గుండెను పిండేసే విషాదం! ఒక రోజు వ్యవధిలో, ఒకే కుటుంబంలో రెండు మరణాలు! అందులోనూ బాబాయ్ కోసం ఆసుపత్రిలో సేవ చేస్తూ అబ్బాయి గుండె ఆగిపోవడం అత్యంత బాధాకరం
కన్నీటి సాక్షిగా… ఆగిపోయిన గుండె!
తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లుగా నిలిచిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలింది.
టీడీపీ ఉపాధ్యక్షులు, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు (75) బ్రెయిన్ స్ట్రోక్తో గత పది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నారు. విజయవాడలోని ఆసుపత్రిలో ఆయనకు కన్నకొడుకులా అన్నీ తానై సేవ చేస్తున్నాడు… వారి అన్నగారి కుమారుడు, యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ . కానీ ఆ భారాన్ని, బాబాయి పడుతున్న వేదనను భానుచందర్ మనసు తట్టుకోలేకపోయింది.
“నా బాబాయి ఇలా మంచం మీద ఉండటం నేను చూడలేను దేవుడా!” అని ఆయన గుండె ఎంతగా ఘోషించిందో ఏమో! చికిత్స పొందుతున్న బాబాయిని సేవలో, గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆ యువ నాయకులు. అదే ఆసుపత్రిలోనే హఠాన్మరణం చెందారు.
ఆ రోజు రాత్రి (అక్టోబర్ 19, 2025) భానుచందర్ గుండె ఆగిపోయింది. ఆ దుర్ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే, చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు గారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
బాబాయిని అలా చూస్తూ తట్టుకోలేక భాను ఆగిపోయాడు… ఆ అబ్బాయి దూరమయ్యాడని తెలుసుకోకుండానే బాబాయ్ తుది శ్వాస విడిచారు.
ఒక రోజు తేడాలో, ఒకే ఆసుపత్రి ప్రాంగణంలో, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మీయులను కోల్పోయిన ఆ కుటుంబం పడే శోకం మాటల్లో చెప్పలేనిది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, టీడీపీ దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ ఇన్ చార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిబద్ధతతో పార్టీ సేవలో తరించిన సుబ్బానాయుడు గారి మరణం, అల్లంత ఎత్తు ఎదగాల్సిన యువ నాయకుడు భానుచందర్ అకాల మరణం… కావలి నియోజకవర్గంలో, తెలుగుదేశం పార్టీలో తీరని విషాదాన్ని, అగాధాన్ని నింపింది.
వారు ఇద్దరూ పార్టీ సేవలో తుది శ్వాస విడిచారు. ఆ కుటుంబానికి తీరని లోటు.
ఈ కష్టకాలంలో మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు, మాలేపాటి భానుచందర్ కుటుంబ సభ్యులకు ఆ దేవ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు యావత్తు పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.