– మతం కంటే మానవత్వం గొప్పది
– సికింద్రాబాద్ లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో గాడ్ విజన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సికింద్రాబాద్: అందరికీ క్రిస్మస్ మాస శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ సంతోషంగా ఉంటారు. ఇది అత్యంత పవిత్రమైన మాసంగా భావించి నిత్యం పండుగలా జరుపుకుంటారు.
2 వేల సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మిస్తే ఇప్పటికీ వారిని ప్రార్థిస్తున్నామంటే వారి గొప్పతనం ఏమిటో చెప్పకనే చెప్పవచ్చు. ఏసుప్రభు ప్రేమ, దయా గుణం, కరుణ, శాంతిని అందరిలో పెంపొందించారు. ఇవే మనిషిని ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయి. ఉన్నతమైన స్థానం అంటే సంపద ఉండడమో, పదవి ఉండడమో కాదు. గుణగణాలతో ఉన్నతంగా జీవించే వారే ఉన్నతమైన స్థానంలో ఉండేవారు.
ఏసుప్రభు క్షమాగుణం అందరికీ ఆదర్శం. తనను శిలువ వేసిన వారిని, తనను పట్టించిన వారిని కూడా క్షమించమని ప్రార్థించిన గొప్ప మహనీయుడు ఆయన. ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది జరుపుకునే పండుగ క్రిస్మస్.
ఈరోజు గాడ్స్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పండుగ సంబరాలు జరుపుకోవడం, అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ . హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందర్నీ సమానంగా చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ .
దేశంలో ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నాగాని క్రిస్మస్ పండుగను అధికారికంగా జరపలేకపోయారు. బతుకమ్మ పండుగకు కొత్త చీరలు ఇచ్చినట్లు, ముస్లింలకు కూడా కొత్త బట్టలు పంపిణీ చేశారు. అలాగే క్రైస్తవులకు కూడా క్రిస్మస్ పండుగకు బట్టలు పంపిణీ చేసిన నాయకుడు కేసీఆర్.
గతంలో క్రైస్తవుల సమస్యలను కేసీఆర్ పరిష్కరించారు. . క్రైస్తవులకు సమాధుల కోసం స్థలాలను కేటాయింపు విషయంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు .నా వంతు సహాయం చేస్తాను.
గతంలో సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించడమే కాదు, హిందువులకు స్మశానవాటికలు, పార్థివ వాహనాలు ఇచ్చినట్టే క్రైస్తవులకు కూడా చివరి మజిలీ వాహనాన్ని అందించడం జరిగింది.
కులాల మధ్య , మతాల మధ్య గొడవలతో మనుషులు సాటి మనుషులనే చంపుకునే పరిస్థితి ఏర్పడింది. అందరూ ద్వేషాలు మరిచిపోయి ఏసుప్రభు స్ఫూర్తితో క్షమాగుణంతో ఉండాలి. అందరూ సహనంతో ఉండాలి. .ప్రేమను పంచుకోవాలి.
టీవీ, పేపర్లు చూస్తే.. ఒకరిపై ఒకరు హత్య ప్రయత్నాలు, ఒక మతంపై ఇంకో మతం పెత్తనం, ఇక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం… ఇవే వార్తలు. శాంతి లేకపోతే ప్రపంచం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. కొన్ని శక్తులు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంటాయి.
మతం కంటే మానవత్వం గొప్పది. ఉన్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడమే అందరి బాధ్యత. ఏసుప్రభు మాటలు సూక్తులు వినడమే కాదు వాటిని ఆచరించి మంచి సమాజాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీపక్షంగా నా వ్యక్తిగతంగా కూడా కృషి చేస్తాను.