– అప్పుడు కే కన్వెన్షన్లోనే జరిగిందన్నారు
– నిన్నటికి కళ్యాణ మండపం సమీపానికొచ్చారు
– మీడియా ముసుగులో మూడు ఛానల్స్ దుష్ప్రచారం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
అమరావతి, జనవరి 24: గుడివాడలో కేసినో వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మరోమారు స్పష్టం చేశారు. కేసినో జరిగిందని ఆరోపించే టీడీపీ నేతలు మొదట కే కన్వెన్షన్లో జరిగిందని చెప్పుకొచ్చారని, నిన్నటికి కళ్యాణ మండపం సమీపాన నిర్వహించినట్టుగా తేల్చారని, ఇప్పుడు గుడివాడ పట్టణంలో కేసినో జరిగిందని మాట మార్చుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ మీడియా ఛానల్స్ తో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడులు ఒకటేనని, వీరిని విడదీసి చూడలేమన్నారు. చంద్రబాబుకు ముగ్గురు టీవీ ఛానల్స్ అధినేతలు డైరెక్షన్ ఇచ్చి టీడీపీని నడుపుతుంటారన్నారు. ఏమీలేని దాన్ని ఏదో జరిగినట్టుగా రెండు రోజులు వార్తలను ప్రసారం చేస్తారని, వెంటనే చంద్రబాబుతో నిజ నిర్ధారణ కమిటీ వేయిస్తారన్నారు. ఆ తర్వాత ఎవరిని ఎక్కడికి పంపాలి, ఎవరు తన్నులు తినాలో రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడులు డిసైడ్ చేస్తారన్నారు.
టీడీపీలో మేనేజర్ లా చంద్రబాబు వాటిని అమలు చేస్తాడన్నారు. జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దించి చంద్రబాబును ఎక్కించి ఆయనను తడికెలా అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిరోజూ పనికిరాని వాళ్ళతో డిబేట్లను పెట్టించి జగన్ పై ఏడవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వాల దగ్గర నుండి ఇప్పటి వరకు సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్రమంతా మూడు రోజుల పాటు కోడి పందాలు, జల్లికట్టు వంటివి జరుగుతూ వస్తున్నాయన్నారు. ఈసారి తనను లక్ష్యంగా చేసుకుని కేసినో జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, కే కన్వెన్షన్లో జరిగినట్టు చంద్రబాబు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశానన్నారు. ఖాళీ ప్రదేశంలో సెట్టింగ్లు వేసినట్టుగా ఉన్న వీడియోలను చూపించి విమర్శలు చేసేవారు కే కన్వెన్షన్ ఎలా ఉంటుందో చూశారా అని ప్రశ్నించారు.
ఎక్కడో జరిగిన ఫొటోలు, వీడియోలను తీసుకువచ్చి మిక్సింగ్ చేయడం, అల్లరి చేయడం 420 గాళ్ళకు అలవాటుగా మారిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి తనపై మూడు ఛానల్స్ మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయన్నారు. భారత సంస్కృతికి కేసినో విరుద్ధమని చెప్పే సోము వీర్రాజు గోవా ఏ దేశంలో ఉంది, అక్కడ ఏ పార్టీ పాలన సాగుతుందో చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖను సోము వీర్రాజు టీడీపీకి అద్దెకిచ్చారని, జనసేన చంద్రబాబు కోసమే పుట్టిందని, ఆయన కోసమే పనిచేస్తోందన్నారు. టీవీ 5, ఈటీవీ, ఏబీఎన్, చంద్రబాబు ఒకటే బ్యాచ్ అని అన్నారు. ఎవరు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ముందూ, వెనుక ఎవరు మాట్లాడాలనే దానిపై స్క్రిప్ట్, డైరెక్షన్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయన్నారు. డబ్బా ఛానల్స్ లో వచ్చిన తర్వాత చంద్రబాబు , ఆ తర్వాత సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడుతుంటారని, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అర్థం కావని అనుకుంటుంటారన్నారు. ఇటువంటి నాటకాలను ప్రజలు చూశారు కాబట్టే ఒంటరిగా పోటీ చేసిన జగన్మోహనరెడ్డికి 151 సీట్లు కట్టబెట్టారని, 420 గాళ్ళకు మూతిపగిలే సమాధానం చెప్పారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.