– కరీంనగర్ బంద్‌తో ప్రభుత్వ వైఫల్యానికి ప్రజల గట్టి తీర్పు
– కరీంనగర్ సీపీని వెంటనే సస్పెండ్ చేయాలి
– విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలి
– ఎంపీ బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్లో నాపై జరిగిన హత్యాయత్నం, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి, నగరంలో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితికి నిరసనగా నిర్వహించిన కరీంనగర్ బంద్ ప్రజల పూర్తి మద్దతుతో విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యానికి గట్టి సమాధానం ఇచ్చారు.
ఇటీవల కరీంనగర్లో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్న ఘటనలు నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
నాపై కత్తులు, రాళ్లతో దాడి చేసి నా కార్ అద్దాలను ధ్వంసం చేయడం పూర్తిగా పథకం ప్రకారం చేసిన హత్యాయత్నం. అదే విధంగా గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి. ఈ ఘటనలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతోనే ఈరోజు కరీంనగర్ బంద్ ప్రభావం నగరమంతా స్పష్టంగా కనిపించింది. వ్యాపారులు, యువత, మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి బంద్‌ను విజయవంతం చేశారు.
అయితే ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులను వినియోగించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం దుర్మార్గమైన చర్య. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను ఇంటి వద్దే అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే.
శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైన కరీంనగర్ సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నాపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై, అలాగే ఈ దాడులను ప్రేరేపించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈరోజు కరీంనగర్ బంద్ మరోసారి స్పష్టం చేసింది. ప్రజల కోసం పోరాడే బీఆర్ఎస్ నాయకులను బెదిరించే ప్రయత్నాలు ఎంత చేసినా మా పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నాను.