– ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి తూట్లు
-సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయని సర్కారు
– దళిత బందు నిధుల పేరిట సబ్ ప్లాన్ నిధులు కోత పెడితే సర్కార్ తో సమరమే
– అంబేద్కర్ విగ్రహాలను అవమానిస్తే తోలు తీస్తా
– సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
– పాదయాత్రకు సిపిఎం, టిడిపి, ఎమ్మార్పీఎస్ సంఘీభావం
-ఉప్పొంగిన రైతు అభిమానం
– క్షణం తీరిక లేకున్న ప్రజాసేవ కోసమే తపన
– భట్టి విక్రమార్కకు అపూర్వ స్వాగతం
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాంగాన్ని అవమాన పరచడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగాన్ని అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతాం అని తెలిపారు.
ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి 5 వ రోజుకు చేరుకుంది. మండలంలోని మల్లన్న పాలెం, పమ్మి, కమలాపురం, అయ్యాగారిపల్లి, బానాపురం
గ్రామాల్లో పీపుల్స్ మార్చ్ కొనసాగింది. పాదయాత్ర సందర్బంగా పలు గ్రామాల్లో ప్రజలు వచ్చి ఆయనకు సమస్యలను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన సభలలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారత దేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని, ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఆ పార్టీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వాలను , అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్నారు.
ప్రపంచదేశాలలో భారత దేశ రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇటువంటి రాజ్యాంగంలో రాసిన చట్టాలను రాష్ట్ర పాలకులు తుంగతో తొక్కడం సరికాదన్నారు.
రాష్ట్ర శాసనసభలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనదని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుచూపుతో గుర్తించి రాజ్యాంగంలో పొందుపరిచినాడని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విస్మరించి సొంత రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే ప్రజలు నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన పాలకులు శాసనసభ వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంచిది కాదని సూచించారు.
ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి తూట్లు
బడ్జెట్ లో దళిత గిరిజనుల అభ్యున్నతికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తున్నట్టు కాగితాల లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను వారి కోసం ఖర్చు చేయకుండా దారి మళ్ళించి ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సబ్ ప్లాన్ కింద 1, 07, 319 కేటాయించి అందులో సగం కూడా దళిత గిరిజనులకు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ ప్రభుత్వం 65 వేల కోట్లను దారి మళ్ళించి దళిత, గిరిజనుల మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 33, 610 కోట్లు కేటాయించగా జనవరి నాటికి రూ. 15 వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం ఈసారి దళిత బంధుకు రూ. 20వేల కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయకుండా కేసీఆర్ దళితులకు ఏమైనా బిచ్చం వేస్తున్నావా? అని నిలదీశారు. ఈ బడ్జెట్లో దళిత గిరిజన జనాభా దామాషా ప్రకారం దాదాపుగా రూ. 40 వేల కోట్లు పైగా నిధులు కేటాయించాలన్నారు. దళిత బంధు పేరిట రూ. 20 వేల కోట్లు కేటాయించి మిగత నిధులకు కోత పెడితే ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఖాయమని హెచ్చరించారు.
“తోలు తీస్తా “….భట్టి హెచ్చరిక
అంబేద్కర్ విగ్రహాలను అవమానించే వారి తోలు తీస్తానని పమ్మి గ్రామంలో జరిగిన సభలో భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఇటీవళ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం తొలిగించిన విషయం తెలిసిన వెంటనే అధికారులను తీవ్రంగా మందలించానని గుర్తు చేశారు. యధా స్థానం లోనే విగ్రహాన్ని పెట్టాలని ఒత్తిడి చేసినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామ ప్రజలు అందరూ కోరుకున్న స్థలంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
సిపిఎం, టిడిపి, ఎమ్మార్పీఎస్ సంఘీభావం
టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముదిగొండ మండలం పమ్మి, కమలాపురం గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రకు స్థానిక సిపిఎం, టిడిపి, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పూలమాలవేసి సి ఎల్ పి నేతను సత్కరించారు. అనంతరం గ్రామంలో జరిగిన పాదయాత్రలో విక్రమార్క తో కలిసి అడుగులో.. అడుగులు వేసి కదం తొక్కారు.
ఉప్పొంగిన అభిమానం
భట్టి విక్రమార్క మల్లు తన పాదయాత్రలో భాగంగా 5 వ రోజు ముదిగొండ మండలం మల్లన్న పాలెం గ్రామం నుంచి పమ్మి గ్రామానికి రోడ్డు వెంబడి పాదయాత్రగా వస్తుండగా మార్గమధ్యంలో బురద పొలంలో పనిలో నిమగ్నమైన రైతు రాయబారపు నాగయ్య దూరం నుంచి భట్టి విక్రమార్క గారు నడిచి వచ్చేది చూసి వెంటనే బురద పొలంలో నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. గట్టు మీదికి రాగానే పక్కనే ఉన్న గుంటలో కాళ్లు చేతులను ఆదరబాదరగా కడుక్కుని విక్రమార్క దగ్గరికి పరిగెత్తి చేతిలో చేయి వేసి తన అభిమానాన్ని చూపించాడు. ఈ సన్నివేశాన్ని వీడియో గ్రాఫర్ ను ప్రత్యేకంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాష్ట్రంలో వైరల్ గా మారింది. “ఉప్పొంగిన అభిమానం” అంటూ పలువురు కామెంట్ పెట్టడం విశేషం.
క్షణం తీరిక లేకున్న ప్రజాసేవ కోసమే తపన
మండుటెండను సైతం లెక్కచేయకుండా వందల కిలోమీటర్ల మేరా ప్రజా సమస్యల పరిష్కారంకై పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క తనకు దొరికిన కొద్దిపాటి విశ్రాంతి సమయాన్ని కూడా గురువారం
ప్రజాసేవకే వెచ్చించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల బాగోగులు కోసమే తపిస్తోన్నారు. ముదిగొండ మండలం మల్లన్న పాలెం గ్రామం నుంచి పమ్మి గ్రామానికి కాలినడకన వచ్చిన ఆయన విశ్రాంతి తీసుకోకుండా నియోజకవర్గంలోని ప్రజలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఫైళ్లను పరిశీలించారు. వాటిపై సంతకాలు పెట్టి సీఎం కార్యాలయానికి సిఫార్స్ చేశారు. అదే విధంగా పాదయాత్రలో వచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వాటిని పరిష్కరించాలని కోరారు.
భట్టి విక్రమార్కకు అపూర్వ స్వాగతం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర గౌరవసభ్యులు, భట్టి విక్రమార్క మల్లు గారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా 5వ రోజు ముదిగొండ మండలం పమ్మి, కమలాపురం గ్రామాలకు చేరిన
సందర్భంగా పమ్మి గ్రామ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క కు అపూర్వ స్వాగతం లభించింది. మేళతాలతో గ్రామంలోకి ఆహ్వానించారు. సమస్యల పైన వినతిపత్రాలు అందించారు.