సిగ్గుపడదాం.. రండి!

( మార్తి సుబ్రహ్మణ్యం)

విడిచేసింది వీధికి పెద్ద అని చింతామణిలో సుబ్బిశెట్టి చెబుతాడు. అప్పుడెప్పుడో ‘తాకట్టులో భారతదేశం’ అని తరిమెల నాగిరెడ్డి గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఇప్పుడు బతికుంటే, ‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ అని కచ్చితంగా ఐదువేల పేజీలతో మరో పుస్తకం రాసేవారు.

తాజాగా ప్రముఖ ఆర్ధిక నిపుణుడు, అభివృద్ధి-సంక్షేమాన్ని జమిలిగా పంచకల్యాణి సైతం ఈర్ష్యపడే స్థాయిలో పరిగెత్తిస్తున్న ఏపీ సీఎం జగన్.. ‘తాకట్టులో సచివాలయం’ తీరు చూసిన తర్వాత, ఆ ముచ్చటను ‘అసలైన ఆర్ధికవేత్త’ విజయసాయిరెడ్డి గానీ, ‘మంగళవారం మంత్రి’ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి గానీ ఎవరో ఒకరు చొరవ తీసుకుని, ఒక పుస్తకం రాస్తే ప్రజల జన్మ ధన్యమవుతుంది.

ఎన్నికల ముందు ఇచ్చిన అలవికాని హామీలకు, ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేసి తీరాల్సిందే. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. అసలు కేంద్రప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తోంది. బతుకుబండి లాగించడానికి అప్పులు అనివార్యం. ఒకప్పుడు ఓవర్‌డ్రాఫ్టులకు వెళ్లిన ప్రభుత్వాలను విపక్షాలు తిట్టిపోసేవి. నాటి ప్రభుత్వాలు కూడా, అందుకు సిగ్గుపడుతూనే ఏదో ఒక వివరణ ఇచ్చుకుని బయటపడేవి. ఓవర్‌డ్రాఫ్టుకు వెళ్లినందుకే రచ్చ ఆ స్ధాయిలో ఉండేది. ‘మా హయాంలో ఒక్కసారి కూడా ఓవర్‌డ్రాఫ్టులకు వెళ్లలేద’ని పాలకులు గొప్పగా చెప్పుకునేవారు.

ఓవర్ డ్రాఫ్టులకు వెళితే ప్రతిపక్షాలు ఎంత గొడవ చేస్తాయోనని నాటి ప్రభుత్వాలు భయపడేవి. ఇప్పుడు పరిమితిదాటిన అప్పులు చేస్తున్నా, పాలకులు పెద్దగా సిగ్గుపడటం లేదు. కేంద్రం ‘నిర్మల’ హృదయంతో ఇస్తోంది. రాష్ట్రం తీసుకుంటోంది! ఆర్‌బీఐ వద్ద ప్రతివారం రుణాలు తీసుకోవడం, ప్రతి మంగళవారం ఢిల్లీలో ఆర్ధికమంత్రి పేషీలో మన మంత్రి పహారా కాస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం.

కానీ ఏకంగా మంత్రులు-ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అధికారులు కొలువుదీరే సచివాలయాన్నే తాకట్టు పెట్టే అఘటనాఘట సమర్థులు, ఈ భూమ్మీద ముఖ్యమంత్రుల రూపంలో ఆర్భవించారన్న విషయం, ప్రపంచ ప్రజలకు ఆలస్యంగా తెలిసింది. సహజంగా భూములు అమ్మి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తీసుకురావడం చూశాం. కానీ ప్రభుత్వ వ్యవస్థకు వేదికయిన సచివాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత ఒక్క జగన్‌రెడ్డికే దక్కుతుంది. ఎలాగూ ఏకంగా సచివాలయ భవనాలనే తాకట్టుపెట్టారు కాబట్టి.. ఇక జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఎమ్మార్వో, వీఆర్వో భవనాలు.. చివరాఖరకు ఆర్టీసీ బస్టాండ్ల బయట ఉండే సులభ్ కాంప్లెక్సులను కూడా తాకట్టుపెట్టినా ఆశ్చర్యం లేదు.ఇక మిగిలింది అసెంబ్లీ, రాజ్‌భవన్ రెండే. పాపం అవిమాత్రం ఏం పాపం చేశాయి? వాటినీ తాకట్టుపెట్టేస్తే పోలా? జగన్‌కు ఇంకా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన రాన ందుకు ప్రజలు ధన్యులు.

నిజంగా ఇంత సిగ్గుమాలిన పని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ సీఎం చేయలేదు. అసలు ఒక బ్యాంకులో సచివాలయాన్నే తాకట్టు పెట్టారంటే, అలాంటి ఆలోచన చేసిన పాలకుడికి, బుర్ర-బుద్ది లేదన్నది సీనియర్ ఐఏఎస్‌ల ఉవాచ. గ్రామాల్లో బాగా బతికిన వారసులు పనిచేయకుండా, తాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మి, తర్వాత అప్పుల పాలయ్యే దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ప్రభుత్వం కూడా సంపద పెంచే దృష్టి పెట్టకుండా, అప్పులు చేసే సోమరిలా మారడం ప్రజల దౌర్భాగ్యం.

పాలకులు ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలుగా మాత్రమే ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలపరిమితి మేరకే వ్యూహాలు-నిర్ణయాలూ ఉండాలి. గత పాలకులు జాగ్రత్తచేసిన ఆస్తులను పప్పుబెల్లాల్లా బ్యాంకుల్లో తాకట్టుపెట్టడమంటే, ప్రజలను తాకట్టుపెట్టడమే. మాజీ సీఎం చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే… ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌రెడ్డి సచివాలయాన్ని మాత్రమే కాదు. ప్రజల ఆత్మగౌరవాన్నీ ఏకకాలంలో తాకట్టుపెట్టారు. ఇంతకన్నా అవమానం, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు.

నిజానికి అది తాకట్టుపెట్టడానికి.. పులివెందుల ఇడుపులపాయ ఎస్టేట్ కాదు. బెంగుళూరు మంత్రి ప్యాలెస్ కాదు. హైదరాబాద్‌లో ఉన్న లోటస్‌పాండూ కాదు. అది ఆంధ్రప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక.

రాష్ట్రం విడిపోయిన సమయంలో సగర్వంగా నిర్మించుకున్న ఓ పరిపాలనా కేంద్రం. దానిని కూడా జగన్ తాకట్టుపెట్టారంటే, ఇక మిగిలింది జనం సంపాదించుకున్న ఆస్తులేనని, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. ఆ తర్వాత జనాల బట్టలుకూడా తాకట్టుపెట్టినా వింతలేదు. గతంలో మతిలేని నిర్ణయాలు తీసుకున్న తుగ్లక్, ఔరంగజేబు, రెండవ పులకేశీ, హిట్లర్ ఉన్నారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు అమరావతిలో చూస్తున్నామన్నది మేధావుల ఆవేదన.

ఒకవైపు కేంద్రం నుంచి తెస్తున్న అప్పులు సరిపోవన్నట్లు.. అదనంగా చేస్తున్న ఇలాంటి తలకుమాసిన ఆలోచనలు పరిశీలిసే, ్త ప్రజల్లో చైతన్యం చేవచచ్చిపోయినట్లు అర్ధమవుతుంది. ప్రశ్నించేవారు లేకపోతే నేతలు నియంతవుతారు. ప్రజల్లో చైతన్యం చేష్టలుడిగి, ప్రభుత్వం విసిరే సంక్షేమాలకు నిర్వికారంగా సోమరిపోతులయితే.. పాలకులు ఎలాంటి నిర్ణయాలయినా తీసుకుంటారు. దానికి ఈ ‘తాకట్టులో సచివాలయమే’ నిలువెత్తు నిదర్శనం! కాదంటారా?

కేవలం 370 కోట్ల కోసం.. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సచివాలయాన్ని తాకట్టుపెట్టిన పాలకుల బుర్రను మ్యూజియంలో పెట్టాల్సిందే. నిస్సహాయులై పరాధీనంతో బతుకుతున్న ప్రజలున్నంతకాలం.. ఇలా ఆత్మగౌవవాన్ని తాకట్టు పెట్టే త‘రాజులు’ ఏ రాష్ట్రంలోనయినా ఉంటారు. అయినా రౌతు మెత్తనవుతే గుర్రం మూడుకాళ్లపై నడిచిందట. జనం అసమర్ధులయితే రాజ్యం ఇలాగే తాకట్టుతో వెలుగుతుంది.
151 సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు వగచి ఉపయోగం లేదు. ఇంటికో లక్ష రూపాయలిచ్చి, వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టే ఇలాంటి తాకట్టు తరాజులే మరోసారి కావాలంటే చేసేదేమీలేదు. మాకు డబ్బులే కావాలి. ఆత్మగౌరవం-ఆవకాయలు అవసరం లేదనుకుంటే ఇంకేం చేయలేం.

అయినా బట్‌నొక్కి, తాకట్టుపెట్టి పాలించడానికి ముఖ్యమంత్రి, ఆయనకో సచివాలయం, క్యాంపు ఆఫీసే అవసరం లేదు. మునిసిపల్ కమిషనర్ ఆఫీసు బయట నిలబడే బిళ్ల బంట్రోతు కూడా ఆ పని చెట్టు కింద కూర్చుని చేయగలడు. రోజూ రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికురాలూ ఆపని చేయగలదు. అప్పంటే అసహ్యించుకునే వికలాంగుడు కూడా ఒంటిచేత్తో బటన్ నొక్కగలడు. అదేమీ గొప్పకాదు.

అప్పులు చేసి ప్రజలను కూడా తాకట్టుపెట్టే.. దిక్కుమాలిన పులకేశీ-తుగ్లక్ రాజ్యంలో బతుకున్న జనాలను చూసి, జాలి పడటం వినా చేసేదేమీ లేదన్నది మేధావుల ఉవాచ. కోరి అందలమెక్కించిన పాపానికి ఆమాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే. సంపద సృష్టించడం తెలియనప్పుడు, ఉన్న సంపదను పరులపాలు చేయడం అసమర్ధ నిర్వాకరమే. దీన్ని పాలకపార్టీ ఏ ముఖం పెట్టుకుని సమర్ధిస్తుందో చూడాలి.

ఇలాగైతే విశాఖ బీచ్ నుంచి నల్లమల అడవుల వరకూ ఉన్న సర్కారు ఆస్తులను, ఈపాటికే తాకట్టు జాబితాలో చేర్చినా ఆశ్చర్యం లేదు. సర్కారువారి పాటలో విశాఖ సముద్రం,బెజవాడలో కృష్ణానది, రాజమండ్రిలో గోదావరి కూడా ఉన్నా వింతలేదు. సచివాలయ తాకట్టు వార్త ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ ఆత్మగౌరవహననం ఎవరికీ తెలియకుండానే అమరావతిలో సమాధి అయ్యేది. ఇలాంటి దా‘రుణాలు’ ఇంకెన్ని ఉన్నాయో, తవ్వితేగానీ తెలియదు. పాలకులు ఇచ్చే సంక్షేమ మత్తులో జోగుతున్న ప్రజలు కళ్లు తెరవనంతవరకూ, ఆంధ్రరాష్ట్రానికి ఇలాంటి అథోగతి తప్పదు. చేసుకున్న వారికి చేసుకున్నంత!

 

Leave a Reply