Suryaa.co.in

Telangana

ఆదర్శవంతమైన జీవితాన్ని పాటించిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్

– మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ ’50 ఏళ్ల ప్రయాణం’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్; కొప్పుల ఈశ్వర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయాల్లో ఉన్నవారు, రాజకీయాల్లోకి రావాలనుకునే వారు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి. ఈశ్వర్ గారితో నాకు 24 ఏళ్ల అనుబంధం ఉంది. అయినా ఈ పుస్తకం చదివితే వారిలో ఉన్న ఇంకో కోణం కనపడింది.

ఈశ్వర్ అన్నలో మేము ఎప్పుడూ కోపం, అసహనం చూడలేదు. చాలా కూల్ గా, ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు. కానీ ఈ పుస్తకం చదివిన తరువాత ఆయనలో గొప్ప పోరాట యోధుడు కనిపించారు. ఈయనేనా అప్పట్లో కార్మికుల కోసం జావీదులు, జాఫర్ల మీద పోరాటం చేసింది అని అనిపించింది.

మేమంతా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ ఉద్యమంలో పనిచేశాం. కానీ కార్మిక ఉద్యమం, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వంటి మూడు ఉద్యమాల్లో పని చేసిన ఘనత కొప్పుల ఈశ్వర్ ది. అంతేకాక మూడు ఉద్యమాల్లో జైలుకి వెళ్లిన వ్యక్తి మన ఈశ్వర్ అన్న. కూలీ నుంచి కాబినెట్ మంత్రి వరకు ఈశ్వర్ అన్న ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించిన పుస్తక రచయిత మల్లన్నకి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

రాజకీయాల్లో చాలా మంది ఆదర్శమైన మాటలు మాట్లాడతారు. కానీ ఆదర్శవంతమైన జీవితాన్ని పాటించిన వ్యక్తి ఈశ్వర్ అన్న. ఈశ్వర్ అన్న సతీమణి స్నేహలత గానే మాకు తెలుసు. కానీ ఆమె అసలు పేరు కోకిల అని ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. ఆమె వల్లనే ఈశ్వర్ అన్న జీవితం మారింది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నా కూడా, నవరాత్రుల్లో దేవీ దీక్ష తీసుకునేంత భక్తి ఈశ్వర్ అన్నలో ఉంది.

బీఆర్ఎస్ తరపున కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 6 సార్లు ఓటమి ఎరుగని నాయకుడిగా అద్భుత విజయాలు సాధించారు. మాది అన్నదమ్ముల అనుబంధం. నేను ఏ శాఖకి మంత్రి గా ఉన్నా తన ప్రజల కోసం పట్టుబట్టి వెంట పడి పని చేయించుకునేవారు. ప్రపంచంలో నే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని కొప్పుల ఈశ్వర్ అన్న కేసీఆర్ నాయకత్వం లో ప్రతిష్టించారు. కేసీఆర్ లేని లోటుని తెలంగాణ ఎలా ఫీలవుతుందో, ధర్మపురి ప్రజలు కూడా ఈశ్వర్ అన్న లేని నియోజకవర్గాన్ని చూసి బాధపడుతున్నారు.

తప్పకుండా మంచి రోజులు వస్తాయి. గతం కంటే ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు మరింత సేవ చేస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. ఈ తరం నాయకులు ఆయన నుంచి ఈ గుణాన్ని నేర్చుకోవాలి.

LEAVE A RESPONSE