– కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదు?
– బిల్లా రంగాలు ఆటోలలో తిరిగి మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు
– కారు షెడ్డుకు పోయింది
– బోరబండ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గత ఎన్నికల్లో అజారుద్దీన్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇచ్చి మీ ముందుకు తీసుకొచ్చా.
కారు షెడ్డుకు పోయిందని బిల్లా రంగాలు ఆటోలలో తిరిగి మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ కొత్తగా జూబ్లీహిల్స్ లో సమస్యలు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని మీ ముందుకు వస్తున్నారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా చనిపోతే ఏకగ్రీవంగా చేయాలంటే అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కెసీఆర్. పేదలను ఆదుకున్న చరిత్ర పీజేఆర్ ది.
ఇక్కడి బస్తీల్లో ఏ తలుపు తట్టినా పీజేఆర్ సాయం పొందినవారే ఉంటారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆరెస్ ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? ఈ పరిస్థితికి కారణం మీరు కాదా? ఇప్పుడు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెప్తే ఇక్కడి జనం నమ్మరు. మాయమాటలు చెప్పే మీలాంటి వాళ్లకు ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్తారు.
అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నది కాంగ్రెస్ కాదా? ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది నిజం కాదా? ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆరెసోళ్లు మాట్లాడుతున్నారు. ఇదీ వాళ్ల గలీజ్ బుద్ధి.
2014 నుంచి వాళ్లు ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో సీతక్క, కొండా సురేఖను మంత్రి పదవులు ఇచ్చాం. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చాం. మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా కేటీఆర్ మీ సమస్యలు పరిష్కరించలేదు.
బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదు? బోరబండకు వచ్చి ఎందుకు సమస్యలు పరిష్కరించలేదు?బీజేపీ, బీఆరెస్ ది ఫెవికాల్ బంధం.
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన కేటీఆర్.. సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా? ఇవన్నీ వాళ్ల చెల్లెలే బయటకు వచ్చి చెబుతుంది. ఏ ఆడబిడ్డయినా పుట్టింటిపై ఆరోపణలు చేయదు. ఎంత కష్టపెడితే ఆ ఆడబిడ్డ వీళ్ల బాగోతం బయటకు వచ్చి చెబుతుంది?
సొంత చెల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా? మీ బిడ్డ నవీన్ యాదవ్ ను గెలిపించండి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరు పెట్టాలని అడుగుతున్నారు. విజయయాత్రకు మళ్లీ వస్తా. ఈ చౌరస్తాకు పీజేఆర్ చౌరస్తాగా పేరు పెట్టుకుందాం. మీ ప్రాంతంలో పుట్టిపెరిగిన నవీన్ ను గెలిపించండి. ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేస్తా.
మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడు. మీ మధ్యలో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తాడు. మీకు అండగా ఉండి మీకు సేవ చేస్తాడు. మీరు ఆశీర్వదిస్తే వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నవీన్ ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించండి.