– ఎన్టీఆర్ హంతకులే.. హెల్త్ యూనివర్సిటీపై కపట ప్రేమ
– జిల్లా అనేది పెద్దది.. యూనివర్సిటీ అన్నది చిన్నది
– ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే నా ఓటు
– ఎన్టీఆర్ పై చంద్రబాబులా ద్వేషంగానీ, శత్రుత్వంగానీ జగన్ కి లేవు
– ఎన్టీఆర్ పై జగన్ కి గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు
– ఆరోగ్యశ్రీ సృష్టికర్త, రూపాయి వైద్యుడిగా పేరు గడించిన వైఎస్ఆర్ పేరు పెట్టడమే సముచితం
– ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడ్డవారు ఆయన్ను గౌరవిస్తారా..!?
– ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం.. ఆ తర్వాత చెత్తబుట్టలో వేయడం పరిపాటి
– 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఎన్టీఆర్ గౌరవార్థం ఏం చేశారు..?
– ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్ళే.. నేడు ఆయన పేరు వాడుకుంటున్నారు
– ఎన్టీఆర్ ను వెనుక నుంచి కత్తితో పొడిచినవారే.. ముందుకొచ్చి దండలు వేస్తున్నారు
– బాబుకు వంతపాడి కన్న తండ్రినే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంపుకున్నారు
– రక్తం పంచుకున్నంత మాత్రాన, ఆయన గౌరవాన్ని కాపాడలేని మీరు బిడ్డలు ఎలా అవుతారు?
– ఎన్టీఆర్ చావుకు కారణమైనందుకు.. ఆయన బిడ్డలుగా ఇప్పటికైనా మీకు పశ్చాత్తాపం కలగదా..?
– అధికార దాహంతోనే చంద్రబాబు దుష్ప్రచారాలు.. వెన్నుపోటుదారుల మాటలు ప్రజలు నమ్మొద్దు
– ఎన్టీఆర్ కు అన్యాయం చేయనని నీ కొడుకు మీద ప్రమాణం చేసి మాట తప్పావా లేదా బాబూ..?
– నేను అడ్డుపడి ఉంటే.. ఎన్టీఆర్ కేబినెట్ లో చంద్రబాబుకు ఫైనాన్స్, రెవెన్యూ కీలక శాఖలు దక్కేవా..?
– ఎన్టీఆర్ జీవితంలోకి నేను వచ్చాకే వసంతం
– నాడు టెక్కలి సీటును ఎన్టీఆర్ ఆఫర్ చేసినా నేను తీసుకోలేదు
– ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు నా కాళ్ళు మొక్కినవారే.. ఇప్పుడు తిడుతున్నారు
– రామోజీ, రాధాకృష్ణలకు బుద్ధీ, జ్ఞానం ఉందా.. వెన్నుపోటును అధికార మార్పు అంటారా..?
– బాబుతో కుమ్మక్కై రాజగురువు రామోజీ నాడు ఎన్టీఆర్ పై తప్పుడు రాతలు.. నేడు జగన్ గారిపైనా అదే దుష్ప్రచారం
– ఎన్టీఆర్ ను బాబు అండ్ కో.. హత్య చేశారా లేదా రామోజీ, రాధాకృష్ణా..?
– కులానికి కూడా గౌరవం తెచ్చిన ఒక పెద్దను సజీవ దహనం చేసింది మీరే కదా..?
– నీ పనికిమాలిన చెత్తపలుకులకు నేను భయపడను
– స్పీకర్ పదానికి అవమానం తెచ్చిన వ్యక్తి యనమల రామకృష్ణుడు
– వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి
ఎల్లో మీడియా బరితెగింపునకు పరాకాష్ట
టీడీపీ, వారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో.. గత నాలుగురోజులుగా నాపైనా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. “ఎన్టీఆర్ అసలు నన్ను వివాహమే చేసుకోలేదని, నందమూరి ఇంటిపేరు వాడుకునే హక్కులేదని” అతి దారుణంగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌కి ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి, ఆయనను అధికారం నుంచి లాగేసినవాళ్లే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన ద్రోహంపై.. అప్పటి తరం.. ఇప్పుడొస్తున్న యువతరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అందుకే ఈ ప్రెస్ మీట్. ఇప్పటి తరం, చంద్రబాబు, టీడీపీ వాళ్లు చెప్పే అబద్ధాలనే నమ్ముతూ అవే నిజాలు అని నమ్మే అవకాశం ఉందని వాస్తవాలు చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను. కానీ చరిత్ర ఎప్పుడూ చరిత్రే. దాన్ని ఎవరు చెరిపివేయాలనుకున్నా చెరపలేరు. ఎన్టీఆర్ పేరును ఎంతగా అణగదొక్కాలని చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ప్రయత్నించినా… ఆ చరిత్ర మళ్లీ పునరావృతమై మరింత విజృంభిస్తోంది. దానికి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే ఉదాహరణ. వాళ్లు చేసిన పాపాలు, దుష్కర్మలు మళ్లీ మళ్లీ బయటపెట్టుకుంటున్నారు.
పాముకు(బాబు) పాలు పోస్తున్నావంటూ నాడే ఎన్టీఆర్ హెచ్చరించారు
చంద్రబాబుకు వంతపాడి కన్నతండ్రినే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంపుకున్నారు. ఎన్టీఆర్ ను వెనుక నుంచి కత్తితో పొడిచిన వారే.. ఇవాళ ముందుకు వచ్చి ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన బిడ్డలైపోరు. ఆయన గౌరవాన్ని కాపాడకుండా, ఆయన్ను అవమానిస్తుంటే కనీసం అడ్డుకోని వారు, అడ్డు చెప్పని వారు బిడ్డలెలా అవుతారు..? ఎన్టీఆర్‌పై చెప్పులు వేసి, ఆయనను మానసికంగా క్షోభకు గురి చేసి ఆయన మరణానికి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కారణం అయ్యారు. ఆ విధంగా ఎన్టీఆర్ ని హత్య చేశారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అసమ్మతి వచ్చేస్తుందా?
నాకే గనుగ అధికార ఆపేక్ష ఉంటే.. చంద్రబాబుకు కీలక పదవులు వచ్చేవా అని రాధాకృష్ణను, రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు మంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలతో కట్టు కథలు రాస్తున్న విషయం ఆ వర్గం మీడియాలో చూస్తూనే ఉన్నాం కదా?. చంద్రబాబు అనే పాముకు పాలుపోసి పెంచుతున్నావంటూ అప్పట్లోనే ఎన్టీఆర్ నన్ను హెచ్చరించారు. నాడు ఎన్టీఆర్ ఎక్కడ ప్రధానమంత్రి అవుతారో అన్న భయంతో రామోజీరావుతో, ఢిల్లీలో కొంతమంది పెద్దలతో కలసి వీరంతా కుట్రలు చేయలేదా? రాధాకృష్ణ పిచ్చిరాతలకు కాలం చెల్లే రోజులు వస్తాయి. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులకు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా నోళ్లు మూసుకుంటే మంచిది.
ఎన్టీఆర్ పేరు మార్చాలని రాధాకృష్ణ ఇంటర్వ్యూలో బాబే చెప్పాడు కదా..!
హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్పుపై ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే సవివరంగా, చాలా స్పష్టంగా చెప్పారు. పేరు మార్చారంటూ ఎన్టీఆర్ హంతకులు బాధను అభినయిస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాష్ట్రంలో ఏదైనా శాశ్వత పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టాడా?. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైన బాబు, ప్రజల దృష్టిని మరల్చడానికే నాడు రాజీవ్‌గాంధీ హెల్త్ యూనివర్శిటీగా ఉన్న దాని పేరు మార్చి అప్పటికప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఎంత అవమానకర రీతిలో మాట్లాడాడు. ఎన్టీఆర్ వర్శిటీకి ఆయన పేరు తొలగించడానికి రాధాకృష్ణతో కలిసి కుట్రలు చేసింది రాష్ట్ర ప్రజలంతా టీవీల్లో చూడలేదా..?. ఎన్టీఆర్ గురించి, మీరిద్దరూ ఎంత భయంకరమైన భాష ఉపయోగించారు. హెల్త్ వర్శిటీ పేరు మార్చేయాలని మీరు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు కదా… ఇక పేరు మార్పుపై అడిగే నైతిక హక్కు మీకెక్కడది? ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే హక్కు కూడా చంద్రబాబుకు లేదు.
జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నదే నా కోరిక
జిల్లా పెద్దదా.. యూనివర్సిటీ పెద్దదా అని ఎవర్ని అడిగినా చెబుతారు.. జిల్లానే పెద్దది అని. అటువంటిది ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడితే మీకెందుకు బాధ..?. ప్రభుత్వం కనుక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలా? లేక హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలా అని ప్రతిపాదించి ఉంటే.. జిల్లాకే ఎన్టీఆర్ పేరు ఉండాలని నేను కోరుకుంటాను. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు అభినందించని వీళ్లు… ఇవాళ తిట్టడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడంతోనే ముఖ్యమంత్రి జగన్ కి ఎన్టీఆర్ పై ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయో అర్థం అవుతుంది.
ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది మీరు కాదా..?
ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారతరరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం.. ఆ తర్వాత దానిని చెత్తబుట్టలో వేస్తారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడింది మీరు కాదా..? ఈ విషయాన్ని ఇటీవల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వొద్దని అప్పటి ప్రధాని వాజ్ పేయ్ కు చంద్రబాబే చెప్పాడు. ఎన్టీఆర్ కు రావాల్సిన అవార్డులే రాకుండా అడ్డుపడి, అవమానించి.. ఈరోజు ఆయన పేరు గురించి రచ్చ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి..?. జూనియర్ ఎన్టీఆర్ ను అవసరానికి వాడుకుని, అవసరం తీరాక అన్నివిధాలా అవమానించింది కూడా చంద్రబాబు, వారి కుటుంబ సభ్యులే.
వైఎస్ఆర్ పేరే సముచితం
పేదల డాక్టర్ గా, రూపాయి వైద్యుడిగా పేరు గడించి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి, మెడికల్ కాలేజీలను తెచ్చి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ గారి పేరును యూనివర్సిటీకి పెట్టడమే సముచితం. ఎందుకంటే, వైఎస్ఆర్ తనయుడు, నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగం అభివృద్ధి కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ, విశేష కృషి చేస్తున్నారు. చంద్రబాబులా, పగతోనో, ద్వేషంతోనో జగన్ ఆ పేరు తొలగించలేదు. ఎన్టీఆర్ పై గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే, ఎవరూ అడగకపోయినా, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన్ను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్.
రామోజీ, రాధాకృష్ణల కుట్రలకు అంతే లేదు
రాజ గురువు ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రల గురించి వివరిస్తూ… బుద్ధి, జ్ఞానం లేకుండా వెన్నుపోటును అధికార మార్పు అంటూ రాతలు రాస్తున్నారు. నాడు చంద్రబాబుతో కుమ్మక్కైన రామోజీరావు.. ఏ విధంగానైతే నన్ను అడ్డు పెట్టుకుని అబద్ధపు, అసత్యాల కథనాలతో ఎన్టీఆర్ పై బురదచల్లారో, అవమానించారో, ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారం, పార్టీని లాక్కున్నారో చూశాం. అలానే ఈరోజు కూడా, ప్రజలకు ఇంతగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అదే విషం చిమ్ముతున్నారు. అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో చంద్ర బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారణమయ్యాడా.. లేదా.. రామోజీ, రాధాకృష్ణా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
వీరి విషపు రాతలు ఎలా ఉన్నాయంటే.. ఎన్టీఆర్ తో నాకు వివాహం జరిగి, ఆయనకు నేను సేవకురాలిగా సేవలు చేస్తే.. వాటిపైనా తప్పుడు రాతలు రాశారు. ఎన్టీఆర్ తో నా వివాహం తిరుపతిలో చాలా చక్కగా జరిగిందనేది వాస్తవం. అయితే జరిగిన నిజాన్ని కూడా చంద్రబాబు, వారి అనుకూల ఎల్లో మీడియా ఎంతగా బరితెగించి, అబద్ధాలను ప్రచారం చేస్తారో అన్నదాన్ని చెప్పేందుకే ఈ విషయం చెబుతున్నాను. ఎన్టీఆర్ తిరుపతిలో మా పెళ్లి గురించి ప్రకటన చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మా వివాహం జరిగినట్లు పత్రికాముఖంగా తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను, వీడియో క్లిప్స్ ను మీడియా సమక్షంలో ప్రదర్శించారు.
మా వివాహంపై అప్పట్లో రేణుకా చౌదరి దమ్మున్న మగాడు అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే.. టీడీపీ వాళ్లే మాకు దండలు కూడా మార్చించారు. ఎందుకంటే చంద్రబాబుకు మొదటి నుంచి మా పెళ్లి అంటే ఇష్టం లేదు. మా పెళ్లి ప్రకటన సమయంలోనూ మైక్‌లు ఆపివేయించి, పవర్ కట్ చేయించి అతి దారుణంగా అడ్డుపడ్డాడు. సాక్షుల సమక్షంలోనే ఎన్టీఆర్ నా మెడలో తాళికట్టారు. చాలా సింపుల్‌గా మా వివాహం జరిగింది. మా పెళ్లి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తున్నాను. మా వివాహం మీద విమర్శలు, ఆరోపణలు చేస్తే ఈసారి అలాంటివారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాను. పదవుల గురించి వస్తే… నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్త పలుకుల్లో ‘ఆమె పదవీ వ్యామోహమే పార్టీ కొంప ముంచిందంటూ’ఒక కథనం ప్రచురించింది. అందుకే చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకోవాల్సి వచ్చిందంటూ మళ్లీ పాత పాటే రికార్డువేశారు. అప్పట్లో నన్ను రాజకీయాల్లోకి తీసుకువస్తానని ఎన్టీఆర్ గానీ, లేకుంటే పదవి కావాలని నేను అడగటం గానీ ఎప్పుడైనా జరిగిందా? అంటే లేదు.
1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందుపురం, టెక్కలిలో పోటీ చేసి రెండుచోట్లా గెలిచారు. టెక్కలి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని చాలా పేపర్లు రాశాయి. ఆమె ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి వస్తానంటే నాకెలాంటి అభ్యంతరం లేదని ఎన్టీఆర్ అప్పుడు చెప్పారు. అంతా ఆమె ఇష్టమని వదిలేశారు. వాళ్లంతా నన్ను బతిమిలాడితే.. ఎన్టీఆర్ భార్య పదవి తప్ప మరొకటి నాకు అక్కరలేదని చాలా స్పష్టంగా చెప్పాను. చివర వరకూ అదేమాట మీద ఉన్నాను. అప్పటి సీనియర్ నాయకులు నిమ్మల కిష్టప్ప, బుచ్చయ్యచౌదరిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి కదా. నేను అడ్డుపడి ఉంటే.. ఎన్టీఆర్ కేబినెట్ లో చంద్రబాబు రెండు కీలక శాఖలు ఆర్థిక, రెవెన్యూ మంత్రి అయ్యేవాడా..?. చంద్రబాబే ఒక అబద్ధం. ఆ అబద్ధాలతోనే ప్రజలను మోసం చేస్తున్నాడు. బాబు మోసాలను ప్రజలు తెలుసుకోవాలి.
నేను వచ్చాకే ఎన్టీఆర్ జీవితంలో తిరిగి వసంతం
ఎన్టీఆర్‌కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టే ఆయనను చూసుకోవాల్సి వచ్చింది. దానిపై కూడా అప్పట్లో దుష్ప్రచారాలు చేయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అడ్డగోలు రాతలు రాయడం దురదృష్టకరం. ఎన్టీఆర్‌కి బ్రెయిన్ లో క్లాట్ వల్ల శరీరం సహకరించేది కాదు. చెయ్యి పనిచేయలేదు. అందుకే భోజనం నోటికి అందించాను. ఆయనకు ప్రతిక్షణం నా అవసరం ఉంది కాబట్టే.. సభలకు, ఎన్నికల ప్రచారాలకు తీసుకువెళ్లారు. వీటన్నింటనీ విస్మరించి రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు రాతలు రాయడం సరికాదు. లక్ష్మీపార్వతి తనకు భార్యే కాదు, తల్లి కూడా అని ఎన్టీఆర్ అప్పట్లో నేషనల్ ఫ్రంట్ నాయకులతో చెప్పిన మాటలు అన్ని పత్రికలు ప్రచురించాయి కూడా.
చివరి వరకూ ఎన్టీఆర్ గుండెల్లో దేవతలా కొలువై ఉన్నాను. ఏ భార్యకు అయినా ప్రపంచంలో ఇంతకంటే మంచి సర్టిఫికెట్ ఎక్కడ దొరుకుతుంది…?. ఆస్తులన్నీ తన పిల్లలకు ఇచ్చేసి, ఎన్టీఆర్‌గారు కేవలం శాంతి కుటీరం మాత్రమే తన పేరుమీద పెట్టుకున్నారు. అలాంటి సమయంలోనే ఆయన జీవితంలోకి వచ్చాను. ఎన్టీఆర్ ఆరోగ్యంతో పాటు ఆయన అధికారాన్ని తిరిగి తీసుకువచ్చానని గర్వంగా చెబుతాను. ఈ విషయాన్ని అప్పట్లో వార్త దిన పత్రిక జనవరి 7వ తేదీన ఎన్టీఆర్‌ఇంటర్వ్యూను ప్రముఖంగా ప్రచురించింది. అందులో ఎన్టీఆర్ ‘ఆఖరి వీలునామా’ లో అనేక విషయాలు తెలిపారు. ఆ చివరి ఇంటర్వ్యూలో చంద్రబాబు చేసిన దురాగతాలు, ఎన్టీఆర్‌గారికి నా మీద ఉన్న గౌవరం, అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదని చెప్పడానికి ఉదాహరణ.
రాజగురువు ఈనాడు రామోజీరావు తన పత్రిక ద్వారా కూడా మాపై రాసిన పిచ్చి రాతలపై ఎన్టీఆర్‌పై స్పందించారు. ఏనాడు అయినా రాజకీయాల్లో నేను జోక్యం చేసుకున్నానా? ఎన్టీఆర్ నా చేతిలో కీలుబొమ్మ అంటూ కార్టూన్లు ప్రచురించారే? నిజంగా నాకు అధికార వ్యామోహం ఉంటే ఏదో ఒక పదవి తీసుకోవడం నాకు అప్పుడు కష్టమా? ఇవ్వడానికి ఆయనకు ఇబ్బందా? నాకు మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నానని మోహన్‌బాబు దగ్గర కూడా ఎన్టీఆర్ ప్రస్తావించారు. అధికారం కోసమో, రాజకీయ స్వార్థంతోనో ఎన్టీఆర్‌గారి జీవితంలోకి రాలేదు. చంద్రబాబు నాయుడు తన అధికార దాహానికి, ఎన్టీఆర్ కి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ పచ్చ మీడియా చేస్తున్న డ్రామాలు, విష ప్రచారాలను ప్రజలంతా మరోసారి గమనించాలని కోరుతున్నాను.