Suryaa.co.in

Editorial

పవన్‌కు ‘పొల్యూషన్’ పట్టదా?

– విశాఖ ‘పొల్యూషన్’కు ఏదీ సొల్యూషన్?
– గ్రామాల్లో విష వ్యర్ధాలు పారబోస్తున్న కంపెనీలు
– ప్రజల ప్రాణాలతో కంపెనీల పరాచకం
– తాజాగా వెలుగుచూసిన సెయింట్‌గోబైన్ కంపెనీ ఉల్లంఘన
– రాంకీ రసాయర వ్యర్ధాలు కాల్వల్లో పారపోయడాన్ని అడ్డుకున్న స్థానికులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
– అయినా పట్టించుకోని పీసీబీ అధికారులు
– మళ్లీ రెండుసారీ అదే ఉల్లంఘన
– రాంకీ నిబంధనలు పాటించలేదని పీసీబీ నివేదిక
– ఎన్‌జీటీలో కేసు విచారణలో ఉన్నా కొనసాగుతున్న ఉల్లంఘనులు
– ఒడ్డుకు చేరుతున్న వేలాది తాబేళ్ల కళేబరాలు
– కాకినాడ తీరంలో కుప్పలు తెప్పలుగా కొట్టుకువస్తున్న మృతిచెందిన తాబేళ్లు
– నక్కపల్లి తీరంలో ఓ కంపెనీ అరాచకం
– పుట్టెడు ఆవేదన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
– అయినా చర్యల కొరడా ఝళిపించని నిస్సహాయత
– సముద్ర జలాలను కలుషితం చేస్తున్న ఫార్మా కంపెనీలు
– కార్మిక సంఘాలు, స్థానికులు లారీలను పట్టించినా చర్యలు శూన్యం
-మీడియాలో కథనాలు వస్తున్నా పట్టని పీసీబీ అధికారగణం
– తనిఖీలు అటకెక్కించినందుకే కనిపించని ఫలితాలు
– పీసీబీ అధికారుల ఆస్తులపై కన్నేయని ఏసీబీ
– పవన్‌కు పీసీబీ పట్టదా?.. పీసీబీ చర్యలు, నియామకాలపై సమీక్షలేవీ?
– పూర్తి స్థాయి మెంబర్ సెక్రటరీ లేకనే ఈ అరాచకాలు
– కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌తో ముడిపడిన పీసీబీ కంపెనీ చట్టాలు
– ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్ అధికారికే మెంబర్ సెక్రటరీ ఇవ్వడం మేలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

విశాఖ తీరం చుట్టూ ప్రజల ప్రాణాలను కబళిస్తున్న పొల్యూషన్‌పై మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న కథనాలు ఆ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు పట్టవా? చెరువులో విష వ్యర్ధాలను కుమ్మరిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు? అసలు ఆయన దృష్టికి ఆ దారుణాలు వెళ్లవా? నిర్నిరోధంగా జరుగుతున్న ఉల్లంఘనలపై పవన్ చర్యల కొరడా ఝళిపించరా? బడా బాబులు ఉల్లం‘ఘనుల’ అవతారమెత్తినా పవన్ పట్టించుకోరా? అసలు ఈ ఏడాదిలో పీసీబీ చర్యలపై పవన్ చేసిన సమీక్షలెన్ని? అందులో జరుగుతున్న నియామకాలు-బదిలీలపై చేసిన సమీక్షలెన్ని? ఎవరెంతకాలం ఒకేచోట పట్టుకుని వేళ్లాడుతున్న అధికారులెంతమందో పవన్‌కు తెలుసా? గత ఏడాది నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఘటనలపై అధికారుల చర్యలను సమీక్షించే తీరిక ఉందా?.. ఇదీ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు బాధ్యుడైన డిప్యూటీ సీఎం పవన్‌పై, పర్యావరణ ప్రేమికులు సంధిస్తున్న ప్రశ్నలు!

ఇది కొద్దినెలల జరిగినక్రితం ముచ్చట. అనకాపల్లికి చెందిన ఓ ఫార్మా కంపెనీ తన వ్యర్థాలను తరలించేందుకు ఒక కంపెనీకి డబ్బులిచ్చింది. నిజానికి ఆ కంపెనీ దానిని శుద్ధి చేసి, సిమెంట్ కంపెలనీకు పంపించాలనే నిబంధనను ఉల్లంఘించి.. ఆ వ్యర్ధాలను కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలోకి తీసుకువచ్చి, రెసిడెన్షియల్ ప్రాంతంలో విడిచిపెట్టింది. దానివల్ల ఆ స్థలాల యజమానులకు తీవ్రమైన నష్టం వచ్చింది. దీనిపై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు.. ఆ కంపెనీతోపాటు, వ్యర్థాలను శుద్ధి చేయాల్సిన మరో కంపెనీని సీజ్ చేసింది.

దానికి సంబంధించి పెనాల్టీ విధించింది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరూ తప్పపట్టరు. అంతా అభినందించాల్సిందే. అయితే ఆ చర్యవల్ల అందులో పనిచేసే 300 మంది కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అది వేరే విషయం.

సీన్ కట్ చేస్తే.. అదే పద్ధతి.. అదే అడ్డదారి.. కాకపోతే ప్రాంతాలు మార్పు. మిగిలినదంతా సేమ్ టు సేమ్. అదేంటో చూద్దాం.

సెయింట్ గొబైన్ అనే కంపెనీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవాడ నుంచి.. పరవాడకు, పర్యావరణానికి హానికర పారిశ్రామిక వ్యర్ధాలను నిర్భయంగా లారీల్లో తీసుకువచ్చి.. పరవాడలో జనావాసాల మధ్య అన్‌లోడ్ చేయించేందుకు సహకరిస్తూ, ధనార్జన చేస్తున్న కొందరు అధికారుల ధనదాహం.. స్ధానికుల ప్రతిఘటనతో బట్టబయలయింది.

ఎప్పటినుంచో గుట్టుగా సాగుతున్న ఈ తెరచాటు బాగోతం, ఆదివారం స్థానికులు అడ్డుకోవడంతో బట్టబయలయింది. ఆ మేరకు స్థానికులు పోలీసులు, పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పర్యావరణానికి హానికలిగించే ఈ కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే.. అనకాపల్లిలో పీసీబీ గతంలో సీజ్ చేసిన ఓ కంపెనీ, తమ వ్యర్ధాలను ఒక కంపెనీకి ఇచ్చినందున, తరలింపులో తాను అమాయకురాలినని వాదిస్తోంది. అయినా సరే అవేమీ పట్టించుకోని పీసీబీ దానిని సీజ్ చేసింది.

అచ్యుతాపురంలోని సెయింట్ గోబైన్ కంపెనీ కూడా తమ వ్యర్ధాలను వేరే కంపెనీకి ఇచ్చినందున, అందులో తమ తప్పేమీలేదని వాదిస్తునట్లు చెబుతున్నారు. మరి అనకాపల్లిలో సీజ్ చేసిన కంపెనీకి వర్తింపచేసిన రూల్సునే, సెయింట్‌గోబైన్‌కూ అమలుచేస్తారా? లేదా అన్నది చూడాలి

సెయింట్‌గోబైన్ కంపెనీ ఉల్లంఘన సంగతేమిటి?

ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. అదేమిటంటే.. అనకాపల్లికి చెందిన ఓ ఫార్మా కంపెనీ తన రసాయన వ్యర్ధాలను కెకెఆర్ కంపెనీకి డబ్బులిచ్చింది. దానికి కారణం…కెకెఆర్ కంపెనీ సరైన పద్ధతిలో ట్రీట్‌మెంట్ చేసి, సిమెంట్ ఫ్యాక్టరీకి పంపించే అనుమతులు దానికి ఉండటమే! అయితే ఆ పంపించే విధానంలో చిన్న లోపాలు కూడా నిశితంగా పరిశీలించిన పీసీబీ అధికారులు, ఆ రెండు కంపెనీలు ‘చాలా నిజాయితీగా’ సీజ్ చేశారు.
మరి సెయింట్‌గోబైన్ కంపెనీ ఎలాంటి అనుమతులతో తన వ్యర్ధాలను(గ్లాస్‌వూల్) జనావాసాల మధ్యలో తగలబెట్టారు? దానికి పీసీబీ అనుమతి తీసుకుందా? అన్నదే ప్రశ్న. నిజానికి ఈ గ్లాస్‌వూల్‌ను తగలబెట్టకూడదని, దానిని రాంకీ టీఎస్‌డీఎఫ్‌కు పపిస్తే, అక్కడ రాంకీ టీఎస్‌డీఎఫ్‌లో దానికి తగిన న్యూట్రల్‌ఏజంట్స్‌ను కలిపి, శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పాతిపెడుతుంది. కానీ దానికి బదులు..సెయింట్‌గోబైన్ ఎలాంటి అనుమతి లేని కంపెనీకి ఇవ్వడం, దానిని ఆ కంపెనీ జనావాసాల మధ్య తగలబెట్టడం ఫిర్యాదునకు కారణమయింది. ఈ రెండు సంఘటనలో జరిగినవి దారుణమైన ఉల్లంఘనలే.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవే.

అనకాపల్లికి చెందిన రెండు కంపెనీలను సీజ్ చేసిన పీసీబీ.. అదే ఉల్లంఘనురాలైన సెయింట్‌గోబైన్ కంపెనీని కూడా, అంతే కఠినంగా సీజ్ చేసి తన నిజాయితీ చాటుకుంటుందా? అన్నది చూడాలి. నిబంధనలను నిర్మొహమాటం-నిజాయితీ-కఠినంగా అమలుచేసి, చర్యల కొరడా ఝళిపిస్తారన్న ప్రచారం ఉన్న పీసీబీ.. మరి సెయింట్‌గోబైన్ ఉల్లంఘన విషయంలో ఎలా స్పందిస్తుందన్న దానిపైనే, పీసీబీ నిజాయితీ ఆధారపడి ఉందని కార్మిక సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

పీసీబీ ధృతరాష్ట్రపాత్ర

నిజానికి గత ఏడాది జూలై 23 నుంచి పర్యావరణ విఘాతం సైతం కాగ్ననబుల్ నేరంగా బిఎన్‌ఎస్(భారతీయ న్యాయ సంహిత)లో చేర్చారు. ఈ క్రమంలో తాజా ఫిర్యాదుపై పోలీసులు, దానిపై విచారణ ప్రారంభించినట్లు కార్మికవర్గాలు చెబుతున్నాయి.

అసలు హానికర విష పదార్ధాలను ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు పిసిబి మేనిఫెస్టో రూల్స్ 2016 ప్రకారం, దానిని తరలించి ట్రీట్‌మెంట్ చేయాలి. ఇందుకు భిన్నంగా మధ్య దళారీలు.. లారీల్లో తెచ్చిన హానికర విష పదార్ధాలను పరవాడలో డంపింగ్ చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా, పీసీబీ అధికారులు ధృతరాష్ట్ర పాత్ర పోషించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తాము స్వయంగా అనేక వ్యర్ధ జలాలను డంప్ చేస్తున్న లారీలను పట్టుకుని ఫిర్యాదు చేసినా, పీసీబీ ఏ ఒక్క కంపెనీని సీజ్ చేయలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలను సీజ్ చేసిన పీసీబీ అధికారులు, మిగిలిన కంపెనీలను సీజ్ చేయనట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

రాంకీ అంటే భయమా? భక్తా?

– కాలువల్లో కలుషిత వ్యర్థాల కలకలం
– నోటీసులిచ్చిన నెలలోనే రెండుసార్లు పారబోసిన గుండె ధైర్యం
– ఏ ప్రభుత్వం ఉన్నా వారిదే హవా

రసాయన వ్యర్ధాలు ఇత ర ప్రాంతాల్లో పారబోసినప్పుడో.. ఫార్మా కంపెనీలో పేలుళ్లు-విషవాయువు పీల్చి, కార్మికులు చ నిపోయినప్పుడో.. పీసీబీ అధికారులు గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు. ఆ కంపెనీపై చర్యల కొరడా ఝళిపిస్తామని చెబుతుంటారు. తనిఖీలతో హడావిడి చేస్తుంటారు. విచారణ పేరుతో హంగామా చేస్తుంటారు. అయినా ఫలితాలు ఎలా ఉంటాయో.. ధిక్కారం ఏ స్థాయిలో ఉంటుందో ఓసారి రాంకీ ఫార్మాసిటీలోకి వెళ్లి చూద్దాం.

రాంకీ ఫార్మాసిటీలోని అన్ని రసాయన కంపెనీలు, తమ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విష వ్యర్థాలను రాంకీ సీఈటీపీ (కామన్ ఎఫ్లుయుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)కే ఇవ్వాలి. వారికే ఇవ్వాలన్నది నిబంధన. వాటిని సదరు రాంకీ సీఈటీపీ.. శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి, ఆ వ్యర్ధాలను వేరుచేసి మిగిలిన నీటిని మెరైన్ డిస్పోజల్‌లైన్ ద్వారా సముద్రంలో కలపుతారు.

అయితే ఆ వ్యర్థాల తాలూకు నీటిని సముద్రంలో కలిపేముందు.. దానికి సంబంధించిన టీడీఎస్ (టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్), సీఓడీ (కెమికల్ ఆక్సిజన్ డిమాండ్), బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) మోతాదు ప్రకారం ఉన్నాయో లేవన్నది తనిఖీ చేయాల్సిన బాధ్యత పీసీబీ అధికారులదే.

మామూలుగా అయితే రాంకీ సీఈటీపీ.. ట్రీట్‌మెంట్ తర్వాత ఆ వ్యర్ధాలను సముద్రంలోకి పైప్‌లైన్ ద్వారా, సుమారు 2 కిలో మీటర్ల లోపలికి పంపిస్తుంది. అయితే ఈ వ్యర్ధాలను పీసీబీ అధికారులు, ‘సహజంగా’ ఇదంతా సవ్యంగానే ఉన్నట్లు ధృవీకరిస్తుంటారు. మరి నిజంగా అంతా క్రమంగా జరుగుతుంటే.. శుద్ధి చేసిన ఎఫ్లుయుంట్ వాటర్‌ను సముద్రంలోకి పంపుతున్నట్లయితే.. మరి ఇలా జనావాసాల మధ్య ఉన్న కాల్వల్లోకి విడుదల చేయాల్సిన అవసరం ఏమిటి? విశాఖ సముద్రతీరంలో జలాలు నల్లగా ఎందుకు కనిపిస్తున్నాయి? వీటికి సమాధానం ఇచ్చేదెవరు?

పరవాడలో పబ్లిక్ పరేషానీ పట్టించుకునేదెవరు? 

ఇక పరవాడలోకి వెళితే.. కొన్ని కంపెనీలు వ్యర్ధ విష పదార్ధాలను పరవాడలోని కాలువలో విడిచిపెడుతున్న వైనం స్థానికుల్లో కలకలం రేపుతోంది. సహజంగా ఈ తరలింపు ప్రక్రియ వర్షాకాలంలోనో, బాగా వర్షాలు కురుస్తున్నప్పుడో చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.

జవహర్‌లాల్ నెహ్రు ఫార్మా సిటీ కేంద్రంగా ఈ తరలింపు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం.. రాంకీ కామన్ ఎఫ్లుయుంట్‌కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) ప్రహరీ ఆనుకుని ఉన్న వరదనీటి కాల్వల్లో, నలుపురంగులో ఉన్న ఫార్మా వ్యర్థ జలాలు ప్రవహించడం స్థానికులలో భయాందోళన సృష్టించింది. ఈ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయకుండా, బయటకు వదిలేస్తున్న వైనం ఈ ప్రాంతం కాలుష్యపుకోరల్లో చిక్కుకునేందుకు కారణమవుతుందన్నది స్థానిక ఆవేదన.

గత నెలలో వచ్చిన వర్షాల సమయంలో రెండుసార్లు.. రాంకీ ఫార్మా వ్యర్థ రసాయన జలాలను బయటకు వదలడం వల్ల అవి బరిణికం మెల్లోడు గెడ్డవాగులోకి చేరి, భరించలేని వాసన వెలువడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఆ విషయాన్ని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పీసీబీ అధికారులు.. 18,19వ తేదీల్లో మెల్లోడు గెడ్డ వాగులో నీటి శాంపిల్స్ సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. అందులో.. వాగునీటిలో ఫార్మా రసాయనాలు కలిశాయని, సీటీఓ(కన్సెంట్ ఫర్ టెక్నికల్ ఆపరేషన్)-హెచ్‌డబ్ల్యుఏ (హజార్డస్‌వేస్ట్ ఆధరైజేషన్) నిబంధనలు పాటించలేదని తేలింది. దీనిపై రాంకీకి పీసీబీ అధికారులు నోటీ సులు జారీ చేశారు. తదుపరి చర్యలకు విజయవాలోని, పీసీబీ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపించారు.

దానిపై పీసీబీ ప్రధాన కార్యాలయం ఇంకా చర్యల కొరడా ఝళిపించేలోపే.. అంటే 22న.. సూటిగా చెప్పాలంటే, కేవలం నెలరోజుల్లో మళ్లీ రెండోసారి నిర్భయంగా వ్యర్థాలను అదే వాగులో విడిచిపెట్టిందంటే.. సదరు కంపెనీకి ఏ స్ధాయిలో పలుకుబడి ఉందో.. పీసీబీలో ఏ స్థాయి అధికారుల దన్ను ఉందో.. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత చేతులు మారిందో చెప్పడానికి మేధావులు కానక్కర్లేదు. మెడపై తల ఉంటే చాలు!

ఫార్మాసిటీలోని సీఈటీపీ ప్రహరీని ఆనుకుని ఉన్న వరద నీటి కాల్వలోకి చేరుకునే రసాయన విష వ్యర్ధాలు.. వర్షాలుపడితే, మెల్లోడు గెడ్డ వాగులోకి పరవళ్లెతున్నాయి. దానికి అనుసంధానంగా ఉన్న అన్ని చెరువులు, గెడ్డవాగులు కాలుష్యంతో నిండిపోతాయన్న ఆందోళను ఖాతరు చేసే వారే లేకపోవ డమే ఆశ్చర్యం.

పీసీబీకి పూర్తిస్థాయి మెంబర్ సెక్రటరీ ఎప్పుడు?

పీసీబీ కీలకమైన శాఖ. నిజానికి ఇది లో ప్రొఫైల్‌లో కనిపించే విభాగం. దీనిగురించి బయట ప్రపంచానికి అంతగా తెలియదు. కార్మికశాఖ మాదిరిగా లోపల ఏం జరుగుతుందో మానవమాత్రుడికి తెలియదు. కానీ తరచిచూస్తే, నిశితంగా పరిశోధిస్తే అందులో వచ్చే ఆదాయానికి అంతే ఉండదు.
కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రుల నుంచి కేంద్రమంత్రుల వరకూ ఒత్తిళ్లు కూడా వస్తుంటాయి. ఇటీవల జగ్గయ్యపేటలో సీజ్ చేసిన ఓ కంపెనీ యజమాని, ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి చేసినట్లు పీసీబీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రధానంగా గ్యాస్ లీకయి ప్రాణాలు పోతేనో, పేలుళ్లు జరిగితేనో అధికారులకు పండగ. కొద్దిరోజులు లేదా నెలలు సీజ్ చే యటం, తర్వాత మళ్లీ అనుమతులివ్వడం పీసీబీలో ‘మామూలే’.

నిజానికి.. పర్యావరణం కలుషితమయి, అదిచుట్టు పక్కల వారికి ఇబ్బందికలిగిస్తేనే ఆ కంపెనీలను సీజ్ చేసే అధికారం పీసీబీకి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ఫార్మాకంపెనీల్లో ఏ ప్రమాదం జరిగినా, వాటిని సీజ్ చేస్తున్న పీసీబీ వైఖరిపై కార్మికశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తమ అధికారాలను వారు ఎలా చేతుల్లోకి తీసుకుంటారని కార్మిక శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జగన్ జమానాలో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమయిందంటున్నారు. విచిత్రమేమిటంటే.. ఈ ఘటనలో సస్పెండ్ అయిన ఓ పీసీబీ అధికారికి అదే ప్రభుత్వం, మళ్లీ విశాఖలోనే పోస్టింగు ఇవ్వడం విచిత్రం. అది వేరే వ్యవహారం.

నిజానికి ఇవన్నీ.. పీసీబీకి పూర్తి స్థాయి మెంబర్ సెక్రటరీ లేకపోవడమే కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుత పీసీబీ మెంబర్ సెక్రటరీకి మరో మూడు, నాలుగు శాఖల బాధ్యతలున్నాయి. అందువల్ల ఆయన పీసీబీపై పూర్తి స్థాయి దృష్టి సారించటం లేదంటున్నారు. దానిని జోనల్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు, రీజనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు తమకు అనుకూలంగా మలుచుకుని, జిల్లాలను తమ సామంత సామ్రాజ్యాలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా.. పీసీబీకి కార్మికశాఖలోని కీలక ఫ్యాక్టరీస్ డి పార్ట్‌మెంట్‌తో ఎక్కువ అనుబంధం ఉంటుంది. అంటే పీసీబీ పరిథిలోని కంపెనీల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. స్థానిక డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా రంగంలోకి దిగి, చర్యలు తీసుకుంటారు. ఆ బాధ్యత వారిది కూడా. అందువల్ల కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధిపతికే, పీసీబీ మెంబర్ సెక్రటరీ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం కార్మికశాఖ అధీనంలో ఉన్న బాయిలర్ డిపార్టుమెంట్.. గతంలో 25 ఏళ్ల పాటు, ఎనర్జీ డిపార్టుమెంట్‌లో కలసి ఉండేదని, తర్వాత దానిని లేబర్ డిపార్టుమెంట్‌కు మార్చిన విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

రాంకీ,సెయింట్‌గోబైన్‌పై చర్యలేవీ?: గనిశెట్టి 

‘ పర్యావరణ నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తున్న రాంకీ, సెయింట్‌గోబైన్ కంపెనీలపై పీసీబీ ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం దారుణం. అంటే పీసీబీ అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదన్నమాట. మేం వీటిపై కలెక్టర్, పీసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. అంటే పీసీబీ అధికారులు- కలెక్టర్ కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? లేక ప్రజాప్రయోజాల కోసం పనిచేస్తున్నారా అర్ధమవుతోంది. అధికారులు చర్యలు తీసుకునే వరకూ మా పోరాటాన్ని కొనసాగిస్తా’మని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు.

తాము ఈ కంపెనీలతోపాటు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న మరికొన్ని కంపెనీలపైనా ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకూ అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదంటే, ప్రజల ప్రాణాలకు ఎవరూ జవాబుదారీ కాదని స్పష్టమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ మంత్రి పవన్ కల్యాణ్ ఇలాంటి ఉల్లంఘునలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఆశ్చర్యంగా ఉంది. మేం ఇక్కడి కంపెనీల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, 2023లో నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసు వేశాం. అక్కడి నుంచి తీర్పు వచ్చేలోపే మరిన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయంటే, కంపెనీల యజమానులు ఎంత శక్తివంతులో అర్ధమవుతుంది. పెద్దచెరువు నీరు కలుషితమయిందని నివేదికలిచ్చినా పీసీబీ పట్టించుకోలేదంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వ అమర్ధవైఖరిని ప్రజలు ఇప్పటికయినా గ్రహించాలి. ఇదంతా కుమ్మక్కు ఫలితమే. మంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్ధం కావడం లేదు. పవన్ కూడా చర్యల కొరడా ఝళిపించడం లేదంటే.. ఆయన కూడా పెద్దలకు భయపడుతున్నారా అన్న అనుమానం రావడం సహజమని’ గనిశెట్టి వ్యాఖ్యానించారు.

చిత్ర విచిత్రాల ‘పొల్యూషన్’ 

ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల లీలలు అన్నిని కావు. అసలు కెమికల్ కంపెనీల నుంచి వ్యర్థాలు తీసుకుని.. వాటిని ట్రీట్‌మెంట్ చేసి సముద్రంలో కలుపుతున్న రాంకీ సామర్థ్యం ఎంత?.. సముద్రంలోకి పంపే మెరైన్ డిస్పోజల్ పైప్‌లైన్ మధ్యన ఉండే ఫ్లోమీటర్ మతలబేమిటి?.. పైప్‌లైన్‌లో మర్మమేమిటి?.. అసలు సముద్రంలోకి నిజంగా కలిసే వ్యర్థాలెన్ని? కింద అనధికార సమాంతర పైప్‌లైన్ ద్వారా కలిపేస్తున్న వ్యర్ధాలెన్ని? అన్న తెరచాటు కథలను మరోసారి ముచ్చటించుకుందాం.

LEAVE A RESPONSE