తిరుమల శ్రీవారి అలయంలో బుధవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టిటిడి ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.
ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాకంఅర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనంఅర, పరిమళంఅర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్యల నడుమ వేదమంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.