-
‘సుప్రీం’కు వెళ్లే దాకా వదిలేసిన ‘సూపర్ పోలీస్’!
-
కిరణ్‌ను కనిపెట్టిన సిగ్నల్స్ ఆ ముగ్గురినీ కనిపెట్టలేకపోయాయా?
-
కాకాణి ,మిథున్‌రెడ్డి, డాక్టర్ ప్రభావతిలను వదిలేసిన పోలీసులు
-
హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టేసిన వైనం
-
వెంటనే అరెస్టుకు వేటాడని పోలీసు బాసులు
-
ఆలోగా సుప్రీంకోర్టుకు వెళ్లి సేఫ్ అయిన వైకాపా నేతలు
-
ఈలోగా కాకాణి ఖాకీల కళ్లు గప్పి పరాయిన కాకాణి
-
మిథున్, పెద్దిరెడ్డిని ఎవరు రక్షిస్తున్నారంటూ తమ్ముళ్ల ఫైర్
-
టీడీపీ అధికారంలో ఉన్నా చిత్తూరు, అన్నమయ్యలో ఇంకా పెద్దిరెడ్డి హవానా? హవ్వ!
-
జగన్ హయాంలో టీడీపీ నేతలను ఖాకీలు ఇలాగే వదిలేశారా?
-
హైదరాబాద్ వెళ్లి రఘురామరాజును ఎత్తుకొచ్చిన పోలీసులు
-
ఆ తెగువ ఇప్పుడు ఏదంటూ పసుపు సైనికుల ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్లమీద నడుస్తుందట.. పాలకుడి బట్టే పాలితులు. రాజును బట్టే భటుడు. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటున్న సామెతలే. అవి ఇప్పుడు ‘మంచిప్రభుత్వం’లో నిజమవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీని, ఒకప్పుడు వేటాడి వెంటాడి.. వేధించిన వారిని అరెస్టు చేయాల్సిన పోలీసుల మీనమేషాలు.. వైకాపేయులకు శ్రీరామరక్షగా మారుతోందన్న తమ్ముళ్ల ఉవాచ.
హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ కొట్టేసిన వెంటనే రంగంలోకి దిగి, నిందితులను చెరపట్టాల్సిన ఖాకీలు కళ్లు మూసుకుంటే.. నిందితులు ఎంచక్కా సుప్రీంకోర్టుకు వెళ్లి రక్షణ తెచ్చుకుంటున్నారు. కాదు.. తెచ్చుకునేలా పోలీసులే అవకాశం ఇస్తున్నారు! మరి జగన్ జమానాలో ఖాకీలు, ఇలాగే కళ్లు మూసుకున్నారా అన్నది పసుపు సైనికుల ప్రశ్న. ఇంత ‘మంచి ప్రభుత్వం’లో.. ఇంత‘మంచి పోలీసులు’ండటం ప్రతిపక్ష వైకాపాకు వరమే కదా?
ఏపీలో పోలీసుల వేగం చూసి నత్తలు కూడా నవ్వుకుంటున్నాయన్నది, పసుపు సైనికుల ఉవాచ. హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దయిన ఎంపి మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి చక్రపాణిరెడ్డి, డాక్టర్ ప్రభావ తిని వెంటనే అరెస్టుచేయడంలో.. పోలీసులు చేసిన జాప్యమే వారికి సుప్రీంకోర్టులో ఊరట లభించేందుకు కారణమయిందన్నది, త మ్ముళ్ల ఆగ్రహానికి అసలు కారణం.
సహజంగా ఒక నిందితుడిని పట్టుకునేందుకు, పోలీసులు వాడే సాంకేతిక టెక్నిక్కులు కొన్ని ఉంటాయి. అందులో ప్రధానమైనది నిందితుల ఫోన్ సిగ్నల్స్‌ను కనిపెట్టడం. ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డిని దూషించారంటూ, కేసు నమోదయిన కిరణ్ ఆచూకీని కూడా అతని ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేసిన తర్వాత అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించటం ప్రస్తావనార్హం.
ఇదే సిగ్నల్స్ ద్వారా టీడీపీ కార్యకర్తను పట్టుకోగలిగిన పోలీసులు.. ఒక ప్రభుత్వ డాక్టరయిన ప్రభావతి, ఎంపి మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి చక్రపాణిరెడ్డి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను, ఎందుకు కనిపెట్టలేకపోయాయన్నది తమ్ముళ్ల వాదన. అది కూడా దొరక్కపోతే.. వారి వద్ద ఉన్న గన్‌మెన్లను విచారించినా ఆచూకీ లభిస్తుంది. ఇది సహజంగా నిందితులను పోలీసులు వేటాడే ప్రక్రియలో భాగం.
అసలు వారి బెయిల్ పిటిషన్లు హైకోర్టులో తిరస్కరించిన వె ంటనే పోలీసులు రంగంలోకి దిగి, అరెస్టు చేస్తారని పార్టీ కార్యకర్తలు భ్రమపడ్డారు. ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అనుసరించింది కాబట్టి! గత ఐదేళ్లలో అసలు ఎఫ్‌ఐఆర్ లేకుండానే వందల మందిని అరెస్టు చేసింది.
గతంలో నిందితుల పిటిషన్లు కొట్టేసినప్పుడు పోలీసులు ఒక విచిత్ర పద్ధతులు పాటించేవారు. కోర్టు ఆవరణలో వివిధ వేషాల్లో ఉండే కానిస్టేబుళ్లు, నిందితులు బయటకు వచ్చినప్పుడు నేర్పుగా ఎత్తుకెళ్లేవారు. నిందితుల బంధువుల ఇళ్ల వద్ద నిఘా పెట్టేవారు. ఇదంతా ఒకప్పటి పద్ధతి. ఇప్పుడు ఏకంగా నిందితుల కుటుంబసభ్యులనే పోలీసుస్టేషన్లను పిలిపిస్తున్నారు. అది వేరే విషయం.
ప్రస్తుతం ‘చాలా అంశాల్లో’ జగన్ విధానాలనే అనుసరిస్తున్న ప్రభుత్వం.. వైసీపీ నేతల అరెస్టు విషయంలోనూ, అదే పద్ధతి అనుసరిస్తుందని పసుపు సైనికులు భావించారు. కానీ పేరుగొప్ప పోలీసులు.. నిందితులను సుప్రీంకోర్టు వరకూ వెళ్లనిచ్చి, వారు రక్షణ తెచ్చుకునేంత స్వేచ్ఛ కలిగించడంపైనే, ఇప్పుడు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు.
పోలీసుల నత్తనడక వల్ల మాజీ మంత్రి కాకాణి చక్రపాణిరెడ్డి సురక్షితంగా తప్పించుకోగలిగారు. దానితో రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ కొట్టివేసినప్పుడు, ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు ఫొటోలు విడుదల చేశారు. కాకాణి ఎక్కడికీ పారిపోలేదని చెప్పేందుకు ఆ ఫొటోలు విడుదల చేశారు. కానీ తర్వాత ఆయన ఆచూకీ మాయమయింది. నిజానికి పోలీసులు హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అరెస్టు చేసి ఉంటే, కాకాణిని జైల్లో వేసే అవకాశం ఉండేది కదా అని, నెల్లూరు తమ్ముళ్లు విరుచుకుపడుతున్నారు.
చిత్తూరు, అన్నమయ్యలో టీడీపీ ఉందా?
ఇదిలాఉండగా.. రాష్ట్రంలో తమ పార్టీనే అధికారంలో ఉన్నప్పటికీ, చిత్తూరు-అన్నమయ్య జిల్లాల్లో మాత్రం ఇంకా వైసీపీ అగ్రనేత.. పెద్దిరెడ్డి రాజ్యమే నడుస్తోందన్న ఆగ్రహం ఇటీవలి కాలంలో తమ్ముళ్లలో పెల్లుబుకుతోంది. చివరకు పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిన నేతను సైతం.. ఆయన సొంత మండలానికే పరిమితం చేశారని, నియోజకవర్గంలో సైతం ఆయన మాట చెల్లడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఆ రెండు జిల్లాల్లో పెద్దిరెడ్డి చెప్పిన వారికే అన్ని శాఖల్లో పోస్టింగులు దక్కుతున్నాయన్న అసంతృప్తి తమ్ముళ్లలో ర గులుతోంది. దానితో అధికారం పోయినా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎవరు కాపాడుతున్నారన్న చర్చ జరుగుతోంది.