– హాస్పిటళ్ల పేరుతో భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేశారు
– ఆ డబ్బులను హాస్పిటళ్లకు ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు
– కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: పండగపూట బస్తీ దవాఖాన్లపై కేటీఆర్ దండుపాళ్యం ముఠా దాడి చేసింది. హాస్పిటల్స్‌కు వెళ్లి డాక్టర్లు, సిబ్బందిని ఇబ్బంది పెడుతూ వైద్య సేవలకు ఆటంకం కలిగించారు. పేదల హాస్పిటళ్లపై బురద జల్లుతూ, కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చేందుకు శత విధాలా ప్రయత్నం చేశారు. యూసఫ్‌గూడ బస్తీ దవాఖానలో ఓ జోకర్ తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు.
మెడిసిన్‌పై ఉన్న మానుఫాక్చరింగ్ తేదీలను, సప్లై తేదీలుగా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఒకడేమో బస్తీ దవాఖాన్లలో అసలు మందులే లేవంటడు. ఇంకొకడేమో ఎక్స్పైర్డ్ మెడిసిన్ ఇస్తున్నారంటూ ప్రజలకు ఆందోళనకు గురి చేస్తడు. ఎవరికి లబ్ది చేకూర్చేందుకు ఈ తప్పుడు ప్రచారం?తప్పుడు ప్రచారంతో ప్రజలకు బస్తీ దవాఖాన్లపై అపనమ్మకం, భయం కలిగించి వారిని ఆ హాస్పిటళ్లకు రాకుండా చేస్తే ఎవరికి ప్రయోజనమో ప్రజలే ఆలోచించుకోవాలి.
పదేండ్లు అధికారంలో ఉండి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లకు కొమ్ము కాసి, వేల కోట్లకు పడగలెత్తేలా వారికి దన్నుగా నిలిచిన నీచులు ఎవ్వరో ప్రజలు గుర్తు చేసుకోవాలి. జిల్లాకో నిమ్స్ హాస్పిటల్ కడుతామని 2014 మేనిఫెస్టోలో పెట్టారు.. ఏ జిల్లాలో నిమ్స్ వంటి హాస్పిటల్ కట్టారో చూపించండి?
2016 ఫిబ్రవరిలో, అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ గారు గాంధీ హాస్పిటల్లో పర్యటించి, ఇదేం హాస్పిటలయ్యా అని ముక్కున వేలేసుకున్నారు. హాస్పిటల్ నడిపే తీరు ఇదేనా అంటూ నాటి ప్రభుత్వాన్ని చీ కొట్టారు. అప్పటివరకూ మొద్దు నిద్రలో ఉన్న కేసీఆర్, నిద్ర లేచిండు. హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడుతాం అని ఓ ప్రకటన చేసిండు.
మళ్లీ 2020లో కరోనా వచ్చే వరకు కూడా ఆరోగ్యశాఖను, హాస్పిటళ్లను పట్టించుకున్న పాపానపోలేదు. కోవిడ్ వచ్చాక నగరం చుట్టూ 4 టిమ్స్‌లు అంటూ.. పాత హామీనే కొత్తగా ప్రకటించిండు. గచ్చిబౌలి స్టేడియానికి సంబంధించిన ఓ భవనానికి టిమ్స్ అని బోర్డు తగిలించారు. నాలుగు టిమ్స్‌ల్లో ఒక టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ జబ్బలు చరుచుకున్నారు.
కోవిడ్ తగ్గగానే గచ్చిబౌలి టిమ్స్ మూత పడేశారు. ఇక మిగిలిన 3 టిమ్స్‌ల గురించి 2022 వరకూ అసలు ఊసే లేదు. ప్రజలు, నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంతో 2022 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి హడావుడిగా సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌లకు శంకుస్థాపన చేశారు. హాస్పిటళ్ల పేరుతో భూములు బ్యాంకులకు తాకట్టు పెట్టి అడ్డగోలుగా అప్పులు చేశారు. ఆ డబ్బులను హాస్పిటళ్లకు ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు.
2023 చివరి వరకూ అధికారంలో వాళ్లే ఉన్నారు. 2023లో ఎన్నికల నాటికి కనీసం 30 శాతం పనులను కూడా పూర్తి చేయలేదు. కానీ, నిర్మాణ వ్యయం అంచనాలను అడ్డగోలుగా పెంచేసి జేబులు నింపుకున్నారు. నిమ్స్ ఎక్స్పాన్షనల్ ప్రాజెక్టు పనులు పది శాతం కూడా పూర్తి చేయలేదు. ఓ వైపు వాస్తవాలు ఇలా ఉంటే.. మరోవైపు టిమ్స్‌లు మేమే ప్రారంభించాం, 90 శాతం పనులు పూర్తి చేశాం అంటూ ఈరోజు కేటీఆర్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పిండు.
అబద్దాలు చెప్పడం కేసీఆర్ ఫ్యామిలీకి పుట్టుకతో వచ్చిన విద్య. వారి అబద్దాలకు గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కానీ, తెలంగాణ ప్రజానీకం ఈ పచ్చిమోసగాళ్ల మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటుతో వాత పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సారును కారును జీరోను చేశారు. రేపు రాబోయే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారు.
త్వరలోనే సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించబోతున్నాం. సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట్‌లో అత్యాధునిక వసతులు ఉన్న హాస్పిటళ్లను ప్రజలకు అందించేందుకు సిద్ధం చేస్తున్నాం. మరోవైపు దశాబ్దాల ఉస్మానియా హాస్పిటల్ కలను నేరవేరుస్తున్నాం. సుమారు 2700 కోట్ల వ్యయంతో అద్భుతమైన హాస్పిటల్‌ను నిర్మిస్తున్నాం.
ఆరోగ్యశ్రీ ద్వారా వేల కోట్ల విలువైన వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లకు నెలకు సగటున 57 కోట్లు ఇస్తే, మేము ఈరోజు నెలకు వంద కోట్లు చెల్లిస్తున్నాం. హాస్పిటళ్ల సంఖ్య పెంచినం.. ప్రొసీజర్ల సంఖ్య పెంచినం.. 5 లక్షల లిమిట్‌ను 10 లక్షలు చేసినం. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు పునర్వైభవం తీసుకొచ్చే పనిలో మేము ఉంటే, ప్రభుత్వ హాస్పిటళ్లను బదనాం చేస్తూ, శవాల మీద పేలాలు ఏరుకునే పనిలో వారున్నారు.