Suryaa.co.in

Andhra Pradesh Telangana

కోడికి నాలుగు పంచదార పలుకులు విదిల్చి కోడి పిల్లలను కాళ్ళతో తన్నుకు పోయే గద్ధ కేసీఆర్

– అమరావతి వినాశనంలో కేసీఆర్ కూడా భాగ స్వామి
– కేసీఆర్ ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న ఆటంక వాది
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య

కోడికి నాలుగు పంచదార పలుకులు విదిల్చి, తల్లి కోడిని ఏమార్చి, దాని పిల్లలను కాళ్ళతో తన్నుకు పోయే గద్ద తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి వాటిలో మాత్రమే ఆటంక వాదులు ఉంటారని, కేసీఆర్ ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న పెద్ద ఆటంక వాది అని తేల్చి చెప్పారు.

ప్రాంతీయ విషబీజాలు నాటకుండా కేసీఆర్ ఉండలేరని చెప్పారు. ఏపీ ప్రజలను తిట్టక పోతే, ఆయనకు ముద్ద దిగదని, నిద్ర కూడా పట్టదని పేర్కొన్నారు. ఎన్నికలు లేకుంటే ఒకలా, ఎన్నికలు ఉంటే మరోలా మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ ఓడితే, హైదరాబాద్ నగరం అమరావతి అవుతోందని, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ ముఖ్యమంత్రి.. జగన్ మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అమరావతి వినాశనంలో కేసీఆర్ కూడా భాగ స్వామి అన్నారు. పక్కవాడు నాశనంలో ఆనందాన్ని వెతుక్కునే అలవాటు కేసీఆర్ కు దండిగా ఉందని అన్నారు. తెలంగాణకు దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన దళిత బంధు పథకంతో సరిపుచ్చారని ఆరోపించారు. తెలంగాణా ఇస్తే, టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాగాంధీని మోసం చేయలేదా? అని ప్రశ్నించారు.

పదేళ్ళ కేసీఆర్ పాలన ప్రజలకు బర్రెలు, గొర్రెల మాత్రమే ఇచ్చిందని, బంగారు పళ్ళెం తాను, తన కుటుంబ సభ్యులకు ఇచ్చారని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా ఎదిగింది కానీ, తెలంగాణా ప్రజలు బర్రెలు, గొర్రెలను దాటి ఎదగ లేదని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాలని, ఏపీ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని కోరారు.

LEAVE A RESPONSE