-డోన్ ను డాన్ లకు అడ్డాగా మార్చిన బుగ్గన
–టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. మహిళా జడ్జిని వేధించే స్థాయికి ఏపీలో భద్రత దిగజారడం సిగ్గుచేటు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచారాలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసినా జగన్ రెడ్డి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందనే నమ్మకం లేదంటే అందుకు జగన్ రెడ్డి పాలనా వైఫల్యమే కారణం.
మంత్రి బుగ్గన ఇలాఖా డోన్ లో మహిళా జడ్జిపై మందుబాబులు వీరంగం సృష్టించారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నట్టు? హోంగార్డును వెంట బెట్టుకుని ఆటోలో వెళుతున్న జడ్జిని మందుబాబులు అడ్డుకుని వేధించారు. అడ్డుకున్న హోంగార్డును తన్నారు. దిక్కుతోచని స్థితిలో మహిళా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదు. జడ్జికే రక్షణ కల్పించలేని జగన్ రెడ్డి సామాన్య మహిళలకేం భద్రత కల్పిస్తాడు?
మహిళా జడ్జి ఫిర్యాదును సుమోటోగా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. జడ్జికి వేధింపులపై దినపత్రికల్లో వచ్చినా ప్రభుత్వం కానీ, ఆర్థికమంత్రి కానీ స్పందించకపోవడం దేనికి సంకేతం? ఆర్థిక శాఖ కాకుండా అన్నింటిపై స్పందించే బుగ్గనకు సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలీదా? ఘటనపై మంత్రి బుగ్గన స్పందించకపోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.
గతంలో కానిస్టేబుల్ భార్య, ఎస్ ఐ భార్యపైనా ర్యాగింగ్ జరిగితే చర్యల్లేవు. కేఈ, నీలం సంజీవరెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన డోన్ ను అత్యాచారాలు, డ్రగ్స్ మాఫియాలకు అడ్డాగా కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్చేశాడు.మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై 52 వేలకు పైగా నేరాలు జరిగాయంటే ఆడబిడ్డల రక్షణలో జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అత్యాచారాలు 3,372, గ్యాంగ్ రేప్స్ 39, దాడులు, 14,438, యాసిడ్ దాడులు 9, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు 6604 , మిస్సింగ్ కేసులు 22,278 చోటుచేసుకున్నాయి.
మహిళలపై నేరాలు పెరిగిపోయాయని లోక్ సభలో హోంశాఖ ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? చీరాలలో మహిళను వివత్స్రను చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మహిళలను కిరాతకంగా హతమార్చిన వారిపై చర్యలు తీసుకోని మీకు మహిళా ఓట్లు కావాలి. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు.
కోర్టు ధిక్కరణ కేసులు, రైతు ఆత్మహత్యలు, మహిళలపై నేరాలు, దళిత, గిరిజనులపై దాడుల్లో ఏపీని నెంబర్ వన్ చేసిన హీన చరిత్ర జగన్ రెడ్డిదే. ఇప్పటికైనా డోన్ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి. మహిళా జడ్జి ఫిర్యాదును సుమోటోగా తీసుకుని తక్షణమే విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.