Suryaa.co.in

Telangana

తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభం

– తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం.

న్యూఢిల్లీ: లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహంకాళి అమ్మవారికి బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో, పూర్ణకుంభాలతో, మంగళ వాయిద్యాల నడుమ గవర్నర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్ కూడా గవర్నర్‌కు సత్కారాన్ని అందజేశారు.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తెలంగాణ భవన్ వేదికగా గత పదకొండు సంవత్సరాలుగా నిరాటంకంగా లాల్ దర్వాజా బోనాలు నిర్వహిస్తున్న సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ యొక్క కృషి ప్రశంసనీయం.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను దేశ రాజధానిలో ప్రతిఫలింపజేస్తూ, సమాజానికి శక్తినిచ్చే ఈ విధమైన ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని” అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE