Suryaa.co.in

Telangana

క్రీడా స్ఫూర్తిని నింపిన ఖేలో తెలంగాణ .. జీతో తెలంగాణ

– గ్రాండ్ సక్సెస్ అయిన సికింద్రాబాద్ క్రీడోత్సవాలు
– క్రీడోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పండుగ వాతావరణం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 10 రోజులుగా జరిగిన క్రీడోత్సవాలు
– జింఖానాగ్రౌండ్స్ లో గ్రాండ్ గా ముగింపు కార్యక్రమం.. విజేతలకు బహుమతులు
– ఫిట్ ఇండియా లక్ష్యంతో.. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రధాని మోదీ పిలుపుతో క్రీడాపోటీలు
– వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్న 7,279 మంది క్రీడాకారులు

హైదరాబాద్: పది రోజులుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంబరాన్నంటేలా జరుగుతున్న ‘ఖేలో తెలంగాణ-జీతో తెలంగాణ’ క్రీడా సంబరాలు గురువారం ఘనంగా ముగిశాయి. యువతలో క్రీడాస్ఫూర్తి నింపడమే లక్ష్యంగా .. వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్దడమే ధ్యేయంగా.. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో నిర్వహించిన సికింద్రాబాద్ క్రీడోత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
ఫిట్ ఇండియా నినాదంతో .. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సికింద్రాబాద్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని.. తమసత్తా చాటారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం జింఖానా గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ప్రధాని మోదీ పిలుపుతో.. ఫిట్ ఇండియా లక్ష్యంగా.. యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు నిర్వహించిన సికింద్రాబాద్ క్రీడోత్సవాలకు విశేష స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో యువత ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఖేలో సికింద్రాబాద్.. జీతో సికింద్రాబాద్ అంటూ సత్తాచాటారు. యువతను క్రీడల్లో ప్రొత్సహించడానికి ప్రధాని మోడీ పిలుపుతో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీలకు యువత నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వచ్చింది. భారీ సంఖ్యలో యువత వివిధ రకాల ఆటల పోటీల్లో పాల్గొని తమ టాలెంట్ ను చూపించారు. అటల్ బిహారీ వాజ్ పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల ముగింపు కార్యక్రమం జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఆటల పోటీల్లో విజేతలకు కిషన్ రెడ్డి బహుమతులు అందించారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 40 డివిజన్ల నుంచి యువత పోటీ పడ్డారు. 20 గ్రౌండ్స్ లో.. 200 మంది రెఫరీస్ తో.. ఆటల పోటీలు నిర్వహించారు. పది వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే.. మొత్తం 7,279 మంది ఆటల పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీలో 78 టీమ్స్, అథ్లెటిక్స్ లో 552 మంది ప్లేయర్స్, ఖోఖోలో 51 టీమ్స్, క్రికెట్లో 318 టీమ్స్, వాలీబాల్ లో 62 టీమ్స్ పోటీపడ్డాయి. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో విజయం సాధించిన జట్ల వివరాలు గమనిస్తే.. క్రికెట్ మహిళల విభాగంలో సికింద్రాద్ విల్లామేరీ కాలేజ్ విజయం సాధిస్తే.. పురుషుల విభాగంలో కొమురం భీమ్ అంబర్ పేట్ జట్టు విజయం సాధించింది. కబడ్డీ పురుషుల విభాగంలో బాలక్ వీర్ అసిఫ్ నగర్ జట్టు విజయం సాధిస్తే.. మహిళల విభాగంలో GDC బేగంపేట్ జట్టు విజయం సాధించింది. ఇక ఖోఖో మహిళల విభాగంలో కాచిగూడ క్వీన్స్ సత్తా చాటగా.. పురుషుల విబాగంలో నల్లకుంట టైగర్స్ గెలుపొందారు. వాలీబాల్ మహిళల విభాగంలో సికింద్రాబాద్ శ్రీకృతి జట్టు విజయం సాధించింది. ఇక పురుషుల విభాగంలో నాంపల్లి విష్ణువర్ధన్ జట్టు విజయం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ లో 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్ లో భాను ప్రసాద్ విజయం సాధించాడు.

ఫిబ్రవరి 20న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు .. పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటిన వారిని ఘనంగా సన్మానించారు కిషన్ రెడ్డి. భారత్ అన్ని రంగాల్లో ప్రపంచాన్ని ఎలా శాసిస్తోందో .. అలాగే క్రీడల్లోను శాసించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీనిలో భాగంగానే ఫిట్ ఇండియా స్ఫూర్తితో సికింద్రాబాద్ క్రీడోత్సవాలు నిర్వహించామన్నారు.

మోదీ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నాయకుడిగా ప్రాధాన్యత పొందారన్నారు. భారతీయులు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం పెరిగిందన్నారు. అయితే క్రీడల్లో మాత్రం అనుకున్నంత ఎదగలేదన్నారు. కోట్లాది మంది యువత ఉన్నా.. అనుకున్న లక్ష్యాలను క్రీడల్లో చేరుకోలేకపోయామన్నారు కిషన్ రెడ్డి. అందుకే మోడీ ప్రధాని అయ్యాక.. క్రీడల్లో భారత్ ను ముందుంచేందుకు ప్రయత్నం మొదలుపెట్టారన్నారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ పోటీలకు ఎన్నికైన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారన్నారు.

LEAVE A RESPONSE