగా పనిచేస్తుండటం విశేషం.
రాజస్థాన్-మధ్యప్రదేశ్-హిమాచల్‌ప్రదేశ్-ఉత్తరప్రదేశ్-హర్యానా వంటి రాష్ట్రాల్లో అయితే, వారసత్వ రాజకీయాలకు లెక్కలేదు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అనాది నుంచి పనిచేస్తున్న బీజేపీ సీనియర్ల వారసులు కూడా, వివిధ హోదాలో కొనసాగుతున్నారు. వీరికి ఏ ఎన్నికల్లోనయినా సులభంగానే టికెట్లు లభిస్తుంటాయి. ఈవిధంగా వారసులకు పట్టాభిషేకం చేస్తూ, ఇతర పార్టీల మీద చల్లుతున్న బురద మళ్లీ పువ్వుకే అంటుకోవడం విశేషం.
మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్‌ప్రదేశ్ మాజీ స్పీకర్ రించిన్‌కరు కుమారుడు కిరణ్ రిజుజు.. వాజపేయి మంత్రివర్గంలోని దేవేంద్రప్రధాన్ కుమారుడు ధర్మేంద్రప్రధాన్.. అదే ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన వేదప్రకాష్ కుమారుడు, పియూష్ గోయల్.. టీడీపీ హయాంలో సలహాదారు, అంతకుముందు బీజేపీఅధికార ప్రతినిధిగా ఉన్నసీనియర్ నేత పరకాల ప్రభాకర్ భార్య, నిర్మలాసీతారామన్; హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం ప్రేంకుమార్ ధుమాల్ కుమారుడు, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. కర్నాటక మాజీ సీఎం ఎస్సార్‌బొమ్మై కుమారుడు, బస్వరాజ్‌బొమ్మై కూడా కర్నాటక సీఎంగా పనిచేశారు.
కేంద్రమంత్రి రాజనాధ్‌సింగ్ కుమారుడు, పంకజ్‌సింగ్ యుపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. హర్యానా మాజీ సీఎం రావ్ బీరేంద్రసింగ్ తనయుడు, రావ్ ఇంద్రజిత్‌సింగ్ కేంద్రమంత్రిగా, మరో కేంద్రమంత్రి నారాయణ్‌రాణే కుమారుడు, నైలేష్ రాణే ఎంపీగా పనిచేశారు. అప్నాదళ్ అధినేతసోనేలాల్ పటేల్ కుమార్తె, అనుప్రియ పటేల్; మాజీ కేంద్రమంత్రి అర్జున్‌పవార్ కోడలు, భారతీ ప్రవీణ్ పవార్; బెంగాల్ మాజీ మంత్రి మంజుల్‌ఠాకూర్ కొడుకు, శంతన్‌టాకూర్ కేంద్రమంత్రులుగా ఉన్నారు.
బెంగాల్‌లో ఎంపి శిశిర్ అధికారి కొడుకు, సువేందు అధికారి ఎమ్మెల్యే; బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్‌వర్గియా కొడుకు, ఆకాష్ ఎమ్మెల్యే; మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ ఫడ్నవీస్ కొడుకు, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి; కాంగ్రెస్‌లో కీలకనేత జితేంద్రప్రసాద తనయుడు, జితిన్ ప్రసాద యుపి మంత్రి పదవులు అనుభవిస్తున్నారు.
ఏపీలో సీనియర్ నేత పివి చలపతిరావు కుమారుడు మాధవ్ ఎమ్మెల్సీగా చేశారు. యడ్లపాటి రఘునాధరావు కుటుంబం అంతా బీజేపీలోనే ఉంది. ఎమ్మెల్సీగా చేసిన సీనియర్ నేత జూపూడి యజ్ఞనారాయణ కుమారుడు జూపూడి రంగరాజు, ఆయన తల్లి కూడా బీజేపీలోనే ఉన్నారు.
రాయలసీమ నుంచి తొలి బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పార్ధసారధి తనయుడు, బీజేవైఎంలో ఉన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాధ్‌రెడ్డి కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేశారు. కిరణ్ తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీలో చురుకుగా పనిచేస్తున్నారు.
ఇక తెలంగాణలో మాజీ ప్రధాని పివి నరసింహారావు మనుమడు ఎన్వీ సుభాష్; మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి కొడుకు మర్రిశశిధర్‌రెడ్డి; మాజీ ఎంపి జంగారెడ్డి కుమార్తె చందుబట్ల కీర్తిరెడ్డి; కెవి రంగారెడ్డి మనుమడు కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో వివిధ హోదాల్లో ఉన్నారు. బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి పార్టీలో కీలకపదవిలో కొనసాగుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తనయుడు పార్టీలోనే ఉన్నారు. పీసీసీ మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడు, ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
మాజీ ఎంపి వెంకటస్వామి తనయుడు జి.వివేక్, జాతీయ కార్యవర్గసభ్యుడిగా ఉన్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు, తూళ్ల వీరేందర్‌గౌడ్ పార్టీలో ఉన్నారు. దివంగత మాజీ ఎంపి ఆలె నరేంద్ర తనయుడు కార్పొరేటర్‌గా ఉండగా, ఆయన కుటుంబం నుంచి మరొకరు, ఎల్బీనగర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈవిధంగా ఇన్ని డజన్ల మంది వారసులు పువ్వు పార్టీలో పనిమళిస్తుండగా.. తమది కుటుంబపార్టీ కాదని బీజేపీ నేతలు చెప్పడమే వింత. అయితే.. దీనికి సంబంధించి సరైన సమాచారం బీజేపీ ప్రత్యర్ధుల వద్ద లేకపోవడమే, ‘‘బీజేపీ కుటుంబపార్టీ కాదన్న భావన’’కు కారణంగా కనిపిస్తోంది. కాబట్టి కమలం కూడా, కుటుంబ రాజకీయాలకు అతీతం కాదని స్పష్టమవుతోంది. అన్నీ ఆ తాను ముక్కలే!