Suryaa.co.in

Features

సమన్వయలోపమే అసలు సమస్య!

వైకుంఠ దర్శనానికి వచ్చిన ఆరుగురు భక్తులు అకాలమృత్యువాత పడటం, డజన్ల సంఖ్యలో క్షతగాత్రులవడం వెంకన్న భక్తుల మనసు కలచివేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ప్రకటించడం మంచిదే. దర్శనభాగ్యం లభించని క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అభినందించాల్సిందే. ఆ రకంగా అయినా వారికి స్వాంతన కలిగించినట్టయింది.

గతంలో ఇంతకు మించి భక్తులు అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్ని లక్షలమంది భక్తులు కొండకు వచ్చినా, కొన్ని కష్టాలున్నప్పటికీ దైవదర్శనం చేసుకుని సంతృప్తిగా వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదు. గతంలో తిరుమల ఘాట్రోడ్లో 36 మంది భక్తులతో బస్సు లోయలో పడింది. అయినా ఒక ప్రాణం కూడా తీసుకోకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కాపాడారు.

గత వైసీపీ ప్రభుత్వం లో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా అనుసరిస్తున్న విధివిధానాలను గుడ్డిగా ఇప్పటి అధికారులు, పాలకమండలి పాటించడం పెద్ద తప్పు. వైకుంఠ ఏకాదశి , ద్వాదశి కాకుండా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా 10 రోజులు చేయడం అపశృతులకు మూలం.

గత ఈవో ధర్మారెడ్డి తప్పుడు ఆగమాలతో, సాంప్రదాయాలను పూర్తి విరుద్ధంగా చేయడంతో, గత వైసీపీ ప్రభుత్వం తలమునకలై పోయింది. వాటిని గుడ్డిగా నమ్మి పది రోజులు వైకుంఠ ద్వారం తెరవడం.. ఆగమ సలహాలను పాటించకపోవడం.. ఇప్పుడు ప్రభుత్వానికి మచ్చగా మిగులుతుందని పలువురు శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వారి ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే.

గత ఈఓ ధర్మారెడ్డి అమలుచేసిన విధానాలను కొనసాగించడమే తప్పు. పాత విధానాలే కొనసాగిస్తే, ఇక కొత్త పాలకమండలి ఉన్నది ఎందుకు? పోనీ తిరుపతిలో టోకెన్ కౌంటర్లు ఏర్పాటుచేశామన్న విషయాన్ని ఈఓ, ఏఈఓ సీఎంకు చెప్పారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి అధికారులే సొంంత నిర్ణయాలు తీసుకుని, ఆరుగురు అమాయక భక్తుల చావుకు కారణమయ్యారని అర్ధమవుతుంది.

ఈ ఘోరానికి ముఖ్య కారణం ఫ్రీ దర్శనం నిలిపివేయడం.. నడకదారి దర్శనాలను నిలిపివేయడంతో, తిరుమలలో ఉన్న 32 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ 32 కంపార్ట్మెంట్లు ఖాళీ లేకుండా భక్తులతో నిండి ఉంటే, తిరుపతిలో ఇంత గుంపులు గుంపులుగా భక్తులు ప్రత్యక్షమయ్యేవారు కాదు.
అలా గుంపులు గుంపులుగా చేరుకున్న భక్తులను బందెల దొడ్డిలో తోలినట్టుగా పార్కులోకి పంపడం, భక్తుల ఆవేదన. తొక్కిసలాట జరపకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసు వ్యవస్థ టిటిడి వ్యవస్థ పై పలు రకాల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

చైర్మన్ , ఈవోలు ప్రచారాలకే పరిమితమై, సామాన్య భక్తులకు పెద్ద పీట వేశానంటూ.. ఫ్రీ దర్శనా లు , కాలి నడకదారి దర్శనాలను నిలిపివేయడం… కలసి వెరసి వైకుంఠ ఏకాదశి దర్శనాల విషయంలో ఘోర వైఫల్యానికి, పెను విషాదానికి కారణమవడం విచారకరం.

చైర్మన్- ఈవో అనుభవ రాహిత్యం, ఆధిపత్యపోరుతోనే ఈ అపశృతి చోటు చేసుకుందన్న విమర్శలపై, ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమిది. కనీసం భక్తుల ప్రాణాలు కాపాడేందుకయినా, అందరూ కలసి సమన్వయంతో వ్యవహరించటం మంచిదన్న విజ్ఞుల సూచనలు పాటించడం టీటీడీ పెద్దల బాధ్యత.

చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓల సమర్ధతపై నమ్మకం ఉంచి.. వారికి బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మకాన్ని వమ్ము చేయడం శ్రేయస్కరం కాదు. ఇది ఒకరకంగా ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడమే. ఫలితంగా ముఖ్యమంత్రి ఎంపిక సరైంది కాదన్న అపవాదును ఎదుర్కోవలసి వస్తుంది. బాధ్యత తెలియని వారికి పదవులిచ్చారన్న నింద ఆయన పడాల్సి వస్తుంది. ఆరుగురు భక్తుల మృతి తర్వాత రాజకీయ ప్రత్యర్ధుల నుంచి, ఇప్పటికే అలాంటి విమర్శలు మొదలవడాన్ని విస్మరించకూడదు. అందుకే ఆయన, బాధ్యత తీసుకున్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా అని కటువుగా వ్యాఖ్యానించవలసి వచ్చింది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భక్తుల మనసులో గూడుకట్టుకున్న అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. బోర్డులో పెద్దల మధ్య సయోధ్య లేదన్న పవన్ వ్యాఖ్యలను గౌరవించి, వ్యవస్థను సరిదిద్దుకోవలసిన బాధ్యత బోర్డు పెద్దలదే. జరిగిన విషాదానికి క్షమాపణలు కోరిన పవన్ రాజనీతిజ్ఞత, హుందాతనం, మానవత్వాన్ని మెచ్చుకోవలసిందే.

నిజానికి ఆ బాధ్యత ఈఓ, ఏఈఓ, పాలకమండలిది. ప్రధానంగా దేవదాయశాఖ మంత్రిది. కానీ తన శాఖకు సంబంధం లేకపోయినా బాధితులు, మృతుల కుటుంబాన్ని పరామర్శించి.. జరిగిన దారుణానికి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పిన పవన్ పెద్దమనసును అభినందించడం అందరి బాధ్యత.

భక్తులు కోటి ఆశలతో వచ్చి క్యూలైన్లలో నిలబడితే, పోలీసులు వారిని అనాగరికంగా, అమానుషంగా లాగేయడం దారుణం. తిరుపతి క్యూలైన్లలో పోలీసుల దాదాగిరి వీడియోలలో చూసిన వారికి, భక్తులపై టీటీడీకి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేసింది.

పోలీసులయినా, బోర్డు అధికారులయినా భక్తులకు సేవకులే తప్ప, పెత్తందారీలు కాదు. భక్తులిచ్చే కానుకలతోనే వారికి జీతాలిస్తున్న వైనాన్ని విస్మరించడం విచారకరం. అసలు భక్తులను నియంత్రించే విషయంలో, పోలీసు శాఖ తమ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం లేదన్న వాస్తవం తాజా ఘటనతో తేలిపోయింది. ఇకనయినా డ్యూటీలు వేసే పోలీసులకు.. భక్తులతో నాగరికంగా, గౌరవంగా ప్రవర్తించడం నేర్పితే మంచిది.

చైర్మన్, ఎస్పీ , ఈవో, అడిషనల్ ఈవో, విజిలెన్స్ ఉన్నతాధికారి అందరూ కొత్తవారు. దానితో అనుభవం లేకపోవడం.. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుపోవడం తీసుకోక పోవడం.., వారి సూచనలు పాటించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందన్న విమర్శలను తేలిగ్గా తీసేయకూడదు. ఏ వయసువారైనా తెలియని విషయాలు తెలుసుకోవడం సహజం. తాము సర్వజ్ఞులం అనుకోవడం మంచిది కాదు. పదవులనేవి అశాశ్వతం. చేసిన పనులే శాశ్వతం. కానీ టీటీడీ వ్యవస్థలో అది లోపించిందని, దానికి ఈ ఘటనే కారణమన్న నిందల నుంచి ఇకనయినా విముక్తి పొందితే, అది తిరుమల కొండ ప్రతిష్ఠకే మంచిది.

– డాక్టర్ ఓ.వి.రమణ
టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు,
తెలుగుదేశం పార్టీ నాయకులు

LEAVE A RESPONSE