– ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ బాధ్యతల ఆలోచన భేష్
(సుబ్బు)
ఉపాయం లేనివాడిని ఊరినుంచి వెళ్లగొట్టమని పెద్దల సామెత. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లకు గౌరవ వేత నం ఇచ్చి, వారిని ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించినట్లు! అసలు ఇలాంటి ఆలోచన రావడమే అద్భుతం.
నిజమే. ఒక ఐడియా జీవితాలను మార్చేస్తుంది. అది ఐడియా కంపెనీ స్లోగన్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. . ఎందుకంటే.. ట్రాన్సుజెండర్లు హైదరాబాద్ ట్రాఫిక్ చౌస్తాల దగ్గర చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక షాపుల నుంచి చప్పుట్లు కొడుతూ, డబ్బులు వసూలు చేసే తీరుతో వచ్చే ఇబ్బందులూ అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల సందర్భంలో, వాళ్లు చేసే యాగీ చెప్పనక్కర్లేదు. వేల రూపాయలు డిమాండ్ చేసి, అవి ఇచ్చే వరకూ అక్కడి నుంచి కదలని దృశ్యాలు ఎప్పటికీ హైదరా‘బాధే’. అప్పట్లో తార్నాకలో మర్రి చెన్నారెడ్డి ఇంటి వద్ద ట్రాన్స్‌జెండర్లు చేసిన రచ్చ ఆతరం వారికి ఇంకా గుర్తే. ఇక మిగిలినవారెంత?
అలాంటి దారితప్పిన సమాజాన్ని ఒక దరికి చేర్చి, వారికి జీవనోపాథి కల్పించాలన్న రేవంత్ ఆలోచన అభినందిచదగ్గదే. అందుకోసం వారికి హోంగార్డుల మాదిరిగా శిక్షణ ఇచ్చి, ట్రాఫిక్ వలంటీర్లుగా మార్చాలన్న ఆలోచన స్వాగతించదగ్గదే. అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్నది పక్కనపెడితే.. అసలు దారి తప్పిన అలాంటి మూడవ సమాజాన్ని, బాధ్యతాయుతమైన వక్తులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పమే గొప్పది. అంతా ముఖ్యమంత్రులవుతారు. కానీ గొప్ప ఆలోచనలు మాత్రం కొద్దిమందికే వస్తాయి. అందుకే శభాష్ ..రేవంత్!
స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఇంతటి కీలకమైన అడుగు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు.
ఇది పాలనలో సృజనాత్మకమైన ఆలోచనకు ఉత్తమ ఉదాహరణ. రెండు కీలకమైన సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నం.
భారతదేశంలోని అయిదు పెద్ద నగరాల్లో హైదరాబాద్‌లోనే అతి తక్కువ ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యతో, ఈ సమస్య మరింతగా తగ్గి ట్రాఫిక్ తగ్గింపునకు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహదపడుతుంది.
ట్రాన్స్‌జెండర్ల గుర్తింపు, నియామకం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్‌జెండర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ ప్రగతిశీలక చర్య ఆడ, మగా, ట్రాన్స్‌జెండర్ అనే వివక్ష లేదనేందుకు అత్యుత్తమ ఉదాహారణగా నిలుస్తోంది.
అంతేకాదు. వారిని సమాజంలో తలెత్తుకుని తిరిగే ఉత్తమ పౌరులుగా మారుస్తుంది. యాచన చేస అందరి ఛీత్కారాలతో బతికే కంటే, కష్టపడి సంపాదించే దాంట్లో ఉన్న ఆత్మగౌరవంలో వచ్చే కిక్కే వేరు.