– డిఆర్సి సమావేశంలో ఇన్ చార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) పిలుపు
శ్రీకాకుళం : అందరి సహకారంతో శ్రీకాకుళం జిల్లాను అభివృద్థి చేసుకుందామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన డి.ఆర్.సి. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కొన్ని పనులకు ప్రాధాన్యత ఇచ్చి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ ఆర్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
గ్రామంలో ఏ ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో బాధపడకూడదని, అందు కోసం హెల్త్ క్లినిక్స్, 108,104 వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాడు – నేడు కింద మొదటి దశ, రెండవ దశల్లో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొన్ని పనులను దశల వారీగా చేపడుతున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించి పనులు పూర్తికి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. నియోజకవర్గాల స్థాయిల్లో సమావేశాలను ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొడాలి నాని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.