– కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి
– కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్వయంగా అంగీకరించిన చంద్రబాబు
– 2 ఏళ్లు కాక ముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
– ఏ రోజు కా రోజు అప్పు – లేదంటే కొడుకు గురించి డప్పు
– 18 నెలలుగా ఇదే చంద్రబాబు దినచర్య
– రోజుకి సగటున రూ.500 కోట్లు చొప్పున రూ.2.75 లక్షల కోట్లు అప్పు
– అదే ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకూ భూసంతర్పణ
– విశాఖలో హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖరీదు
– చౌకగా ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటికే కేటాయింపు
– విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్
విశాఖపట్నం: కేవలం 18 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో తమ పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.
అధికారం చేపట్టి 2 ఏళ్లు కాక ముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన దేశంలో తొలి ప్రభుత్వం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఏ రోజు కా రోజు అప్పు- లేదంటే కొడుకు గురించి డప్పు కొట్టడమే 18 నెలలుగా చంద్రబాబు దినచర్యగా మారిందని ఆక్షేపించారు. రోజుకి సగటున రూ.500 కోట్లు చొప్పున ఇప్పటి వరకు చేసిన రూ.2.75 లక్షల కోట్లు అప్పు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాలు అప్పు చేస్తే ఆస్తి రూపంలో ఉండాలని, కాదంటే ప్రజల సంక్షేమంలో కనిపించాలన్న అమర్నాధ్… చంద్రబాబు పాలనలో అభివృద్ధి- ప్రజా సంక్షేమం రెండూ శూన్యమని స్పష్టీకరించారు.
50 శాతం ప్రజల అసంతృప్తే దీనికి నిదర్శనమన్నారు. మరోవైపు ప్రముఖ కంపెనీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో భూదోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి ఉద్యోగాలిచ్చే కంపెనీలకు 99 పైసలకే ఎకరా కేటాయించడం తప్పుకాదన్న అమర్నాధ్… అదే ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకూ భూసంతర్పణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
విశాఖలో హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖరీదు చేసే భూమిని అత్యంత కారు చౌకగా ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటికే కట్టబెట్టడమంటే… దోపిడీ కాక మరేంటని నిలదీశారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కంచే చేను మేస్తే కాపాడేది ఎవరని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ దోపిడీపై ప్రజల తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు.
. గడిచిన 18 నెలలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ… ప్రజల నుంచి మనమీద పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదు, మనం చేసిన పనులకి ప్రజలెవరూ మెచ్చుకోవడం లేదని ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో పాటు రాష్ట్ర ప్రజలనుద్దేశించి చెప్పారు. సాధారణంగా మనం ప్రజలకు మేలు చేసినప్పుడు, వారికిచ్చిన హామీలు నిలబెట్టుకున్నప్పుడే వారి నుంచి పాజిటివ్ అవుట్ పుట్ వస్తుంది. ఈ 18 నెలల్లో మీరు ప్రజలకు చేసిన మంచి ఏమిటి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలైనా నిలబెట్టుకున్నారా? చెప్పిన పనులేవైనా చేశారా?
కనీసం ఇవి చేసి ఉంటే ప్రజల నుంచి సానుకూలంగా స్పందన వచ్చి ఉండేది. ఈ ఏడాది మార్చి, ఏఫ్రిల్ నుంచి ప్రభుత్వం కేటాయిస్తున్న భూములను చూసినా.. గతేడాది డిసెంబరులో తీసుకొచ్చిన పాలసీలో లూప్ హోల్స్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమి అంతా వారి సొంత జాగీరులా తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు భూములు కారుచౌకగా కట్టబెడుతున్నారు? పక్క రాష్ట్రంలో ఇవే కంపెనీలు వేలంలో భూములు కొంటుంటే… దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇదే విధానం ఫాలో అవుతున్న సంస్థలకు ఏపీలో అదీ విశాఖపట్నానికి వచ్చేసరికి.. ఈ సంస్థలకు, ప్రభుత్వానికి ఉన్న తెరవెనుక ఒప్పందాలు ఏంటి? సత్వా సంస్థ పక్కరాష్ట్రంలో 20 ఎకరాలు కావాలనుకుంటే… ఎకరా రు.30 నుంచి రూ.50 కోట్ల వరకు కొనుగోలు చేసిన చరిత్ర ఉంది. అక్కడ ప్రైవేటుగానో, ప్రభుత్వం దగ్గర వేలంలోనే కోట్లాది రూపాయులు పెట్టి భూములు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థలకు విశాఖపట్నానికి వచ్చేసరికి ఎందుకు ఎకరా రూ.50 లక్షలకూ, రూ.1 కోటికో ఇస్తున్నారు.
హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30-50 కోట్ల ఖరీదు చేసే 30 ఎకరాల భూమిని ఎకరా కేవలం రూ.50 లక్షలకూ రూ.1 కోటికో ఇవ్వడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? ఇదే ప్రశ్న మేమడిగింది కాదు, న్యాయమూర్తులు సైతం ఇదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములిచ్చేటప్పుడు.. ఏ పద్దతి అనుసరించారు?. ఎలా అలాట్ మెంట్ చేశారు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు.
రియల్ ఎస్టేట్ సంస్ధలు ఉద్యోగాలిచ్చే పరిస్తితి లేదు. కావాల్సిన భూమిని తీసుకుని బిల్డింగులు కట్టుకుని.. సంస్ధలకు అద్దెకు ఇచ్చుకునే పరిస్ధితి వీళ్లది. వీళ్లకి తక్కువ ధరకే భూములు కేటాయించడంతో పాటు వీళ్ల చేపట్టే నిర్మాణాలకు అయ్యే ఖర్చుల్లో చదరవు అడుగుకి రూ.2వేలు ప్రభుత్వం చెల్లించడం ఇంకా ఆశ్చర్యకరం. ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్ధకు ప్రభుత్వం కారుచౌకగా భూములిచ్చి… మరలా నిర్మాణ ఖర్చులు కూడా తిరిగి చెల్లించడంతో పాటు.. ఆయా సంస్ధలకు కేటాయించిన భూముల్లో రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికీ అనుమతినిచ్చారు.
అంటే ఆపార్ట్ మెంటులు, విల్లాలు నిర్మించుకుని వారికి నచ్చిన ధరలకు అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేకుండానే వారికి నచ్చినట్లు అమ్ముకునే వెసులుబాటు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన గురించి వీరికి ఎలాంటి నిబంధనలు కూడా వీరికి నియిమించలేదు. అంటే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్ధల పేరు చెప్పి.. మీకు కావాల్సిన బ్యాక్ డోర్ అగ్రిమెంట్ల కోసం.. కపిల్, సత్వా ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్ధలకు భూములు కేటాయించి ఈ రకమైన మినహాయింపులిచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ తరహా మినహాయింపులు ఎందుకు ఇచ్చినట్లు? ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయి ఎందుకు వారికి మినహాయింపులు ఇస్తున్నట్టు? దీనిపై మాత్రం సీఎం చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ స్పందించరు.
మీ ఉపముఖ్యమంత్రి కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. మన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ లో జోక్యం చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ముఖ్యంగా విశాఖలో ఈ తరహా సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఉపముఖ్యమంత్రి తన పక్కనున్న ముఖ్యమంత్రిగా నేరుగా ప్రశ్నించాలి. విశాఖలో ఎందుకు ఇలా కారుచౌకగా భూములు దోచిపెడుతున్నారో ప్రశ్నించాలి. ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్న నష్టం ఒకవైపు అయితే.. ప్రైవేటు ల్యాండ్ సెటిల్మెంట్స్ లో మంత్రుల నుంచి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దారుణంగా జోక్యం చేసుకుంటున్నారు. మిమ్నల్ని గెలిపించింది ప్రజల ఆస్తుల కాపాడి, వారికి సేవ చేయడానికా? వారి ఆస్తులు కాజేయడానికా?
కాబట్టి మీరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కాదు చెప్పాల్సింది.. ప్రజలే మిమ్నల్ని కూర్చోబెట్టి చెప్పాలి. విశాఖలో ఉన్న భూములన్నీ మీకు కావాల్సిన వారికి దోచిపెట్టి… ఇక్కడ ఏ రకమైన యాక్టివిటీ లేకుండా అడ్డుకుని, అమరావతిని ఏదో ఒక రకంగా ప్రొజెక్టు చేసుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం. అమరావతిని సొంత టెరిటరీ కింద చేసుకుని దానికే ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుందేమో. నాకు ఇది ఇచ్చేస్తే చాలు.. మిగిలిన ప్రాంతాలేమైనా ఫర్వాలేదు అన్న ఆలోచనతోనే ఉన్నారు.