Suryaa.co.in

Telangana

కేసీఆర్ కి భారతరత్న ఇవ్వాలి

– మున్నూరుకాపు, బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపు, ఒంటరి అనే వేర్వేరు పేర్లతో పిలువబడుతున్న మనమందరం అన్నదమ్ముల పిల్లలమే
– రాయచూరు మున్నూరుకాపు సమాజం సాంస్కృతిక కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు

రాయచూరు: కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించి బీడు వారిన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును భారతరత్న పురస్కారంతో గౌరవించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పాలకులు కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్ ను విచారించడం అక్రమం, అన్యాయం, తీవ్ర అభ్యంతరకరమన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ రికార్డ్ సమయంలో నాలుగేళ్లలోనే పూర్తి చేయించి 2కోట్ల 42లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లిచ్చి చెరువులు,కుంటలు నింపి, భూగర్భ జలమట్టాలను బాగా పెంచి రాష్ట్రాన్ని ఆకుపచ్చగా తీర్చిదిద్దారని ఎంపీ రవిచంద్ర వివరించారు.సమైక్య రాష్ట్రంలో దండుగ అనుకున్న వ్యవసాయాన్ని తెలంగాణ సాధించాక కేసీఆర్ ఆచరణలో పండుగ చేసి నిరూపించారని ఎంపీ వద్దిరాజు తెలిపారు.

రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల కష్టాలను కడతేర్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ ను భారతరత్న పురస్కారంతో గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా కర్ణాటకలోని రాయచూరులో గురువారం జరిగిన ముగింపు ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు సీ.విఠల్, సర్థార్ పుటం పురుషోత్తమ రావు, రౌతు కనకయ్య, ఆకుల రజిత్ కుమార్,మరికల్ పోత సుధీర్ కుమార్,ఊసా రఘు,దివి రాంకుమార్ తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాయచూరు మున్నూరుకాపు సమాజం అధ్యక్షులు బెల్లం నర్సారెడ్డి, ముంగారు సాంస్కృతిక రాయచూరు అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డిల ఆధ్వర్యాన నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఎంపీ రవిచంద్ర,ఆయన సన్నిహితులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఎడ్ల పందేలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,కాపులం అంటే కష్ట జీవులమని, రైతు బిడ్డలమని, అన్నదాతలమని చెప్పారు. మున్నూరుకాపు, బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపు, ఒంటరి అనే వేర్వేరు పేర్లతో పిలువబడుతున్న మనమందరం అన్నదమ్ముల పిల్లలమేనని పేర్కొన్నారు.

మనం దేశంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నామని, వచ్చే ఏడాది జరిగే జనగణన-కుల గణన సందర్భంగా మున్నూరుకాపు అని తప్పనిసరిగా నమోదు చేసుకుందామన్నారు. మన పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుకుంటూ వ్యాపార, రాజకీయ రంగాలలో కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని ఎంపీ రవిచంద్ర చెప్పారు. మున్నూరుకాపులం ఇతర బీసీ కులాల వారితో స్నేహంగా ఉంటూ, పరస్పర సహకారంతో రాజ్యాధికారం దిశగా వడివడిగా అడుగులేద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా 25 ఏండ్ల నుంచి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న పాపారెడ్డికి తెలంగాణ మున్నూరుకాపు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని, ఇదేవిధంగా మరో 25 సంవత్సరాలు జరుపుతూ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షించారు.

పాపారెడ్డి, నర్సారెడ్డిలు రవిచంద్ర,విఠల్, పురుషోత్తమ రావు, కనకయ్య, రజిత్ కుమార్, సుధీర్ కుమార్,రఘు, రాంకుమార్, డాక్టర్ పీఏల్ఏన్ పటేల్,భేతి శ్రీధర్,కొట్టే వెంకట నారాయణ తదితర ప్రముఖులను పూలమాలలు,శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పోటీలలో విజేతలుగా వాటి యజమానులకు ఎంపీ వద్దిరాజు,పాపారెడ్డిలు నగదు బహుమతులు అందజేశారు.ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో చౌకీమఠ్ జగద్గురు సిద్ధలింగ మహాస్వామి,స్థానిక ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE