– విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం
– శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి : కందుకూరులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్షపడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ నాయుడు హత్యను సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అమానుషమని, అమానవీయం అని వ్యాఖ్యానించారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని అన్నారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని ఆదేశాలు ఇచ్చారు.
రూ.5 లక్షల చొప్పున పరిహారం.. 2 ఎకరాల చొప్పున భూమి
లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వీరితో పాటు దాడిలో గాయపడిన వారికి కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. లక్ష్మీ నాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లక్ష్మీ నాయుడి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాటిజ్ చేయాలని చంద్రబాబు అధికారులను సూచించారు. అంతే కాకుండా ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని అన్నారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని చెప్పారు. భార్గవ్‌కు కూడా రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా వ్యవహారాల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భధ్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.