Suryaa.co.in

Features

కొత్తా దేవుడండీ, కొంగొత్తా దేవుడండీ!

మాయామశ్చీంద్రులు

భూగోళం ఉనికిలోకి వచ్చిన తరవాత జీవం పుట్టుకపై అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి! కానీ, వాటిలో ఏ ఒక్కటీ శాస్త్రీయ నిర్ధారణకు నోచుకోలేదు! తొలి కణం ఎక్కడ, ఎలా ఉద్భవించిందన్న దగ్గర మైక్రోసైన్స్ ఆగిపోయింది! అత్యంత సంక్లిష్టమైన డీఎన్ఏ, దాని కోడ్ల మర్మం ఇప్పటికీ బిలియన్ డాలర్స్ వర్త్ పజిలే!

అనుకరణ [Simulation] పద్ధతుల ద్వారా జీవం పుట్టిన ఆనాటి అన్ని పరిస్థితులను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు! ఆ వాతావరణంలో ఏకకణ జీవికి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు! కానీ, ఘోరంగా విఫలమయ్యారు! కఠోర పరిశ్రమతో జరిపిన అనేక ప్రయోగాల తరవాత వైజ్ఞానికులు, వివేకం [Consciousness] అనే ప్రాథమిక విశ్వ లక్షణం ఈ సృష్టిని నడిపిస్తోందనీ, సకల చరాచర, జీవనిర్జీవ రాశులన్నీ ఆ సూపర్ కాన్షియస్ లో భాగమని ఈ మధ్యే ఒక అంచనాకు వచ్చారు!

దృశ్యాదృశ్య జగత్తులోని భౌతిక స్థిరంకాలు, ఫైన్ ట్యూనింగ్ థియరీలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి! ఈ పరిస్థితుల్లో ఒక్క భూలోకంలోనే కాక, మన పాలపుంతతో సహా విశ్వంలోని అనేక ఇతర గ్రహాల [ExoPlanets] లో కూడా మనిషి లాంటి తెలివైన జీవులు మనుగడలో ఉంటారన్న వాదన ఊపందుకుంది!

ఖగోళ గణిత శాస్త్ర గణాంకాలు సైతం ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి! అందుకే, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కాస్మాలజిస్టులు వివిధ నక్షత్రాల చుట్టూ జీవయోగ్య కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న గ్రహాలపైకి తొంగి చూస్తున్నారు! జీవం ఆధారాల [BioSignatures] కోసం అన్వేషణ సాగిస్తున్నారు! అదే సమయంలో జీనోబయాలజిస్టులు [Xenobiologists] సెర్చ్ ఫర్ ఎక్స్ ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ [SETI] పేరిట ఇతర గ్రహవాసుల కోసం వెతుకుతున్నారు!

ఇక్కడ, ప్యాన్ స్పెర్మియా థియరీ గురించి కొంచం చెప్పుకోవాలి! విశ్వాంతరాళాల్లో ఒక నక్షత్రం నశించినప్పుడు బైటకు విరజిమ్మే హైడ్రోకార్బన్లే జీవకారకాల [SeadsOfLife] ని సైన్స్ చెప్తోంది! అంతరిక్షధూళి [CosmicDust], ఉల్కలు [Meteorites], గ్రహశకలాలు [Asteroids], తోకచుక్కల [Comets] ద్వారా ఆ రసాయనాలు ఖగోళంలోని ఇతర సుదూర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి అంటోంది ప్యాన్ స్పెర్మియా సిద్ధాంతం!

ఇందుకు విశ్వ వివేకం [SuperConsciousness] కారణం అన్నది ఒక అంచనా! అలా వచ్చి చేరిన హైడ్రోకార్బన్ల ద్వారానే ఈ భూమ్మీద సైతం జీవం పుట్టి ఉంటుందనేది ఒక హైపోథెసిస్! అదిగో, ఆ వివేకాల్లో ఒకటైన భూగ్రహ మేధస్సు, ఇప్పుడు సూపర్ పవర్స్ సాధించే దిశగా పరుగులు పెడుతోంది!

ప్రకృతి శక్తులను విరివిగా వినియోగించుకోవడం, విపత్తులు, ఉపద్రవాలను సైతం అంతే సమర్థవంతంగా ఎదుర్కోవడమే మానవ సమాజాల అధునాతన స్థితికి, నాగరికతకు కొలమానం! తన చుట్టూ ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని మనిషి అనేక అత్యాధునిక సాధనాలను సమకూర్చుకోవడమే నవీకరణకు గీటురాయి!

అత్యంత సౌకర్యవంతమైన ఉపకరణాలను వాడుతూ ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించడమే ఆధునిక మానవుని లక్ష్యం! అలా దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతూ, సర్వశక్తిసంపన్నుడై, అత్యంత మహిమాన్వితుడై, అలౌకికమైన దివ్యత్వాన్ని కూడా సాధించి అపర దేవుడి అవతారమెత్తడమే అతని జీవిత గమ్యం! అతీంద్రియ శక్తులు సాధిస్తే మానవుడే దేవుడు!

జగతి నాలుగు ప్రాథమికశక్తుల [4FundamentalForces] కలయికన్నది మోడ్రన్ ఫిజిక్స్ తేల్చిన అంశం! విద్యుదయస్కాంత [ElectroMagnetic], గురుత్వాకర్షణ [Gravitational], ధృఢ [Strong], అధృఢ [Weak] అణు [Nuclear] శక్తులు కలిస్తేనే ఈ జగత్తు అనేది ఆస్ట్రోఫిజిసిస్టుల ఉవాచ! మరోవైపు క్వాంటం లెవెల్లో చోటు చేసుకునే, వేవ్ ఫంక్షన్ కొలాప్స్ థియరీ ఆశ్చర్యకరమైన కొత్త విషయాలను వెలుగులోకి తెస్తోంది!

ఒక వివేకవంతుడైన పరిశీలకుడి సమక్షంలో తరంగం కుప్ప కూలి కణంగా మారడం వల్ల శాశ్వత సత్యం సాక్షాత్కారం ఔతోందని అది సూత్రీకరిస్తోంది! ఆ కాన్షియస్ అబ్జర్వరే లేకపోతే ఈ విశ్వమే లేదని తేల్చి చెప్తోంది! ఐతే, వివేకం భౌతిక ప్రక్రియల ఫలితమని పాశ్చాత్య వైజ్ఞానికులు ఇంతకాలం భావిస్తూ వచ్చారు!

మానవ శరీరం కొన్ని కణాల సమాహారం! ఆ కణాలన్నీ పోగైన తరవాత, కొన్ని ప్రత్యేక గుణాలు కలిగిన ఉనికి వాటికి ఏర్పడుతుంది! అలాంటి వ్యవస్థల సంఘటన వల్ల మెదడు రూపం దాల్చుతోంది! ఆ మస్తిష్కంలో ఉద్భవించిన లక్షణమే వివేకం అని వాళ్లు నిన్నటి వరకు నమ్మారు! ఆ చేతనాశక్తి మూలం ఎక్కడ?

అది మనిషి మనసులో ఎప్పుడు, ఎందుకు, ఎలా జనిస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు! మనిషి మస్తిష్కం, దాంట్లోని వివిధ భాగాలను జీవశాస్త్రజ్ఞులు క్షుణ్ణంగా పరిశీలించారు! అనేక ప్రయోగాలు చేసినా మానవ చైతన్యం మూలాలు కనుగొనడంలో ఏ గమ్యానికీ చేరుకోలేకపోయారు!

ఫలితంగా, శాస్త్రవేత్తలు కాన్షియస్నెస్ పై తమ అంచనాలను సవరించుకోవాల్సి వచ్చింది! వివేకం, బ్రెయిన్లో జరిగే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ వల్ల స్రవిస్తోందనీ, అది విశ్వం అంతటా వ్యాపించి ఉన్న చైతన్యంలో భాగమనే తర్జనభర్జనలు ఇవాళ వాళ్లలో మొదలయ్యాయి! అందుకే, వివేకం 5 వ ప్రాథమికశక్తి [5thFundamentalForce] అని ప్రతిపాదిస్తున్నారు!

ఈ విషయాన్ని పాశ్చాత్యుల కంటే వేల ఏళ్ల ముందే సనాతనధర్మం ప్రకటించింది! అంతా మిథ్య, మనకు కనిపించేది భ్రమ అన్నది వేదాంతం! మనిషి మస్తిష్కమే ఈ విశ్వాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తోంది! మనం చూస్తున్నాం కనుకనే ఈ సృష్టి ఇలా దర్శనమిస్తోందని అది చెప్పింది!

అటు, బ్రహ్మ సత్యం జగన్మిధ్య అన్న శాశ్వత సత్యాన్ని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి! అసలు ఖగోళ విజ్ఞానానికి, మనిషి వివేకాన్ని జత చేయకపోతే, ప్రకృతి తత్వం, శాశ్వత సత్యం ఎన్నటికీ బోధపడవని హైందవ ధార్మికులు ఎప్పటి నుంచో ఘంటాపథంగా వాదిస్తున్నారు! పాశ్చాత్య పరిశోధకులకు కాస్త ఆలస్యంగానైనా ఈ దిశలో కనువిప్పు కలగడం ఆహ్వానించదగిన పరిణామం అంటారు ఆధ్యాత్మికులు!

విశ్వావిర్భావం జరిగి 13.7 బిలియన్ ఏళ్లు ఔతోంది! ఇన్నేళ్ల ప్రస్థానంలో భూగ్రహం కంటే ముందే అనేక గ్రహాలు వినువీధిలో ఏర్పడి ఉంటాయి! అక్కడ మనుగడలో ఉన్న ఇంటెలిజెంట్ బీయింగ్స్ టెక్నాలజీపరంగా మనకంటే ముందంజలో ఉండే అవకాశం లేకపోలేదు! ఇంత లాంగ్ కాస్మిక్ స్కేల్ పై ఏదైనా సాధ్యమే!

సో, హైలీ అడ్వాన్స్డ్ ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ ను కొట్టిపడేయలేమన్నది నేటి సైంటిస్టుల ప్రిడిక్షన్! విశ్వ యవనికపై శాస్త్రసాంకేతిక రంగాల్లో గ్రహాంతరవాసులు మనకంటే కనీసం వందేళ్ల ముందు నుంచి పురోగతిలో ఉన్నా, వాళ్లు అనేక అతీతశక్తులు కలిగి ఉండటం ఖాయం!

ఇక మనకంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే విశ్వాంతరాళాల్లో జీవం సంభవించి ఉంటే? వాళ్లు ఇప్పటికే అత్యంత శక్తివంతులుగా అవతరించి ఉంటారు! విశ్వ గతిని, సృజన స్థితిని శాసించే దశకు చేరుకుని ఉంటారు! సృష్టికి ప్రతిసృష్టి చేయగల సత్తాను సాధించి ఉంటారు!

అదిగో ఆ గ్రహాంతర నాగరిక జాతులే దైవికశక్తులు [DevinePowers] కలిగిన దేవుళ్ల లాంటి మనుషులు [GodLikeBeings] కావచ్చన్నది మోడ్రన్ సైన్స్ తాజా ఉద్ఘాటన! ప్రకృతిని వశం చేసుకుని దివ్యశక్తులు, మహిమలను సాధించిన గ్రహాంతర హేమాహేమీలు భూమిపైకి వచ్చి మన మధ్యలో అదృశ్యంగా తిరుగుతున్నారు అన్నది ఒక పరికల్పన! అలా మనసు వాళ్లు అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారేమో అన్నది మానవాళి ఒళ్లు గగుర్పొడిచే సందేహం!

సైన్స్ ప్రస్తావిస్తోన్న ఆ ఏలియన్సే దేవుళ్లనేది ఇతిహాసాల ఉవాచ! ఫలానా వాళ్ల అంశ ఇదీ! ఇదిగో ఈ వంశం చరిత్ర ఇదే అంటూ మనిషి మూలాలను సైతం గ్రహాంతర వాసులకు ముడిపెడుతూ హైందవంలో అనేక గాథలు, కథలు చెలామణిలో ఉన్నాయి!

కాగా, ఈ పర, అపర లోకవాసుల గురించి పురాణాలు చాలా స్పష్టంగా ప్రస్తావించాయి! కానీ, వెస్ట్రన్ వరల్డ్ వర్ణిస్తున్నంత అసహ్యంగా, జుగుప్సాకరంగా వాళ్ల రూపురేఖలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదు! బ్రహ్మ కుమారులైన సనక సనందులు, ఇంద్రాది దేవతలు, గంధర్వులు, అప్సరసలు, యక్ష, కింనర, కింపురుషులు, విద్యాధరులు, సిద్ధులు, ఋషులుగాని ఎవరికీ ప్రాచీన వాఙ్మయాలు వికృత రూపాలను ఆపాదించలేదు!

పాతాళలోకంలో రాక్షస, పిశాచ, నాగజాతి జీవుల చర్చ చేసినా, ఆ మానవాతీతుల [TranscendentalHumanBeings] ను ఋషులు మనకు కామరూపులుగా పరిచయం చేశారు! అంటే, ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోయే విద్యను తెలిసిన జీవులుగా అభివర్ణించారు! భూమితోసహా అంతరిక్షంలో 14 లోకాలున్నాయని అధర్వణ వేదం చెప్తోంది!

వీటిలో భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం [బ్రహ్మలోకం] మొదలైనవి ఊర్ధ్వ లోకాలు! కాగా, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకం [NetherWorld] అధః లోకాలు! అంతరిక్షంలో సూర్యకాంతి ప్రసరించే ప్రాంతమంతా ద్యులోకం!

ఇక్కడ మన పక్క లోకాలు ఉంటాయి! ద్యులోకం కొన్ని చిన్న లోకాల సమూహం. అందుకే ఇది 14 లోకాల లెక్కలోకి రాదు! ఇక్కడ ఉత్తరాకాశంలో గంధర్వులు, అప్సరసలు, విద్యాధరులు కింనర, కింపురుషులు, యక్ష, సిద్దసాధ్యులు నివాసం ఉండే పుణ్యలోకాలు ఉన్నాయి! దక్షిణాకాశంలో పితృ, రాక్షస, నరక, యమ, నాగుల లాంటి శతృ జీవులు నివాసం ఉండే లోకాలు ఉన్నాయి! తూర్పు ఆకాశంలో వసు లోకం ఉంటుంది!

ప్రాచీన విజ్ఞానం దేవుడిని నమ్మింది! ఆధునిక విజ్ఞానం ఏలియన్స్ ను నమ్ముతోంది! ఈ రెండూ కలగలిసిన అర్వాచీన విజ్ఞానం గ్రహాంతర దేవుళ్లంటోంది! ఇంతకీ వీటిలో ఏది సత్యం? నిజంగా కంటికి కనిపించడమే ప్రామాణికమైతే, పైన చెప్పిన ఏ ఒక్కళ్లూ ఈ చర్మచక్షువులకు కనిపించరు!

విజ్ఞానం, ఆధ్యాత్మికం అనుసరించే పంథాలు, నమ్మిన పద్ధతులు వేరైనా వాటి గమ్యం శాశ్వత సత్యాన్వేషణ వైపే అన్నది నిజం! సృష్టి గురించి తెలుసుకోవడమంటే, మానవుడు తనను తాను అవలోకనం చేసుకోవడం! కాస్త అటూ ఇటుగా శ్రీమద్భగవద్గీత సారం కూడా ఇదే! సకల జీవరాశిలో మానవజన్మ ఉన్నతం, ఉత్తమమైంది!

బ్రహ్మజ్ఞానం సంపాదించడమే మనిషి ప్రధాన కర్తవ్యమన్నది గీతోపనిషత్తులో భగవానువాచ! వేదాంతం చెప్పినట్లు అహం బ్రహ్మాస్మి అన్నా, తత్వమసి అన్నా ఒకటే! నేనే బ్రహ్మను, అది నేనే అని వాటి అర్థం! ఈ అనంత సృష్టిలో నిజం కల్పన కంటే వింతైనది [TruthIsStrangerThanFiction]! ప్రాచీన వాఙ్మయాలు పేర్కొన్న ఈ లోకాలన్నీ ఒక దానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నాయని మన పురాణాలు పేర్కొన్నాయి!

పుష్పకవిమానం [SpaceShipsAndUFOs] లాంటి రవాణా సాధనాల ద్వారా అంతరిక్షంలోని లోకాల మధ్య ఒకప్పుడు రాకపోకలు సాగేవని కొన్ని ఉదంతాలు వెల్లడిస్తున్నాయి! శూన్యంలో వెదజల్లినట్లు ఉన్న వివిధ గ్రహాల మధ్య సమయ విస్తరణ [TimeDilation] ను సైతం కొన్ని పురాణకథలు విడమర్చి చెప్తున్నాయి!

క్వాంటం ఫిజిక్స్ [QuantumPhysics] విప్లవంలో భాగంగా, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటున్న మనిషితో సహా ఇతర భౌతికరాశి మాయమవడం, టెలిపోర్టేషన్, గాల్లో పయనించడం, నీటిపై నడవడం లాంటి ట్రిక్స్, ప్రవేశానికి అవరోధాలుగా ఉండే మందమైన గోడల నుంచి చొచ్చుకుపోగల టన్నెలింగ్ [Tunneling] టెక్నిక్స్ వాళ్లకు ఆనాడే తెలుసని వాఙ్మయాలు ఉటంకించాయి!

మోడ్రనైజేషన్ గ్రాఫ్ పై సైన్స్ స్పీడ్, సమకాలీన చరిత్రలో ఆధునిక మానవుని పోకడలు చూస్తుంటే, రాబోయే వందేళ్లలో ప్రకృతిపై మరింత పట్టు సాధించి, ఎన్నో శక్తులను వశం చేసుకోవడం తధ్యం! తద్వారా మనుషులు సూపర్ నాచురల్ పవర్స్ ఉన్న మాయామశ్చీంద్రులుగా పరిణామం చెందడం ఖాయం!

ఈ విశాల సృష్టి గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనిషి ఒకనాడు అతీతశక్తిగా ఎదుగుతాడు! ఈ విశ్వాన్ని శాసించే స్థాయికి చేరుతాడు! 22 వ శతాబ్దపు తొలినాళ్ల నాటికి ఖగోళంలో సూపర్ హ్యూమన్ గా ఆవిర్భవిస్తాడు! భూగోళంపై హోమోసెపియన్ల ప్రస్థానం అటు వైపే సాగుతోంది, నో డౌట్!

(సూరజ్ కుమార్ భరద్వాజ్)

LEAVE A RESPONSE