-పిల్లనిచ్చిన పాపానికి ఊరోళ్ల కొంప ముంచుతావా?
-సర్వస్వం త్యాగం చేసిన మిడ్ మానేరు బాధితులకు ఇచ్చిన హామీని ఎందుకు నేరవేర్చడం లేదు?
-జీహెచ్ఎంసీలో బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆందోళన భేష్…
-ప్రజా సమస్యలపై పోరాడుతుంటే… నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధిస్తారా?
-బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తాం
-ఇప్పుడొస్తున్న పెన్షన్ కు అదనంగా డబ్బులిస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-వేములవాడలోని రుద్రవరం లో మిడ్ మానేరు ముంపు బాధితులతో భేటీ
‘‘కేసీఆర్…. అత్తగారి ఊరంటే నీకు అంత కోపమెందుకు.. పిల్లనిచ్చిన పాపానికి ఊరోళ్ల కొంప ముంచుతావా? చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ మోసం చేస్తావా? మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన బాధిత కుటుంబాలను ఆదుకుంటానని ఇచ్చిన హామీని అమలు చేయకుండా రోడ్డునపడేస్తావా?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతూ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘వరదలవల్ల నష్టపోయిన హైదరాబాద్ ప్రజలను కాపాడాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే… ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. లైట్లు, ఫ్యాన్లు ఆపేశారు. బౌన్సర్లను పెట్టి కొట్టించే కుట్ర చేస్తున్నారు. అయినా అదిరేది లేదు. బెదిరేది లేదు… కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేదాకా బీజేపీ ఉద్యమిస్తుంది’’అని స్పష్టం చేశారు.
వేములవాడ నియోజకవర్గంలోని రుద్రవరంలో మిడ్ మానేరు బాధితుల ఐక్య వేదిక నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. బీజేపీ నాయకులు ఎర్రం మహేశ్, ఐక్యవేదిక నాయకులు పిల్లి కనకయ్య, లింగస్వామి, ఎంపీటీసీ సంకె శేఖర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిడ్ మానేరు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐక్య వేదిక నాయకులు ఏకరవు పెట్టారు. తమ కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా ఈనెల 8, 9 తేదీల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ముంపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలిస్తామనే హామీనీ చేర్చాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడారు..అందులోని ముఖ్యాంశాలు…
మిడ్ మానేరు బాధితులు భయపడకండి. మీకు పరిహారం ఇవ్వడానికి కేసీఆర్ మనసు రావడం లేదు. మీరంటే భయం, ప్రేమ కూడా లేదు. అత్తగారి ఊరికే న్యాయం చేయలేనోడు.. రాష్ట్రానికి ఏం చేస్తడు? అందుకే మీరంతా ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోండి… కేసీఆర్… మిడ్ మానేరు కోసం సర్వం త్యాగం చేసినోళ్లు వీళ్లు.. ఇంకా పోయేదేమీ లేదు. అందరం కలిసి ఐక్యంగా పోరాడండి. మీ పక్షాన మేం పోరాడదాం. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా అందరం కలిసి ఉద్యమిద్దాం. మీకోసం జైలుకు పోయేందుకు మేం సిద్ధం. మరో 5 నెలలు ఆగండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరిస్తాం.
మిడ్ మానేరు బాధితుల సమస్యల పరిష్కారం కోసం క్రషి చేస్తున్న ఐక్యవేదిక నాయకులకు హ్రుదయపూర్వక అభినందనలు. ఈ కలర్ బిల్డింగుల వెనుక ఎన్ని కన్నీటి కథలున్నాయో ఎవరికీ తెల్వవు. మిడ్ మానేరు కోసం ఇండ్లు, భూములుసహా సర్వం త్యాగం చేశారు. మీ భూముల త్యాగంవల్ల చుట్టుపక్కలనున్న భూముల విలువ 10 రెట్లకుపైగా పెరిగింది.
మీ బాధలు నాకు తెలుసు… మా అత్తగారి ఊరు కొదురుపాకే కాబట్టి మీకు న్యాయం చేస్తా. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలిస్తానన్నడు. మల్లన్నసాగర్ బాధితులకు రూ.13 లక్షల పరిహారం ఇచ్చారు. మరి మిడ్ మానేరు బాధితులు చేసిన పాపమేంది? ఓట్లేసి గెలిపించడమే చేసిన నేరమా?
మిడ్ మానేరు బాధితులు కోరేది గొంతెమ్మ కోర్కెలు కానేకావు. కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నరు. ఒక్కో కుటుంబానికి 5 లక్షలివ్వాలి. 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవ్వాలి. ఇండస్ట్రీయల్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టివ్వాలని అంటున్నరు. గెజిట్ లో తప్పించబడ్డ వారి పేర్లను చేర్చాలని అంటున్నరు. అందులో తప్పేముంది?
మిడ్ మానేరు బాధితుల పక్షాన ఉంటాం. ఎన్నికలు రాబోతున్నయ్. ఇదే చివరి యుద్దం కావాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది 5 నెలలే. ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడున్న సంక్షేమ పథకాలేవీ తొలగించబోం. మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పుడొస్తున్న పెన్షన్ కు అదనంగా డబ్బులిస్తాం.
హైదరాబాద్ లో భారీ వర్షాలతో ఇండ్లు ధ్వంసమయ్యాయి. చిన్న పిల్లలు నాలాల్లో, నీటి గుంతల్లో పడి చనిపోయారు. గతంలో వరద బాధితులకు రూ.10 వేల చొప్పున ఇస్తానని పైసా సాయం ఇయ్యలే. కొడుకే మున్సిపల్ మంత్రి. పేపర్ లీకేజీకి కారకుడు కేసీఆర్ కొడుకే. ఆయనే ఐటీ శాఖ మంత్రి. ఆయన రాజీనామా చేయాలంటే కేసీఆర్ కు కోపమొస్తోంది.
జీహెచ్ఎంసీ సమస్యలను పరిష్కరించాలని పోరాడుతున్న బీజేపీ కార్పోరేటర్లను అరెస్ట్ చేసి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి బెదిరిస్తున్నరు. ఇయాళ జీహెచ్ఎంసీ సమావేశంలో ప్రజా సమస్యలపై నిలదీస్తే ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన కొట్లాడుతూ జైలుకు పోయిన పార్టీ బీజేపీ. నాన్ బెయిలెబుల్ కేసులు భరిస్తున్న పార్టీ. ఇప్పటికీ జీహెచ్ఎంసీ ఛాంబర్లో తలుపులు మూసుకుని హైదరాబాద్ ప్రజలను కాపాడాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంటే… ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. లైట్లు, ఫ్యాన్లు ఆపేశారు. బౌన్సర్లను పెట్టి కొట్టించే కుట్ర చేస్తున్నారు. అయినా అదిరేది లేదు. బెదిరేది లేదు..
మిడ్ మానేరు బాధితులు భయపడకండి. మీకు పరిహారం ఇవ్వడానికి కేసీఆర్ మనసు రావడం లేదు. మీరంటే భయం, ప్రేమ కూడా లేదు. అత్తగారి ఊరికే న్యాయం చేయలేనోడు.. రాష్ట్రానికి ఏం చేస్తడు? అందుకే మీరంతా ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోండి… కేసీఆర్… మిడ్ మానేరు కోసం సర్వం త్యాగం చేసినోళ్లు వీళ్లు.. ఇంకా పోయేదేమీ లేదు. అందరం కలిసి ఐక్యంగా పోరాడండి. మీ పక్షాన మేం పోరాడదాం. ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా అందరం కలిసి ఉద్యమిద్దాం. మీకోసం జైలుకు పోయేందుకు మేం సిద్ధం. మరో 5 నెలలు ఆగండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరిస్తాం.
కేసీఆర్ బతుకేందో.. ఆయన కుటుంబం బతుకేందో మీ అందరికీ తెలుసు. మిడ్ మానేరు కోసం ఆయన కుటుంబం ఏమైనా త్యాగం చేసిందా? ఆయన వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించి మిడ్ మానేరు బాధితులను బికారీలను చేశారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన సొమ్ములో ఒక్కశాతమిస్తే బాధితుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.