Suryaa.co.in

Andhra Pradesh

కాపు ఓట్లు కూడగట్టి హోల్‌సేల్‌గా బాబుకి అమ్మకం

– మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపునేస్తం
– చంద్రబాబుది డీ పీ టీ – దోచుకో, పంచుకో, తినుకో
– ఇలాంటి పాలన దేశంలో ఉందా ?
– వరుసగా మూడో ఏడాది కాపు నేస్తం
– రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.508.18 కోట్ల ఆర్ధిక సాయం.
– కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం…
దేవుడి దయతో ఈరోజు ఇక్కడ మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వరుసగా మూడో ఏడాది 3,38,792 మంది అక్కచెల్లెమ్మలకు ఇవాళ కార్యక్రమంలో నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి రూ.508 కోట్లు జమ చేస్తాను. ఎటువంటి లంచాలకు ఆస్కారం లేకుండా వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో జమ చేస్తున్నాం.

మనసుతో స్పందించే ప్రభుత్వమిది…
మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతుల ప్రభుత్వం. మనది పేదల ప్రభుత్వం అని చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. మనది వరదలు వస్తే… కష్టం వస్తే మనసుతో స్పందించి ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండే ప్రభుత్వం. మనది మనసున్న ప్రభుత్వం కాబట్టే.. ఈ రోజు మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్సార్‌ కాపునేస్తం అనే పథకాన్ని మీ కోసం తీసుకువచ్చాం. ప్రతి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.

వైయస్సార్‌ చేయూత అనే పథకాన్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న పేదింటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు జీవనోపాథి అవకాశాలను, జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఒక పథకాన్ని నవరత్నాల్లో భాగంగా ఇస్తూ వాగ్ధానం చేశాం.

మేనిఫెస్టోలో చెప్పకపోయినా కాపునేస్తం…
కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్ధతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైయస్సార్‌ కాపునేస్తం అనే పథకాన్ని ప్రారంభించాం. వరుసగా మూడో ఏడాది కూడా నా అక్కచెల్లెమ్మలకు అండగా, తోడుగా ఉంటున్నాం. మూడో ఏడాదికి సంబంధించిన డబ్బు రూ.15వేలు అక్కచెల్లెమ్మలకు విడుదల చేస్తున్నాం.
దీంతో ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.45వేలు ఈ రోజుతో వాళ్ల చేతికి ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వాళ్లకు తోడుగా ఉంటూ… క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ వైయస్సార్‌ కాపునేస్తం అమలు చేస్తున్నాం.

అర్హత ఉండి మిస్‌ అయిన వాళ్లకూ..
వైయస్సార్‌ కాపునేస్తం ద్వారా మొదటి ఏడాది 3,27,349 మంది కాపు అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున రూ.490 కోట్లు ఇచ్చాం.
రెండో ఏడాది 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు సుమారు మరో రూ.490 కోట్లు అందించాం. రెండో ఏడాది అర్హత ఉండి పథకాన్ని పొందలేకపోయిన మరో 1249 అక్కచెల్లెమ్మలకు .. వాళ్లు కూడా మిస్‌ కాకూడదనే ఉద్దేశ్యంతో ఈనెల19వ తేదీన వాళ్లకు కూడా రూ.1.87 కోట్లు వాళ్ల అకౌంట్లో జమ చేశాం. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు, ప్రతిఒక్కరికీ మేలు జరగాలి, అర్హత ఉన్న ఏ అక్కచెల్లెమ్మ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతోనే అడుగులు వేశాం.

మూడేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.1492 కోట్లు…
ఈ రోజు వరుసగా మూడో ఏడాది…. 3,38,792 మంది అక్కచెల్లెమ్మలకు ఈ కార్యక్రమంలో నేరుగా బటన్‌ నొక్కి వారి అకౌంట్లలో రూ.508 కోట్లు జమ చేస్తున్నాం. దీంతో ఒక్క ఈ కాపునేస్తం అన్న ఒక్క పథకం ద్వారానే మూడేళ్లలో రూ.1492 కోట్లు అక్కచెల్లెమ్మలకు బటన్‌ నొక్కి నేరుగా డిబీటీ అందించాం. ఇక నవరత్నాల్లోని మిగిలిన పథకాల ద్వారా ఈ మూడళ్లలోపే ఒక్క కాపుసామాజిక వర్గానికి సంబంధించినcm-kapu1 అక్కచెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు డీబీటీ ద్వారా కానీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా కానీ కలిగిన లబ్ధి రూ.16,256 కోట్లు. ఇవి కాకుండా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్లు కట్టించే కార్యక్రమం, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా కాపు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16వేల కోట్లు.

ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించి చూస్తే 2.46 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇచ్చాం. అలా ఇచ్చిన పట్టాల విలువ చూస్తే.. ఒక్కో పట్టా విలువ కనీసం రూ.5 లక్షలు వేసుకున్న ఈ 2,46,080 మంది అక్కచెల్లెమ్మలకు రూ.12 వేల కోట్లు ఇచ్చినట్లవుతుంది. ఇందులో ఇప్పటికే 1.20 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం మొదలైంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి విలువ ఒక్కొక్కటి మరో రూ.2.50 లక్షలు వేసుకున్నా… ఒక్క ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం కలుపుకుంటే.. దీనికే రూ.15,334 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

ఇక నాన్‌ డీబీటీ పథకాలను కూడా కలుపుకుంటే..
ఈ సొమ్ము… రూ.16,040 కోట్లు అవుతుంది. మొత్తంగా కాపు అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు ఈ మూడేళ్ల కాలంలోనే జరిగిన లబ్ధి… రూ.32,296 కోట్లు.
కాపులకు ప్రతి ఏటా రూ.1000 కోట్లు బడ్జెట్‌ ఇస్తామని గత టీడీపీ ప్రభుత్వంలోని ఐదేళ్ల కాలంలో రూ.5వేల కోట్లు ఇస్తానని చెప్పిన పెద్దమనిషి(చంద్రబాబునాయుడు).. రూ.1500 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆ పరిస్థితిని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకొండి. ఆయన చేసిన అనేక మోసాలు, అబద్దాలు మాదిరిగానే ఈ వాగ్దానాన్ని కూడా మిగిల్చారు.
ఇక మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రతి ఏటా రూ.2వేల కోట్లు ఇస్తామని… ఐదు సంవత్సరాల తిరక్క మునుపే రూ.10వేల కోట్ల లబ్ధి చేస్తామని మనం చెప్పాం. కానీ ఇవాళ మూడు సంవత్సరాలు తిరక్కమునుపే రూ.32,296 కోట్లు ఇవ్వగలిగాం.
మనసుతో పరిపాలన అందిస్తున్నాం. ఇది మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మల మీద, పేదవాడి మీద చూపిస్తున్న చిత్తశుద్ధి, శ్రద్ధ.
కాపులకు– మన చేతల ద్వారా కాపు కాస్తున్నాం…
కాపులకు మనం… నేస్తం మాత్రమే కాదు.. వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామన్నది కూడా స్పష్టంగా చేసి చూపించాం.

ఇక్కడ మరో విషయం చెప్పాలి.గతంలో ఒక కులానికి కానీ, సామాజిక వర్గానికి కానీ ఆ ప్రభుత్వం ఏం మేలు చేసిందంటే.. బడ్జెట్‌లో లెక్కలు మాత్రమే చూపించేవారు. ఈ లెక్కలు చూసి ఆ కులాల వారంతా ఏమనుకునేవారంటే.. బడ్జెట్‌లో ఇన్ని వందలు, వేల కోట్లు చూపిస్తున్నారు, కానీ ఆ కులం వాడినైనా నాకు ఎందుకు మేలు కలగడం లేదని చెప్పి అనుకునేవారు. నాక్కూడా వైట్‌ కార్డు ఉంది, నేను కూడా పేదవాడినే అయినా మాకు రాకుండా ఈ డబ్బులున్నీ ఎవరికి ఇచ్చారు ? ఈ లెక్కలన్నీ మాయాజాలమే కదా ? అని చెప్పి గతంలో బడ్జెట్‌ చూసినవారు అనుకునే పరిస్థితి.
ప్రతి పేదకుటుంబం అనుకునే మాట.. మా పేరుమీద పద్దురాసుకుంటున్నారు. కానీ మాకు ఇచ్చింది ఏమీలేదు అని చెప్పి గతంలో బడ్జెట్‌ చూసి అనుకునేవారు.
కానీ ఈ రోజు… ఆ పరిస్థితి లేదు. మనం వచ్చిన తర్వాత. బడ్జెట్‌లో అంకెలు మాత్రమే కాదు. ఒక కులానికి జరిగిన మేలు మాత్రమే కాదు, ఒక జిల్లాలో అందరికీ జరిగిన మేలు.. ఒక గ్రామంలో జరిగిన మంచి కూడా.

ఇలాంటి పాలన దేశంలో ఉందా ?
వీటన్నింటికి మించి ఈ మూడేళ్ల పాలనలో మనం ప్రతి కుటుంబానికి, అందులోని ప్రతి అక్క, చెల్లెమ్మకి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ఇంటింటికీ వెళ్లి.. అక్కా మీ కుటుంబానికి ఇన్ని పథకాలు అందాయి. ఇంత మేలు జరిగింది అని చెప్పి పూర్తి వివరాలతో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా మంచి చేయగలిగామని చెప్పి.. తలుపుతట్టి ప్రతి అక్కకూ చూపించి, వారిని ఆశీర్వాదం కోరే పరిస్థితిలో మన ప్రజాప్రతినిధులంతా వెళ్లి గడప, గడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఇంత పారదర్శకంగా మంచి చేసిన తర్వాత.. దాన్ని చూపించి, అక్కా ఈ మంచి జరిగితేనే అన్నను ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే మీ గడప, గడపకూ వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా ? ఒక్కసారి ఆలోచన చేయండి.

గతంలో పథకాలు కోత…
గతంలో కొద్దిమందికి మాత్రమే పథకాలు ఇచ్చేవారు. అది కూడా అధికార పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు చెపితే తప్ప ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అక్కడ కూడా లంచాలు తీసుకుని ఇచ్చే పరిస్థితి మాత్రమే కాకుండా వేయి మంది ఉంటే ఒకరికో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి గతంలో ఉండేది.
దీనికే అప్పట్లో ఇదే పెద్దమనిషి డబ్బా కొడుతూ ప్రచారం చేసేవాడు. ఆయన ఏం చెప్పినా.. దానికి తాన, తందాన అంటూ ఎల్లోమీడియా నెత్తికెత్తుకునేది.

ఇవాళ అర్హులందరికీ పథకాలు…
ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా ఈరోజు మంచి జరుగుతుంది. ఇంటింటికీ ఏస్ధాయిలో మంచి జరుగుతుందంటే కులం చూడ్డం లేదు. మతం చూడ్డం లేదు. ప్రాంతం చూడ్డం లేదు, వర్గం చూడ్డం లేదు. చివరికి ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా… ఆ మనిషి గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా వేయకపోయనా కూడా పట్టించుకోకుండా.. సాచ్యురేషన్‌ విధానంలో అర్హత ఒక్కటే ప్రమాణంగా తీసుకుని ప్రతి ఇంటికి మంచి చేస్తున్నాం.

మనది డీబీటీ….
ఎక్కడా లంచాలు లేవు, వివక్ష చూపించడం లేదు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ కొరకు డిస్‌ప్లే చేస్తున్నాం. ప్రతి వాలంటీర్‌ మీ ఇంటి తలుపు తట్టి అక్కా ఈ పథకం మీకు అందలేదా ? ఎందుకు అందలేదు ? అని మీకోసం పరిగెత్తి ఆ పథకాన్ని మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు.
మనం బటన్‌ నొక్కిన వెంటనే… డీ బీ టీ అంటే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బు జమ అవుతుంది.

చంద్రబాబుది డీ పీ టీ – దోచుకో, పంచుకో, తినుకో…
కానీ గతంలో ఒక్కసారి ఏం జరిగిందో గమినించమని అడుగుతున్నాను. చంద్రబాబునాయుడు గారి పాలనలో డీ పీ టీ పథకాలు జరిగేవి. డీ పీ టీ అంటే ఏమిటో తెలుసా ? దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే స్కీం ద్వారా జరిగేది. చంద్రబాబునాయుడు గారు తన దుష్టచతుష్టయం అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరికి తోడు వారి దత్తపుత్రుడు వీళ్లందరూ రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో.. అని కుమ్మక్కు అయ్యారు. అంటే వీరికి తెలిసిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయం ఇదే.

గతానికి ఇప్పటికే తేడా చూడండి.?
టీడీపీ మంచి చేసే నవరత్నాల రద్దు అంటోంది..
ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు, సంక్షేమ అభివృద్ది పథకాలన్నీ రద్దు చేయాలని చెప్పి టీడీపీ అంటోంది ?
ఆయన(చంద్రబాబు), దుష్ట చతుష్టయం కూడా జగన్‌ పాలనలో డీబీటీ ద్వారా ప్రజలకు మేలు చేయడం వల్ల… రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని వెటకారపు మాటలు మాట్లాడుతున్నారు.

ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి..
మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రాష్ట్రంలో ఏ ఇంటికైనా, ఏ కులం, ప్రాంతంవాడికైనా, పేదవాడికైనా కూడా ఏం స్కీమ్‌ కావాలన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో చర్చ కూడా జరగాలి. మనందరి ప్రభుత్వం ఇస్తున్నది డీ బీ టీ – డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌. నేరుగా బటన్‌ నొక్కిన వెంటనే లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లే మన ప్రభుత్వం ఇస్తున్న డీబీటీ పథకం కావాలా ?
లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు, తన దుష్టచతుష్టయం అమలు చేసిన దోచుకో, పంచుకో, తినుకో అనే డీ పీ టీ పథకం కావాలో ఒక్కసారి ఆలోచన చేయండి.
మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాల బాగు కావాలా ? లేదా గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు, తన దుష్టచతుష్టయం, తన దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా ? అన్నది ఒక్కసారి ఆందరూ ఆలోచన చేయాలి.

మేనిఫెస్టో 95 శాతం అమలు చేసి….
ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం వాగ్ధానాలు అమలు చేసి ఇంటింటికీ వెళ్లి.. మేం ఇచ్చిన వాగ్ధానాలు అమలు అయ్యాయా లేదా ? అక్క మీరే చెప్పండి. మంచి జరిగిందా ? మంచి జరిగితేనే, మీకు లబ్ధి కలిగితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా ? లేకcm-kapu2 మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన, మేనిఫెస్టోలో రక,రకాల హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసి, అలా చెప్పిన వాటిలో 10 శాతం హామీలు కూడా అమలు చేయని పచ్చి అబద్దాల మార్కు.. చంద్రబాబు రాజకీయం కావాలా ? ఒక్కసారి ఆలోచన చేయండి. దీనిపై ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి.
కాపులకైనా, ఏ కులంవారికైనా, ఏ పేదింటివారికైనా ఇంటింటికీ, మనిషి, మనిషికీ మంచి జరిగేలా పాలన అందిస్తున్న మీ అన్న పాలనా కావలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

కాపు ఓట్లు కూడగట్టి హోల్‌సేల్‌గా బాబుకి అమ్మకం..
రాజకీయాలు దిగజాయిపోయిన పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా మూటగట్టి.. వాటినన్నింటినీ కూడా హోల్‌సేల్‌గా చంద్రబాబుకి అమ్మేసి.. దోచుకో, పంచుకో.. తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఇవాళ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వీళ్ల మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు. వీళ్ల మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు.
వీళ్లకు లేనిది నాకున్నది మీ దీవెనలు, దీవుడి ఆశీస్సులు…
కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా… వీళ్లకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడి ఆశీస్సులు అని కచ్చితంగా చెపుతున్నాను.
తేడా గమనించండి. గతంలో కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. కేవలం తేడా ఏమిటంటే ముఖ్యమంత్రి మార్పు. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు ? ఈ రోజు మీ బిడ్డ ఇన్ని పథకాలు పేదలకు ఎలా ఇవ్వగలుగుతున్నాడు ? ఆలోచన చేయండి.
కేవలం ఒక్కటే కారణం ఈ రోజు మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. ఎలాంటి వివక్ష లేకుండా, లంచాలు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి.
ఆ రోజు బటన్‌ నొక్కేది లేదు, ప్రజలకు ఇచ్చేది లేదు. నేరుగా ఉన్నది ఒకే ఒక్క స్కీం. దోచుకో.. పంచుకో.. తినుకో అన్న ఒకే ఒక్క స్కీం. వీళ్లంతా కలిసికట్టుగా దోచుకునే కార్యక్రమం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మంచి జరగాలని, ప్రజలు ఇంకా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే పరిస్థితి రావాలని మనసారా రావాలని కోరుకుంటున్నాను.

రాజకీయాలు ఎలా దిగాజారాయంటే…
ఈ అబద్దాల విషయాలు, ఈ రాజకీయాల విషయాలు ఏ స్ధాయికి దిగజారిపోతున్నాయంటే… ఒక్కోసారి బాధనిపిస్తుంది.
నిన్న చూశాను. చంద్రబాబు అనే వ్యక్తి పేపర్‌ పట్టుకుని చూపిస్తూ.. నేను హుథ్‌హుథ్‌ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తక్షణ సహాయం నేను రూ.4వేలు ఇచ్చాను. జగన్‌ ఈరోజు రూ.2వేలు మాత్రమే ఇస్తున్నాడని చంద్రబాబు మాట్లాడుతున్నారు.
ఎంత పచ్చి అబద్ధం అంటే.. హుథ్‌ హుథ్‌ టైంలో నేను 11 రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాలో తిరిగాను. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు తిరిగాను. వాళ్లు ఇచ్చిందేమిటంటే.. పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు.. అక్కడక్కడా 10 కేజీల రేషన్‌ బియ్యం. ఆ తుఫానే కాదు.. ఆ తర్వాత వచ్చిన తిత్లీ తుఫాన్‌ సహా ఏ తుఫానులో కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.
కానీ ఈ రోజు ఏ తుఫాను వచ్చినా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ.. ఈ రెండు జిల్లాలకే ఉన్న 6 మంది కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు పూర్తిగా మోహరించేస్తున్నారు. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో 25 కేజీల రేషన్, వాటితో పాటు ప్రతి ఇంటికి రూ.2వేలు డబ్బులు గతంలో ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు.

సాయం రాలేదని ఒక్క కేసు చూపించు బాబు
మానవత్వంతో ఇస్తున్నాం కాబట్టి.. ఇన్ని రోజులగా తిరుగుతున్న చంద్రబాబు జగనన్న పాలనలో నాకు రేషన్‌ రాలేదని కానీ, నా ఇంటికి రూ.2వేలు రాలేదని కానీ ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. ఈ పెద్దమనిషి చేతిలో కాయితాలు పట్టుకుని ప్రజలు మర్చిపోయారేమనని, రూ.4వేలు ఇచ్చాని అబద్దాలు చెప్తుంటే.. ఈయన మనిషేనా అనిపిస్తుంటుంది.
వీళ్లందరికీ ఒక్కకే అహంకారం. వాళ్లు ఏ అబద్దాలు చెప్పైనా ప్రజలను నమ్మించగలుగుతామని. కారణం ఏమిటంటే… పత్రికలు వాళ్లవే, టీవీలు వాళ్లవే. చర్చ జరిపేది వాళ్లే.. జరిపించేది వాళ్లే. ఏం చెప్పినా ప్రజలను మోసం చేయవచ్చు అన్న ధీమా వాళ్లకుంది.
కానీ ఇంతకముందు నేను చెప్పాను.. వాళ్లకు లేనిది, నాకున్నది ఇంటింటికీ మంచి చేశానన్న చిత్తశుద్ధి. ఇంటింటిలో ఉన్న నా అక్కచెల్లెమ్మలు నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకుంది. ఆ దేవుడి దీవెనల మీద నాకు నమ్మకం ఉంది.మంచి జరగాలని మనసారా ప్రార్ధిస్తూ.. మీ ఆప్యాయతలు, అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ పెట్టుకుంటాను.

చివరిగా….
ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ.. ఏలేరు ఫేజ్‌ –1 మోడరనైజేషన్‌ బ్యాలెన్స్‌ వర్కులున్నాయి. నాన్నగారు ప్రారంభించి 60 శాతం పనులు పూర్తి చేసారు. తర్వాత దాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఈ రోజు ఆ అంచనాలు కూడా తడిసి మోపుడై రూ.142 కోట్లు అయ్యాయని చెప్పారు. ఆ ఏలేరు ఫేజ్‌ –1 కోసం రూ.142 కోట్లు మంజూరు చేస్తున్నాను. ఇదే కాకుండా.. తానడిగిన ఏలేరు ఫేజ్‌ –2 కోసం మరో రూ.150 కోట్లు కూడా మంజూరు చేస్తున్నాం. ఇది కాక పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు సంబంధించి ఒక్కో మున్సిపాల్టీకి రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా. ఆ అంచనాలను తయారు చేయమని చెప్తున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.
అనంతరం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో కాపునేస్తం సాయాన్ని జమ చేశారు.

LEAVE A RESPONSE