– కొత్త అధ్యక్షులకు కమిటీల సవాలు
– ఏపీ-తెలంగాణలో పాత కమిటీలు ఉన్నట్లా? లేనట్లా?
– కొత్త కమిటీలు వేస్తారా? మార్పు చేర్పులతో సరిపెడతారా?
-బండి-సోము కమిటీల్లో చాలామందికి స్థానం భ్రంశం?
– తెలంగాణలో మళ్లీ పాతవారికి పట్టం?
– బండి సైన్యం స్థానంలో కొత్తనేతలు?
-మనోహర్‌రెడ్డి, ప్రదీప్, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల అవుట్?
– బండి అసమ్మతి నేతలకు కొత్త కమిటీలో అవకాశం?
– బండి రాకతో తెరమరుగైన సీనియర్లు
– ఆయనను మార్చాలంటూ మూడుసార్లు అసమ్మతి నేతల భేటీ
– ఏపీలో విష్ణువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, శ్రీదేవి, చంద్ర మౌళి, బిట్రా, చందు సాంబశివరావు, గాజుల, సుధాకర్ యాదవ్ అవుట్?
– వీర్రాజు విధేయులకు స్థానచలనం?
– ఏపీలో కొన్ని జిల్లా అధ్యక్షుల మార్పు?
– తెలంగాణలో ‘సెల్స్’కు రీచార్జి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ-తెలంగాణ రాష్ట్రాల కొత్త కమలదళపతులకు కొత్త కమిటీలు సవాలుగా మారనున్నాయి. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డి, ఏపీలో సోము వీర్రాజు స్థానంలో పురందీశ్వరి నియమితులయిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ ఇంకా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించలేదు. ఈవారంలో ఇద్దరూ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
అయితే కొత్త కమలదళపతులిద్దరికీ ఇప్పుడు, కమిటీల ఏర్పాటు సవాలుగా మారింది. ఏపీలో ఆయా పదవులకు అసలైన అర్హుల సంఖ్య తక్కువ.అసలు రాష్ట్రంలో మండల, పట్టణ కమిటీలు ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో భర్తీ చేసిన దాఖలాలు లేవు. అంతమంది నాయకులు లేకపోవడమే ఆ పార్టీకి లోటు. వెంకయ్యనాయుడు, కృష్ణంరాజు, హరిబాబు వంటి అగ్రనేతలున్నప్పటికీ, ఇప్పటిదాకా మండల, పట్టణ కమిటీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసుకోలేకపోవడాన్ని పార్టీ శ్రేణులు విషాదంగా భావిస్తుంటారు. దానితో రాష్ట్ర స్థాయి నేతలు పెద్దగా లేకపోవడంతో, కన్నా-సోము జిల్లా స్థాయి నేతలనే ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దానితో ప్రస్తుత కమిటీలో వార్డు స్థాయి నేతలు కూడా.. కోర్ కమిటీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల అవతారమెత్తాల్సి వచ్చింది. ఇక క్యాడర్ బలం ఉన్న తెలంగాణలో మాత్రం పోటీ తీవ్రంగానే కనపిస్తోంది. వీరిలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానితో కొత్త కమలద ళపతులు, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.
ఏపీలో పార్టీ పగ్గాలు అందుకోనున్న పురందీశ్వరి నాయకత్వ సమర్ధతకు, కమిటీలు పరీక్షగా నిలిచాయి. ఇప్పటి కమిటీలో సోము వీర్రాజు విధేయులే ఎక్కువగా ఉన్నారు. వారిలో ప్రజల్లో బలం ఉన్న వారి సంఖ్య అత్యల్పం. సీనియర్లకు పోటీగా కార్పొరేటర్లుగా గెలవలేని వారిని తీసుకువచ్చి, ఆఫీసు బేరర్ పదవులివ్వడం విమర్శలకు గురయింది.
ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయనివారు, ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లు సాధించలేని వారికి ఆఫీసు బేరరు పదవులివ్వడం వివాదమయింది. ఉద్యోగాలిప్పానంటూ నిరుద్యోగులను మోసం చేసిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేతకు, సోము వీర్రాజు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించడం విమర్శలకు దారితీసింది.
కాగా పార్టీని జనంలోకి బలంగా తీసుకువెళ్లాలంటే, సమర్ధులతో రాష్ట్ర కమిటీని భర్తీ చేయాలని పురందీశ్వరి భావిస్తున్నారు. సమస్యలపై గళం విప్పే సమర్ధులను గుర్తించడమే ఇప్పుడు ఆము ముందున్న సవాలు. నిజానికి ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ఆ స్థాయి నేతలెవరూ లేరన్నది ఒక భావన. వన్‌మ్యాన్ ఆర్మీగా ఉండే మున్సిపాలిటీ, జిల్లా స్థాయి నేతలనే తీసుకువచ్చి, రాష్ట్రస్థాయి పదవులిస్తున్న సంప్రదాయమే కొనసాగుతోంది. అందువల్ల రానున్న ఎన్నికల్లో సమర్ధులను ఎంపిక చేసుకోవడం కత్తిమీద సామే.
అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న కొందరిని తొలగించి, వారి స్ధానంలో కొత్త వారికి స్థానం కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం విష్థువర్దన్‌రెడ్డి, సూర్యనారాయణరాజు, శ్రీదేవి, చంద్రమౌళి, గాజుల వెంకయ్యనాయుడు, బిట్రా శివన్నారాయణ, చందుసాంబశివరావు, లక్ష్మీపతిరాజాను తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు వ్యవహారశైలి వల్ల మీడియా పార్టీకి పూర్తిగా దూరమైనందున, తిరిగి దగ్గర య్యేందుకు మీడియా కమిటీలో, సమర్ధులను నియమించే అవకాశాలున్నాయంటున్నారు. అదేవిధంగా పార్టీ కార్యాలయ కార్యదర్శిని కూడా అందరికీ అందుబాటులో ఉండే నేతకు అప్పగించాలని పురందీశ్వరి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పురందీశ్వరి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత.. ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డిని కొనసాగించే అంశంపై, పార్టీవర్గాల్లో చర్చకు తెరలేవడం విశేషం. సోము వ ర్గీయుడిగా పార్టీ వ్యవహారాలు, పార్టీ ఆఫీసుపై పట్టు సాధించిన ఆయనను, ఈసారి తప్పించడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కులం, పాత సాన్నిహిత్యం కోణంలో కిషన్‌రెడ్డి, ఏపీ కో ఇన్చార్జి సునీల్ దియోథర్ దన్నుతో.. మళ్లీ విష్ణువర్దన్‌రెడ్డి కమిటీలో, ీ లక పదవి సాధిస్తారని మరికొందరు జోస్యం చెబుతున్నారు.
ఇక రాజంపేట, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట, కర్నూలు, మచిలీపట్నం జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా విజయవాడ అద్యక్షుడు బబ్బూరి శ్రీరాంను మార్చి, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించడం ఖాయమని చెబుతున్నారు. తొలుతగా రాజంపేట, విజయవాడ అధ్యక్షులను ఖాయంగా మారుస్తారంటున్నారు.
తెలంగాణలో కూడా బండి సంజయ్ ప్రధాన అనుచరులను, తప్పించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న మనోహర్‌రెడ్డిని తప్పించవచ్చంటున్నారు. సంజయ్ పాదయాత్ర, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల, ప్రదీప్‌ను కూడా తప్పించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
లక్ష్మణ్ కమిటీలో ఉన్న వారందరినీ సంజయ్ పక్కనపెట్టడం, అప్పట్లో విమర్శలకు దారితీసింది. అందుకు ఆగ్రహించిన సీనియర్లు.. మూడుసార్లు రహస్య భేటీలు ఏర్పాటుచేసి, సంజయ్‌ను తొలగించాలని ఢిల్లీ నాయకత్వానికి లేఖ రాశారు. సంజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఒక కీలకనేత ద్వారా పార్టీ పేరుతో కొనసాగిస్తున్న ఆర్ధిక లావాదేవీలు, అసెంబ్లీ టికెట్లు ఇప్పిస్తామన్న భరోసా వెనుక జరిగిన తెరచాటు వ్యవహారాలను అసమ్మతి వర్గం, ఢిల్లీకి ఫిర్యాదు చేసింది. సంఘ్ నాయకత్వానికీ సంజయ్‌పై ఫిర్యాదు చేసింది.
ఇప్పుడు కిషన్‌రెడ్డి మళ్లీ పాత నేతలలో కొందరిని, రాష్ట్ర కమిటీలో తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా లీగల్, మీడియా వంటి సెల్స్‌ను భర్తీ చేయనందున, సెల్స్‌కు చార్జింగ్ ఇవ్వవచ్చంటున్నారు. ఇప్పటిదాకా సంఘటనా మంత్రి లేనందున, సమర్ధుడైన నేతకు పార్టీ ఆఫీసు ఇన్చార్జి అప్పగించడం, కత్తిమీద సాములాంటిదే. అందరికీ ఆమోదయోగ్యం, వివాదరహితుడైన నేతను ఆ బాధ్యతకు ఎంపిక చేయాల్సి ఉంది. జిల్లాల్లో ఉండకుండా, హైదరాబాద్‌లో ఉండే నేతలకు.. ఇప్పటివరకూ పదవులిస్తున్న సంస్కృతిలో మార్పు తీసుకురావడమే, కిషన్‌రెడ్డి ముందున్న సవాలు.
ఇక వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులకు కమిటీల్లో ప్రాధాన్యం ఇస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కనీస గౌరవం ఇవ్వకపోవడం, వారికి ఎలాంటి బాధ్యతలివ్వకపోవడంపై చాలాకాలం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలకు తెరదించేందుకు కిషన్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అయితే అసలు రెండు రాష్ర్టాల్లో కొత్త అధ్యక్షులు.. ప్రస్తుతం ఉన్న కమిటీలు కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు రాజీనామా చేస్తే, కార్యవర్గం కూడా రద్దయినట్లే. కానీ కమిటీలు రద్దయినట్లుగానీ, లేక అవే కొనసాగుతాయని గానీ ఎక్కడా ప్రకటించకపోవడం గందరగోళానికి దారితీస్తోంది.
అయితే తెలంగాణలో సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు ఉన్నందున, కిషన్‌రెడ్డి కొత్త కమిటీలు వేసే సాహసం చేస్తారా? లేక ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులలో కొంతమందిని మార్చి.. వారి స్థానంలో కొత్తవారితో భర్తీ చేస్తారో చూడాలి.