Suryaa.co.in

Editorial

‘లీకు’ యుద్ధం!

– ‘లా’ ఒక్కింతయులేదు
– ఎంపీ అరెస్టుకే కారణాలు చెప్పని పోలీసులు
– వారెంటు, నోటీసు, కేసు వివరాలు చెప్పకుండానే అరెస్టులా?
– ప్రాధమిక హక్కులకు విలువేదీ?
– టెన్త్‌ పేపర్‌ లీక్‌ సమాచారం పోలీసులకు చెప్పకపోవడం నేరమా?
– లీక్‌ చేసిన మాజీ జర్నలిస్టుపై పార్టీల ముద్ర రచ్చ
– బీజేపీ,బీఆర్‌ఎస్‌తోనూ జర్నలిస్టుకు సంబంధాలు
– ఫొటోల కేంద్రంగా మాటల యుద్ధం
– అర్ధరాత్రి బండి సంజయ్‌ అరెస్టుపై ఆగమాగం
– వాహనాలు మార్చి తిప్పిన పోలీసులు
– బండి సంజయ్‌ అరెస్టుపై బీజేపీ హైకమాండ్‌ సీరియస్‌
– ప్రధాని, మోదీ దృష్టికి తీసుకువెళ్లిన పార్టీ అధ్యక్షుడు నద్దా
– న్యాయపోరాటం చేయాలని సూచించిన అమిత్‌షా
– ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు సంజయ్‌ అరెస్టు వ్యవహారం
– తెలంగాణలో హీటెక్కుతున్న లీకు రాజకీయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికలకు ముందు తెలంగాణలో లీకు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, టెన్త్‌ పరీక్షల లీక్‌ వ్యవహారంలో పైచేయి సాధించేందుకు.. అధికార బీఆర్‌ ఎస్‌-ప్రతిపక్ష బీజేపీ- కాంగ్రెస్‌ పార్టీలు మూడు ముక్కలాట ఆడుతున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితమయ్యే ఆరోపణాస్ర్తాలు, పరువునష్టం దావాల వరకూ వెళ్లిన క్రమంలో వేసిన సిట్‌పైనా, అనుమానపు మేఘాలు కమ్ముకున్న పరిస్థితి.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయటం సంచలనం సృష్టించింది. ఒక పార్లమెంటు సభ్యుడికి కనీసం నోటీసు ఇవ్వకుండా, వారెంట్‌ లేకుండా అరెస్టు చేయటం, ఏ స్టేషన్‌లోనూ, ఏ కోర్టులోనూ సమర్పించకుండా గంటలపాటు ఒక ఎంపీని పోలీసు వాహనాలు మారుస్తూ, జిల్లాలు తిప్పటం వంటి దృశ్యాలు, మానవ హక్కులను మంటకలుపుతున్నాయన్న విమర్శలకు తావిస్తోంది. ఒక పార్లమెంటుసభ్యుడి హక్కులకే దిక్కులేకపోతే, ఇక తమ సంగతేమిటన్నది సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం. దీనికి సమాధానం ఇచ్చేదెవరు?

తెలంగాణ రాజకీయ అధిపత్యపోరాటంలో.. మానవ హక్కులు మంటకలసిపోతున్నాయన్న ఆందోళన, ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, పోలీసులు దన్నుగా నిలవడం విమర్శలకు గురవుతోంది. ఆ క్రమంలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా అణచివేస్తుండటం కలవరం కలిగిస్తోంది.

తాజాగా కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అర్ధరాత్రి అరెస్టు వ్యవహారం.. తెలంగాణలో ప్రాధమిక హక్కులకు వచ్చిన కష్టాలకు నిదర్శనంగా నిలిచింది.

బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే కాదు. లోక్‌సభ సభ్యుడు కూడా. అంతకంటే ముందు ఒక పౌరుడు. పార్లమెంటుసభ్యుల అరెస్టు విషయంలో కొన్ని నిబంధనలకు లోబడి వ్యవహరించాలి.
అయితే.. సంజయ్‌ ఎంపీనా? కాదా? అన్నది పక్కనపెడితే.. ఆయన ఒక పౌరుడు. పోలీసులకు అరెస్టు విషయంలో కొన్ని అధికారాలుంటాయి. కాదనలేం. ప్రివెంటివ్‌ అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నామన్న విషయం నిందితుడికి చెప్పాల్సి ఉంటుంది, అనుమానితులను అరెస్టు చేయవచ్చు. కానీ.. అది కూడా చట్టప్రకారమే జరగాలి. సదరు వ్యక్తికి 41ఏ సెక్షన్‌ కింద నోటీసులివ్వాలి. అరెస్టుకు ముందు వారెంట్‌ చూపించాలి. వీటన్నింటికంటే.. అసలు సదరు వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నాం? ఏ సెక్షన్‌ కింద అరెస్టు చేస్తున్నామన్న సమాచారాన్ని ఆ వ్యక్తికి స్పష్టం చేయాలన్నది నిబంధన.

కానీ బండి సంజయ్‌ అరెస్టు విషయంలో, ఇలాంటి నిబంధనలేమీ పాటించలేదని ఆయన అరెస్టు జరిగిన తీరు స్పష్టం చేస్తోంది. అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్లిన పోలీసు అధికారులు, సంజయ్‌ చుట్టూ మూగారే తప్ప, ఏ కారణంతో, ఏ సెక్షన్‌ కింద అరెస్టు చేస్తున్నదీ చెప్పకపోవడమే ఆశ్చర్యం.

తనను ఏ కారణాలతో అరెస్టు చేస్తున్నారని సంజయ్‌ నిలదీయడం, అందుకు కారణం చెప్పకుండా ఎదురునిలుచున్న పోలీసులు, నీళ్లు నమిలే దృశ్యాలు ఇప్పటికే సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. చివరాఖరకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో… సంజయ్‌పై క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 151 కింద, కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 147తో కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో బండి సంజయ్‌కు, పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉందా? లేదా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఒకవేళ సంజయ్‌ తన పార్టీ వారితో లీక్‌ చేయించి ఉంటే, ఆయన చట్టపరంగా శిక్షార్హుడే. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మరో అనుచరుడు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారన్నది మరో ఆరోపణ.

మాజీ జర్నలిస్టు ప్రశాంత్‌ కు బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నది మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. అందుకు సదరు ప్రశాంత్‌ బీజేపీ నేతలతో దిగిన ఫొటోలు కూడా బీఆర్‌ఎస్‌ తన వాదనకు మద్దతుగా విడుదల చేసింది.అందులో బీజేపీ నేతలు సంజయ్‌, గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో ప్రశాంత్‌ ఉన్న ఫొటోలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీడియాకు విడుదల చేశారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలోని ఆయన అనుచరుడి పాత్ర కూడా పరీక్ష పత్రాల లీకేజీలో ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. సహజంగా జర్నలిస్టులకు అన్ని పార్టీల వారితోనూ సంబంధాలుంటాయి. కొంతమంది జర్నలిస్టుల ఇజాలు, కులాలు-మతాల బట్టి, రాజకీయనేతలతో మరింత బలమైన సంబంధాలుంటాయి. ఇది బహిరంగ రహస్యమే.

అయితేఅదే నిందితుడు ప్రశాంత్‌కు.. బీఆర్‌ఎస్‌ నేతలతో సంబంధాలున్న వైనాన్ని బీజేపీ సచిత్రంగా బయటపెట్టడం, ఈ వ్యవహారంలో కొత్త మలుపు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ విడుదల చేసింది. మరి ఈ మొత్తం ఎపిసోడ్‌లో నిందితుడు ప్రశాంత్‌, ఏ పార్టీకి సానుభూతిపరుడని అర్ధం చేసుకోవాలన్నది ప్రశ్న. ఫొటోలు కేసుల్లో నిలబడవు. రాజకీయ నేతలతో అనేక మంది ఫొటోలు దిగుతుంటారు. కోర్టుకు కావలసింది కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు మాత్రమే. కాబట్టి, ఈ ఫొటోల ఆరోపణలు నిలబడవు. కాకపోతే రాజకీయంగా రచ్చకు పనికొస్తాయంతే.

ఈ మొత్తం పరిణామంలో ఎవరు దొంగ? ఎవరు దొర అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే.. ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు పోలీసులు.. కనీసం చట్టాన్ని గౌరవించడం లేదని, రాజ్యాంగం ప్రకారం నడచుకోవడం లేదన్న వాస్తవం సంజయ్‌ అరెస్టుతో స్పష్టమయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తరహా అరెస్టులు కేవలం పౌరహక్కుల నాయకులు, విద్యార్ధి సంఘ నాయకుల విషయంలోనే జరిగేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటివి సాధారణమయ్యాయన్నది ప్రజాస్వామ్య పిపాసుల ఆందోళన.

పోలీసులు ఒక వ్యక్తిని అరె స్టు చేసేముందు, అందుకు కారణాలను చెప్పాల్సి ఉంది. ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారన్నదీ చెప్పాలి. ఇక సదరు వ్యక్తికి ముందుగా 41 ఏ సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చిన తర్వాత అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోర్టు నుంచి వారెంటు తీసుకుని అరెస్టు చేయాల్సి ఉంటుంది.

అయితే బండి సంజయ్‌ను అరెస్టు చేసే విషయంలో, తెలంగాణ పోలీసులు ఇలాంటి ప్రాధమిక హక్కులు- సూత్రాలను తుంగలో తొక్కారన్నది ప్రజాస్వామ్యవాదుల ఆరోపణ. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసిన తర్వాత గానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదంటే, చట్టాలు ఏవిధంగా చట్టుబండలవుతున్నాయో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల ఈడీ తనను విచారించిన సందర్భంలో.. అనుమానితులు-నిందితుల హక్కులతోపాటు, చట్టాలను ఉటంకిస్తూ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తు చేస్తున్నారు. మరి ఆ ప్రకారంగా ..నిందితుడు-అనుమానితుడయిన సంజయ్‌కు ఒక పౌరుడిగా ఉన్న హక్కులను, తెలంగాణ పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.

కాగా తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలను, బీజేపీ జాతీయ నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. తన అరెస్టుకు సంబంధించి ఎంపీ సంజయ్‌, లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ప్రివిలేజీ కమిటీకి సైతం ఫిర్యాదు అందింది. అటు బీజేపీ చీఫ్‌ నద్దా కూడా తెలంగాణ నేతలకు ఫోన్‌ చేసి, తాజా పరిణామాలను ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. ఆ సందర్భంగా వారిద్దరూ.. న్యాయపోరాటం చేయాలని నద్దాకు సూచించినట్లు సమాచారం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో హోంశాఖమంత్రి అమిత్‌షా మాట్లాడగా… తెల,గాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్‌ తెలంగాణ సీనియర్లతో, తాజా పరిణామాలపై చర్చించి, ఆందోళన కార్యక్రమాలు ఖరారు చేశారు.

కవిత లిక్కర్‌ కేసుకు ప్రతీకారంగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. తమ నేతలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, టెన్త్‌ లీక్‌ పేపర్లలో ఇరికించిందని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో ఈడీ రంగప్రవేశం చేసినందున, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని, బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. మరి లీకేజీ కేసుల కేంద్రంగా బీఆర్‌ఎస్‌-బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో, ఎవరిది పైచేయో చూడాలి.

LEAVE A RESPONSE